Share News

కూటమి చొరవతో ‘సౌర’భాలు

ABN , Publish Date - Jan 01 , 2025 | 12:27 AM

Solar Glory Through kutami Initiative సీతంపేట మన్యంలోని ఎస్టీ, ఎస్టీ గ్రామాలు సౌర వెలుగులతో కళకళలాడనున్నాయి. కూటమి ప్రభుత్వం చొరవతో కొత్తరూపును సంతరించు కోనున్నాయి. ఇప్పటికే అధికారులు సర్వే పూర్తి చేశారు. సూర్యఘర్‌ పథకం కింద పలు గృహాలను ఎంపిక చేశారు. నివేదికలు సైతం పంపించారు.

 కూటమి చొరవతో  ‘సౌర’భాలు
సూర్యఘర్‌ సోలార్‌ ప్లేట్లు

ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే సర్వే పూర్తి

యూనిట్‌ ధర భరించేందుకు చర్యలు

జిల్లావాసుల్లో హర్షం

సీతంపేట రూరల్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యంలోని ఎస్టీ, ఎస్టీ గ్రామాలు సౌర వెలుగులతో కళకళలాడనున్నాయి. కూటమి ప్రభుత్వం చొరవతో కొత్తరూపును సంతరించు కోనున్నాయి. ఇప్పటికే అధికారులు సర్వే పూర్తి చేశారు. సూర్యఘర్‌ పథకం కింద పలు గృహాలను ఎంపిక చేశారు. నివేదికలు సైతం పంపించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆయా గ్రామాల్లో సౌర వెలుగులు నింపేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అవసరమైతే యూనిట్‌ ధరను కూడా భరించనుంది. మొత్తంగా కూటమి ప్రభుత్వ నిర్ణయంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కూటమి ముందడుగు..

గిరిజన, మైదాన ప్రాంతాల్లో సౌర విద్యుత్‌ వినియోగాన్ని పెంచి సామాన్యులపై విద్యుత్‌ చార్జీల భారం తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్‌ ముఫ్ట్‌ బిజ్లీ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం వల్ల గిరిజనులకు ఎంతో మేలు చేకూరే అవకాశాలు ఉన్నా.. యూనిట్‌ ధర ఎక్కువగా ఉండడం, ముందస్తుగా డిపాజిట్‌ చేయాల్సి ఉండడంతో గిరిపుత్రులు ముందుకు రావడం లేదు. మరోవైపు గిరిశిఖర గ్రామాల్లో ఈ పథకం కింద యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుకూల పరిస్థితులు లేవు. దీంతో ఏజెన్సీలో సౌర వెలుగులు కానరావడం లేదు. సౌర విద్యుత్‌ వినియోగంపై అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. అయితే దీనిపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం ఎస్టీ, ఎస్సీల కోసం ముందడుగు వేసింది. ఆయా గ్రామాల్లో సౌర వెలుగుల కోసం చర్యలు చేపడుతోంది.

ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో సర్వే

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల కాలంలో విద్యుత్‌శాఖ అధికారులు పాలకొండ నియోజకవర్గంలో రూఫ్‌టాప్‌ గృహాల సర్వే చేపట్టారు. పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, భామిని మండలాల్లో రూఫ్‌టాప్‌(శ్లాబు) ఉన్న ఎస్సీ, ఎస్టీ గృహాలు 21,302 ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీని ఆధారంగా చేసుకొని సూర్యఘర్‌ పథకం ఏర్పాటుకు అయ్యే యూనిట్‌ ధరను ఎస్సీ, ఎస్టీల కోసం కూటమి ప్రభుత్వం భరించనుంది. ఇదే కార్యరూపం దాల్చితే గిరిజన ప్రాంతాల్లో ఇక పై సౌర వెలుగులు కనిపించనున్నాయి.

నియోజకవర్గంలో ఇలా..

పాలకొండ నియోజకవర్గం పరిధిలోని పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాల నుంచి సూర్యఘర్‌ సోలార్‌ రూఫ్‌టాప్‌ కోసం 128 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 10 మంది లబ్ధిదారులు చెల్లింపులు చేశారు. వీరఘట్టంలో ఒకరు, పాలకొండలో ఐదుగురు, భామినిలో ఒకరు 20 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ రూఫ్‌టాప్‌లను వినియోగిస్తున్నారు. మిగిలిన ముగ్గురు వినియోగదారులు కూడా నగదు చెల్లించారు. వారు కూడా త్వరలో తమ ఇళ్లపై సోలార్‌ రూఫ్‌టాప్‌లు ఏర్పాటు చేయనున్నారు.

సబ్సిడీ ఇలా..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూర్యఘర్‌ ముఫ్ట్‌ బిజ్లీ యోజన పథకం కింద వినియోగదారుడు వన్‌ కేవీ ప్యానెల్‌ బోర్డు ఏర్పాటుకు రూ.83 వేలు చెల్లించాలి. అయితే తిరిగి ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.30వేలు వినియోగదారుడి ఖాతాకు జమ చేస్తుంది. 2కేవీ ప్యానెల్‌ బోర్డు కోసం రూ.1.44వేలు చెల్లిస్తే సబ్సిడీ రూపంలో వినియోగదారుడికి తిరిగి రూ.60వేలు చెల్లిస్తారు. గృహ అవసరాల కోసం 2కేవీ రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్‌ బిల్లు ఆదా అవుతుంది. మిగులు కరెంటును విద్యుత్‌శాఖకు విక్రయిస్తే కొంత మొత్తంలో నగదు కూడా వినియోగదారుడికి వచ్చే పరిస్థితి ఉంది.

ఆర్థిక భారంతో వెనకడుగు

సీతంపేట ఏజెన్సీలో చాలామంది గిరిజనులకు సూర్యఘర్‌పై అవగాహన లేదు. మరికొందరికి ఈ పథకం గురించి తెలిసినప్పటికీ యూనిట్‌ ధర, డిపాజిట్‌ చెల్లింపునకు జడిసి వెనుకడుగు వేస్తున్నారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన లబ్ధిదారులకు ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తోంది. దీంతో సూర్యఘర్‌ పథకంపై ఆదివాసీలు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికరకు సీతంపేట ఏజెన్సీలో 84 మంది గిరిపుత్రులు ‘సూర్యఘర్‌’ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారిలో ఎవరూ యూనిట్‌ ఏర్పాటు, డిపాజిట్‌ చెల్లించడానికి ముందుకు రాలేదు.

ట్రాన్స్‌కో డీఈ ఏమన్నారంటే...

‘ సూర్యఘర్‌ పథకం గిరిజన ప్రాంతాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే యూనిట్‌ ధర, డిపాజిట్‌ చెల్లించేందుకు గిరిజనులు ఆసక్తి చూపడం లేదు. అందుకే వినియోగదారులకు బ్యాంక్‌ రుణం కూడా ఇప్పిస్తామని చెబుతున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో సర్వే చేపట్టాం. సూర్యఘర్‌ పథకంపై అవగాహన కల్పిస్తున్నాం.’ అని ట్రాన్స్‌కో డీఈ గోపాలకృష్ణ తెలిపారు.

Updated Date - Jan 01 , 2025 | 12:27 AM