పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక కృషి
ABN , Publish Date - Jan 08 , 2025 | 12:45 AM
రాష్ట్రంలో పారిశ్రామికంగా ప్రగతి పరుగులు తీసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
బొబ్బిలి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పారిశ్రామికంగా ప్రగతి పరుగులు తీసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం బొబ్బిలిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో జరుగుతున్న పుష్పయాగాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్ధానిక ఏపీఐఐసీ గ్రోత్ సెంటరు రోజురోజుకు నీరసించిపోతోందని, ఇక్కడ అధికారులు, ఉద్యోగులు ఎవరూ పూర్తిస్ధాయిలో లేకపోవడంతో అందరికీ అసౌకర్యంగా ఉందని మంత్రి దృష్గికి తీసుకురాగా ఆయన స్పందించారు. ఏపీఐఐసీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఆ సంస్థ ఎండీని రప్పించి చర్చించామన్నారు. బొబ్బిలి గ్రోత్ సెంటరులో సదుపాయాల కల్పన చాలా అవసరమని గుర్తించామన్నారు. వాటికోసం ప్రత్యేకంగా అంచనాలు తయారు చేయించామన్నారు. పరిశ్రమల ఏర్పాటు కోసం స్ధలాలు తీసుకుని ఎటువంటి యూనిట్లను స్ధాపించని వారి విషయమై గట్టిగా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. గజపతినగరం నియోజకవర్గ పరిధిలో మరుపల్లిలో కూడా 80 ఎకరాల ఏపీఐఐసీ స్ధలం వృథాగా ఉన్నట్లు గుర్తించామన్నారు. మండలానికి ఒకరు, నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఐపీఓలను నియమిస్తామన్నారు. పరిశ్రమలను ఏర్పాటు చేయదలుచుకున్న వారికి ప్రభుత్వ పరంగా పూర్తిస్ధాయి సమాచారం అందించేందుకు, వారిని ప్రోత్సహించేందుకు ఐపీఓలు సేవలందిస్తారన్నారు. ఐదేళ్ల పాటు రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడేమో కూటమి ప్రభుత్వంపై హేళనగా మాజీ మంత్రి అమర్‌నాథ్ మాట్లాడడం తగదన్నారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతిపక్షానికి చెందిన వారికి సైతం రాష్ట్ర బాగోగుల పట్ల బాధ్యత ఉండాలన్నారు. అలా కాకుండా వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కేవలం ఆరునెలల పాలనలో రాష్ర్టాన్ని అభ్యుదయం వైపు నడిపించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు చేస్తున్న కృషిని ప్రజలు బాగా అర్ధం చేసుకున్నారన్నారు. విశాఖలో బుధవారం జరగనున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ రోడ్‌షో, బహిరంగసభలకు జిల్లా నుంచి 40 వేల మందిని తరలించే ఏర్పాట్లు చేశామని మంత్రి కొండపల్లి తెలిపారు. సభకు హాజరైన వారిలో 50 శాతం మంది మహిళలే ఉంటారన్నారు. -మంత్రి వెంట బొబ్బిలి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గెంబలి శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలరు ఏగిరెడ్డి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.