Share News

Will It Be Completed పండగలోపు పూర్తయ్యేనా?

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:20 AM

Will It Be Completed Before the Festival? పార్వతీపురం నుంచి పాలకొండ వైపు వెళ్లే ప్రధాన రహదారి పనులకు మోక్షం లభించడం లేదు. ప్యాచ్‌ వర్కులు పూర్తికాకపోవడంతో వాహన దారులు, ప్రయాణికులు ఇబ్బందులు తప్పడం లేదు.

Will It Be Completed పండగలోపు పూర్తయ్యేనా?
కోటవానివలస ప్రాంతంలో రహదారి దుస్థితి

  • నిధులు మంజూరైనా.. పూర్తికాని ప్యాచ్‌ వర్కులు

  • కొంతమేర పనులైనా.. ఇటీవల కురిసిన వర్షాలకు యథాస్థితి

  • అడుగడుగునా గోతులతో ప్రమాదకరంగా మారిన రహదారి

  • రాకపోకలు సాగించలేకపోతున్న వాహనదారులు

  • సంక్రాంతి లోగా రోడ్డు మెరుగుపర్చాలని సర్కారు ఆదేశం

  • ఆలోపుగా పూర్తవడం కష్టమే..

  • ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించాలని విన్నపం

గరుగుబిల్లి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం నుంచి పాలకొండ వైపు వెళ్లే ప్రధాన రహదారి పనులకు మోక్షం లభించడం లేదు. ప్యాచ్‌ వర్కులు పూర్తికాకపోవడంతో వాహన దారులు, ప్రయాణికులు ఇబ్బందులు తప్పడం లేదు. అసలే ఇది పండగ సమయం. సాధారణ రోజులతో పోలిస్తే.. ఈ మార్గం కూడా రాకపోకలు సాగించే వాహనదారుల సంఖ్య పెరిగింది. అయితే పట్టుమని కిలోమీటరు కూడా వారు సాఫీగా ప్రయాణించలేకపోతున్నారు. అడుగడుగునా ఏర్పడిన భారీ గోతుల కారణంగా నానా అవస్థలు పడుతున్నారు. మరికొందరు ప్రమాదాలకు గురువుతున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో ఎంతో కీలకమైన పార్వతీపురం-పాలకొండ ప్రధాన రహదారిపై గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మరమ్మతులకు నిధులు కూడా మంజూరు చేయలేదు. దీంతో ఈ రోడ్డు భారీ గోతులతో మరింత అధ్వానంగా మారింది. గత ఐదేళ్లూ వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ సమస్యలను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం ఈ రోడ్డుపై దృష్టి సారించింది. ఈ మేరకు చిన్నపాటి గోతులు పూడ్చివేతకు రూ.40 లక్షలు మంజూరు చేశారు. ఈ మొత్తంతో సంతోషపురం వరకూ పనులు చేపట్టినా ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మళ్లీ యథాస్థితి నెలకొంది. ప్రస్తుతం పార్వతీపురం, ఉల్లిభద్ర, సంతోషపురం, ఖడ్గవలస, రావివలస నుంచి పాలకొండ వరకు అడుగడుగునా భారీగా గోతులే దర్శనమిస్తున్నాయి. చీకటి పడిందంటే ఈ మార్గం గుండా ప్రయాణాలు సాగించలేని పరిస్థితి నెలకొంది. ఒకవైపు వాహనాల మరమ్మతులకు గురికాగా మరోవైపు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

- పార్వతీపురం నుంచి ఉల్లిభద్ర, సంతోషపురం వరకు ఉన్న గోతులను పూడ్చేందుకు రూ. 40 లక్షలు కేటాయించగా.. ఇందులో రూ.10 లక్షలు పనుల కోసం వెచ్చించగా బిల్లులు మంజూరవాల్సి ఉంది. ఉల్లిభద్ర, తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని కుడి ప్రధాన కాలువ ప్రాంతంలో అవసరమైన పనులకు రూ. 1.50 కోట్లుతో ప్రతిపాదనలు చేశారు. ఈ పనులకు సంబంధించి టెండరు ప్రక్రియ ప్రారంభం కాలేదు.

- ఉమ్మడి జిల్లాలకు ఒక్కరే కాంట్రాక్టర్‌ ఉండడంతో రహదారి అభివృద్ధి పనులు జాప్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని రహదారుల మరమ్మతులకు అగ్రిమెంట్‌ కుదిరినా పనులు నిర్వహించడం లేదు. ప్యాచ్‌ వర్కులు కూడా చేయడం లేదు. ప్రస్తుతం విజయనగరంలో పనులు నిర్వహిస్తున్నారు. అక్కడ పూర్తయిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతి లోగా రహదారులను మెరుగుపరుస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. పండగ లోపుగా ఈ పనులు పూర్తవడం కష్టమేనని వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనిపై ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించాల్సి ఉంది.

పనులు పూర్తికి చర్యలు

పార్వతీపురం-పాలకొండ ప్రధాన రహదారి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కాంట్రాక్టర్లను సంప్రదించి.. పనులు ప్రారంభానికి ఒత్తిడి తెస్తున్నాం. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నాం. వర్షాల కారణంగా మొదట్లో ప్రారంభించిన ప్యాచ్‌ వర్కు పనులు కొంతమేర పాడయ్యాయి. తిరిగి ఆయా ప్రాంతాల్లో పనులు నిర్వహిస్తాం.

- వి.రామ్మోహనరావు, జేఈ, ఆర్‌అండ్‌బీ శాఖ, పార్వతీపురం

Updated Date - Jan 06 , 2025 | 12:20 AM