Share News

bhogi నేడే భోగి

ABN , Publish Date - Jan 13 , 2025 | 12:03 AM

Today is Bhogi సంక్రాంతి వచ్చేసింది. ఊరు.. వాడకు నూతన సోయగాన్ని తెచ్చేసింది. ఆబాలగోపాలం ఆనందంతో కేరింతలు కొట్టే సమయం ఆసన్నమైంది. భోగి రూపంలో సంక్రాంతి అందరికీ ఆహ్వానం పలికింది. ఆదివారం నాటికి జిల్లా వాసులంతా దాదాపు వచ్చేశారు. ఎక్కడెక్కడో పనిచేసుకుంటూ జీవిస్తున్న వారంతా కుటుంబాలతో దిగిపోయారు.

bhogi నేడే భోగి
బొబ్బిలి: భోగి పిడకల దండలతో చిన్నారులు

నేడే భోగి

సందడి చేసేందుకు ప్రజలంతా సిద్ధం

భోగి పిడకలతో చిన్నారుల కేరింత

విజయనగరం, జనవరి 12(ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి వచ్చేసింది. ఊరు.. వాడకు నూతన సోయగాన్ని తెచ్చేసింది. ఆబాలగోపాలం ఆనందంతో కేరింతలు కొట్టే సమయం ఆసన్నమైంది. భోగి రూపంలో సంక్రాంతి అందరికీ ఆహ్వానం పలికింది. ఆదివారం నాటికి జిల్లా వాసులంతా దాదాపు వచ్చేశారు. ఎక్కడెక్కడో పనిచేసుకుంటూ జీవిస్తున్న వారంతా కుటుంబాలతో దిగిపోయారు. వారి రాకతో పల్లెలు కళకళలాడుతున్నాయి. ఏడాదిలో ఎన్ని పండుగలున్నా సంక్రాంతి ప్రత్యేకత, విశిష్టత వేరు. ఏటా మాదిరిగా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. ఇప్పటికే అందరి ఇళ్లల్లో కోలాహలం నెలకొంది. అల్లుళ్లు, కూతుళ్లు, మనుమలు, మనుమరాళ్లతో కొత్తశోభ ప్రస్ఫుటమవుతోంది. పల్లెల్లో ప్రతి ఇంటి వాకిట రంగవల్లులు ముచ్చట గొలుపుతున్నాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు సంక్రాంతికి నిండుదనాన్నిస్తున్నాయి. పండుగలో భాగంగా తొలి రోజు భోగిని ఆనందంగా జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు. వివిధ ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థలు తమ, తమ ప్రాంతాల్లో భోగి మంటలు వేసుకునేందుకు ఏర్పాట్లు చేశాయి. కర్రలు, చెక్కలు సేకరించాయి. చిన్నారులు భోగి పిడకలను తయారు చేసి దండగా కట్టారు. ఇక సోమవారం ఉదయం 3 నుంచి 4 గంటల మధ్య భోగి మంటలు వేసుకుని పండుగ వేళలను ఆస్వాదించడమే తరువాయి.

నేడు గోదాదేవి కల్యాణం

భోగి పండుగ రోజు గోదాదేవి కల్యాణం నిర్వహిస్తారు. వేంకటేశ్వరస్వామి, కృష్ణా ఆలయాల్లో, ముఖ్యంగా వైష్ణవ ఆలయాల్లో గోదాదేవి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. జిల్లా కేంద్రంలోని మన్నార్‌ రాజగోపాలస్వామి ఆలయం, శివాలయం వీధిలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, తోటపాలెంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం, రింగురోడ్డులోని కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయాలు గోదాదేవి కల్యాణం జరుపుకునేందుకు ఏర్పాట్లు పూర్తిచేశాయి.

Updated Date - Jan 13 , 2025 | 12:03 AM