TDP membership registration టీడీపీ సభ్యత్వ నమోదు విజయవంతం
ABN , Publish Date - Jan 01 , 2025 | 12:39 AM
TDP membership registration: జిల్లాలో గత నవంబరు 26న ప్రారంభించిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
- పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు
- జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం
విజయనగరం రూరల్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత నవంబరు 26న ప్రారంభించిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. వాటిని పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున విలేకరులకు వెల్లడించారు. ‘పార్టీ సభ్యత్వ నమోదు తుది గడువును అధిష్ఠానం ఇంకా ప్రకటించనందున జిల్లాలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించాం. పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ నెల తొలి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించనున్న నామినేటేడ్ పదవుల్లో కష్టపడే వారికి అవకాశం ఇవ్వాలి. ఇందుకు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సమష్టిగా నిర్ణయం తీసుకోవాలి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా, ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంచారు. వీటితో పాటు పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నాం.’అని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కోళ్ల లలిత కుమారి, బేబినాయన, అదితి గజపతిరాజు, మార్కెఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, జిల్లా కార్యాలయ కార్యదర్శి పి రాజేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.