No X-Ray గది ఉంది.. ఎక్స్‌రే లేదు!
ABN , Publish Date - Jan 03 , 2025 | 11:07 PM
Room Available, but No X-Ray జియ్యమ్మవలస మండలం చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఎక్స్‌రే ప్లాంటు లేకుండానే రేడియోగ్రాఫర్‌ను నియమించి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఈ విషయాన్ని వైద్యాధికారులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పుష్పశ్రీవాణి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.
ప్లాంటు మంజూరు చేయని అధికారులు
రోగులకు తీవ్ర ఇబ్బందులు
ఇదీ చినమేరంగి సీహెచ్‌సీలో దుస్థితి
జియ్యమ్మవలస, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): జియ్యమ్మవలస మండలం చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఎక్స్‌రే ప్లాంటు లేకుండానే రేడియోగ్రాఫర్‌ను నియమించి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఈ విషయాన్ని వైద్యాధికారులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పుష్పశ్రీవాణి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అసలు 2012లో ఈ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లోనే ఎక్స్‌రే ప్లాంటు కోసం సీహెచ్‌సీలో ఒక గదిని కేటాయించారు. అయితే వివిధ కారణాలతో ఎక్స్‌రే ప్లాంటు, పరికరాలను మంజూరు చేయలేదు. 2023 మార్చిలో ఎస్.రవికుమార్ అనే వ్యక్తిని రేడియో గ్రాఫర్‌గా నియమించారు. కానీ ఎక్స్‌రే ప్లాంటు మంజూరు చేయకపోవడం వల్ల ఆయన ఇన్, ఔట్ పేషెంట్లకు ఓపీ, ఐపీ రశీదులు రాయడం వరకే పరిమితమయ్యారు. వాస్తవానికి ఈ సీహెచ్‌సీకి రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నెలకు కనీసం ఐదు నుంచి పది యాక్సిడెంట్ కేసులు ఇక్కడకు వస్తుంటాయి. క్షతగాత్రులకు ఎక్స్‌రే తీసుకోవాలని వైద్యులు సూచిస్తుండగా.. సీహెచ్‌సీలో ఆ సదుపాయం లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసర వేళల్లో కురుపాం సీహెచ్‌సీ , పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాసుపత్రికి పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎక్స్‌రే ప్లాంటు మంజూరుకు చర్యలు తీసుకోవాలని 115 గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం
చినమేరంగి సీహెచ్‌సీలో ఎక్స్‌రే ప్లాంటు విషయంలో ప్రతిపాదనలు పంపించాం. త్వరలో ప్లాంటు మంజూరు కానుంది. గతంలో ఆ సీహెచ్‌సీలో ఓపీ తక్కువగా ఉండడం వల్ల అది మంజూరు కాలేదు. ఇప్పుడు ఓపీ పెరగడంతో ప్రతిపాదనలు పంపించాం.
- వాగ్దేవి, డీసీహెచ్‌ఎస్, పార్వతీపురం మన్యం