Share News

ap government: పింఛన్ల పెంపు ఘనత కూటమి ప్రభుత్వానిదే

ABN , Publish Date - Jan 01 , 2025 | 12:37 AM

ap government:దేశంలో క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తేదీన సామాజిక పింఛన్లు అందించడమే కాకుండా, పింఛన్‌ మొత్తాన్ని పెంచిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

ap government: పింఛన్ల పెంపు ఘనత కూటమి ప్రభుత్వానిదే
వృద్ధురాలికి పింఛన్‌ సొమ్ము అందిస్తున్న మంత్రి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే అదితి, తూర్పుకాపు కార్పొరేషన్‌ చైరపర్సన్‌ యశస్విని

విజయనగరం రూరల్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): దేశంలో క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తేదీన సామాజిక పింఛన్లు అందించడమే కాకుండా, పింఛన్‌ మొత్తాన్ని పెంచిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విజయనగరం మండలం జొన్నవలస, నగర పరిధిలోని బొబ్బాదిపేటలో మంగళవారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో కలిసి ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.3వేల నుంచి రూ.4 వేలకు పింఛన్‌ మొత్తాన్ని పెంచినట్లు చెప్పారు. భర్త చనిపోయిన భార్య(వితంతువు)కు నెలరోజుల్లోనే పింఛన్‌ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 5 వేల మందికి కొత్తగా వితంతు పింఛన్లు అందించినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఒక నెల పింఛన్‌ తీసుకోకపోతే, ఆ మొత్తం ప్రభుత్వ ఖాతాలో జమయ్యేదన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం మూడు నెలల పింఛన్‌ను ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించిందని అన్నారు. ఎంపీ కలిశెట్టి మాట్లాడుతూ.. ఏదైన నెలలో 1వ తేదీ ప్రభుత్వ సెలవు దినం అయితే, ముందు రోజే పింఛన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లతో పేదల జీవితాల్లో వెలుగులు వికసిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పాలవలస యశస్విని, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 12:37 AM