Share News

new josh ‘నూతన’ జోష్‌

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:40 PM

new josh జిల్లావాసులు కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికారు. నూతన సంవత్సరం తొలిరోజు బుధవారం వేకువజామునే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, గురువులు, నేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

new josh ‘నూతన’ జోష్‌
మంత్రి సంధ్యారాణికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఐసీడీఎస్‌ సిబ్బంది, కార్యకర్తలు

  • అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు క్యూ

  • ఆలయాలు కిటకిట

  • అంతటా సందడే సందడి

పార్వతీపురం/సాలూరు/రూరల్‌/బెలగాం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): జిల్లావాసులు కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికారు. నూతన సంవత్సరం తొలిరోజు బుధవారం వేకువజామునే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, గురువులు, నేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు అధికారులు, ప్రజాప్రతినిధులకు పలువురు బొకేలు, స్వీట్లు, పండ్లు, పుస్తకాలు ఇచ్చి నూతన సంవత్సర విషెష్‌ చెప్పారు. దీంతో జిల్లాలో ఉన్న తాధికారుల క్యాంప్‌ కార్యాలయాలు, రాజకీయ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలు కిటకిటలాడాయి. అయితే గతేడాదితో పోలిస్తే కాస్త సందడి తగ్గింది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతికి సంతాప దినాలు ప్రకటించడంతో చాలా మంది సంబరాలకు దూరంగా ఉన్నారు. మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో సాదాసీదాగా వేడుకలు నిర్వహించారు. మొత్తంగా అంతటా ‘కొత్త’ కళ కనిపించింది.

ప్రజాప్రతినిధుల నివాసాల వద్ద..

సాలూరు పట్టణంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇంటికి కూటమి శ్రేణులు క్యూ కట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ఐసీడీఎస్‌ సిబ్బంది, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకుని మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ దిలీప్‌ కిరణ్‌, ఏఎస్పీ అంకిత సురానాతో పాటు పలువురు అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఉదయం నుంచే పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. మంత్రి నివాసం వైపు బైక్‌ల రాకపోకలను నిలుపుదల చేశారు. ఎక్కడికక్కడే స్టాపర్లను ఏర్పాటు చేశారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌, మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర నివాసాల వద్ద కూడా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పార్వతీపురం, పాలకొండ ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ నివాసాల వద్ద సందడిగా వాతావరణం కనిపించింది.

కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో..

కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ క్యాంప్‌ కార్యాలయానికి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది చేరుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని కోరారు. రక్తహీనత విముక్త జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలన్నారు. జేసీ శోభిక, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్‌ శ్రీవాస్తవ, డీఆర్వో హేమలత, డ్వామా పీడీ రామచంద్రరావు, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో కె.విజయపార్వతి, ఎన్‌జీవో సంఘం నాయకులు కిషోర్‌ తదితరులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డికి పోలీస్‌ అధికారులు, సిబ్బంది ‘నూతన’ విషెష్‌ చెప్పారు. ఏఎస్పీలు దిలీప్‌కిరణ్‌, అంకిత సురానాతో పాటు పోలీస్‌ ఉన్నతాధికారులు , సీఐలు, ఎస్‌ఐలు తదితరులు ఎస్పీని కలుసుకున్నారు. నూతన సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఎస్పీ వారికి సూచించారు. నూతన సంవత్సరంలో మరింత ఉత్సాహంతో పని చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 11:40 PM