Trouble with Joint ‘జాయింట్’ జంఝాటం!
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:38 PM
The Trouble with Joint భూ సమస్యల పరిష్కారానికే రీ సర్వే ప్రక్రియ చేపడుతున్నట్లు గత వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పకుంది. అయితే ఆచరణలో మాత్రం రైతులకు ఇబ్బందులకు గురి చేసింది. ఈ ప్రక్రియతో వివాదాలు పరిష్కరించకపోగా కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. అంతా తప్పుల తడక. రెవెన్యూ రికార్డులను గందరగోళం చేశారు.
నాడు ఇష్టారాజ్యంగా రీసర్వే చేసిన అధికారులు
జాయింట్ ఎల్‌పీఎంలతో రైతులకు తిప్పలు
ఉచితంగా సింగిల్ ఎల్‌పీఎం ఇవ్వాలని వేడుకోలు
జియ్యమ్మవలస, జనవరి1 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారానికే రీ సర్వే ప్రక్రియ చేపడుతున్నట్లు గత వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పకుంది. అయితే ఆచరణలో మాత్రం రైతులకు ఇబ్బందులకు గురి చేసింది. ఈ ప్రక్రియతో వివాదాలు పరిష్కరించకపోగా కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. అంతా తప్పుల తడక. రెవెన్యూ రికార్డులను గందరగోళం చేశారు. ప్రధానంగా భూములు లేనివారికి ఉన్నట్లు, ఉన్నవారికి లేనట్లు, భూ విస్తీర్ణం తక్కువ, ఎక్కువగా నమోదు చేశారు. కాగా ప్రస్తుతం జాయింట్ ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్‌పీఎం)ల అంశం దుమారం రేపుతోంది. దీనివల్ల రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ సదస్సుల్లో దీనిపైనే అధికంగా అర్జీలు సమర్పిస్తున్నారు. ఉచితంగా సింగిల్ ఎల్‌పీఎం ఇవ్వాలని వేడుకుంటున్నారు. అయితే వాటిని సరిచేయడం కోసం రెవెన్యూ అధికారులు రికార్డులతో కుస్తీ పడుతున్నారు.
జాయింట్ ఎల్‌పీఎం అంటే?
రెవెన్యూ రికార్డుల ప్రకారం రైతులుకున్న భూమికి సంబంధించి ఒక ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్‌పీఎం) ఉంటుంది. దీనివల్ల అన్నదాతలు తమకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆన్‌లైన్‌లో వన్‌బీ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా బ్యాంకు, కోఆపరేటివ్ సొసైటీ, ఎవరైనా వడ్డీ వ్యాపారస్థుని నుంచి రుణం తీసుకునే అవకాశం ఉంది. కుటుంబ అవసరాలకు పొలాన్ని అమ్ముకునే వెసులుబాటు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే తన భూమిపై రైతుకు పూర్తి హక్కు ఉండేది. అయితే జగనన్న భూసర్వే పుణ్యమా అని ఆ అవకాశం చాలామంది రైతులకు లేకుండాపోయింది. కారణం జాయింట్ ఎల్‌పీఎం ఇవ్వడమే. ఇద్దరు, అంతకంటే ఎక్కువమంది రైతులకు ఒకే ఎల్‌పీఎం ఇవ్వడం వల్ల ఎవరికీ వన్ బీ రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలోని 15 మండలాల్లో 965 గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో 5,78,016.39 ఎకరాలు ఉన్నాయి. కాగా 2020 డిసెంబరు 21 నుంచి రీసర్వే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే తొలి విడతగా 95 గ్రామాల పరిఽధిలో 38,876.08 ఎకరాలు, రెండో విడతలో 153 గ్రామాల్లో 92,079.66 ఎకరాల్లో, మూడో విడత 56 గ్రామాల పరిధిలో 38,966.46 ఎకరాల్లో రీసర్వే జరిగింది.
కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంకా ఎటువంటి భూసమస్యలు ఉన్నాయనే దానిపై సర్వే సిబ్బంది ఆయా గ్రామాలను పరిశీలించారు. ఈ క్రమంలో మొత్తంగా 31,002 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 9,852 జాయింట్ ఎల్‌పీఎంలపైనే దరఖాస్తులు ఉన్నాయని సర్వే వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా రీసర్వే జరిగిన 317 గ్రామాల్లో 18,746 జాయింట్ ఎల్‌పీఎంలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిని ఉపయోగించుకొని సింగిల్ ఎల్‌పీఎం చేయడానికి రూ. 550 కట్టాలని, లేకపోతే జరగదని గత ప్రభుత్వ హయాంలో అధికారులు తేల్చి చెప్పారు. దీంతో చేసేది లేక కొంతమంది ఆ మొత్తం చెల్లించి తమ ఖాతాలను సింగిల్ ఎల్‌పీఎంలుగా మార్చుకున్నారు. అయితే ఇంకా జిల్లాలోఎంతోమందికి జాయింట్ ఎల్‌పీఎంలు ఉన్నాయి.
గత ప్రభుత్వ తప్పిదం..
గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులకు తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఇష్టారాజ్యంగా రీసర్వే చేసి ఇద్దరు, అంతకంటే ఎక్కువమంది రైతుల భూములకు ఒక జాయింట్ ఎల్‌పీఎం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. రికార్డులను ఇష్టారాజ్యంగా మార్చిన గత ప్రభుత్వం వాటిని సరి చేయడానికి మళ్లీ తమ నుంచి రూ.550 వరకు ఫీజు వసూలు చేసిందని అన్నదాతలు వాపోతున్నారు. అయినా పూర్తిస్థాయిలో సమస్య పరిష్కరించలేదని వెల్లడిస్తున్నారు. ఇదిలాఉండగా జాయింట్ ఎల్‌పీఎంలను సరిచేసేందుకు ప్రస్తుతం రెవెన్యూ సిబ్బంది యూజర్ చార్జీల పేరిట రూ.500 వసూలు చేస్తుండడాన్ని వారు తప్పుబడుతున్నారు. కొన్నిచోట్ల వీఆర్‌వోలు, సర్వేయర్లు కొంత మొత్తంలో వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. జాయింట్ ఎల్‌పీఎంలన్నీ ఈ నెలాఖరులోగా సరిచేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఉచితంగా ఈ ప్రక్రియ చేపట్టాలని వారు కోరుతున్నారు. రైతులపై భారం లేకుండా చేడాలని వేడుకుంటున్నారు.
ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది
ఉచితంగా జాయింట్ ఎల్‌పీఎంల సమస్య పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగు చర్యలు తీసుకుంటున్నారని రెవెన్యూ శాఖ మంత్రి చెప్పారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన ఆరు జిల్లాల ఉన్నతాధికారుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే కొంతమంది రైతులు సింగిల్ ఎల్‌పీఎం ఇవ్వాలని యూజర్ చార్జీలు చెల్లిస్తున్నారు.
- పి.లక్ష్మణరావు, భూ సర్వే ఏడీ, పార్వతీపురం మన్యం