go to visakha హుషారుగా విశాఖకు
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:45 PM
Wisely to Visakha పీఎం మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లు విశాఖకు బుధవారం వస్తున్న నేపథ్యంలో హుషారుగా.. విశాఖకు బయలు దేరేందుకు కూటమి శ్రేణులు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. వివిధ మార్గాల ద్వారా ఆంధ్రాయూనివర్సిటీ మైదానానికి చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
హుషారుగా విశాఖకు
పీఎం, సీఎంల సభకు భారీగా కూటమి శ్రేణులు
మేం సైతం అంటున్న మహిళలు
సామాజిక మధ్యామాల ద్వారా విస్తృత ప్రచారం
విజయనగరం, జనవరి 7(ఆంధ్రజ్యోతి):
పీఎం మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లు విశాఖకు బుధవారం వస్తున్న నేపథ్యంలో హుషారుగా.. విశాఖకు బయలు దేరేందుకు కూటమి శ్రేణులు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. వివిధ మార్గాల ద్వారా ఆంధ్రాయూనివర్సిటీ మైదానానికి చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు డ్వాక్రా మహిళలు కూడా అధిక సంఖ్యలో బయలుదేరి వెళ్తున్నారు. మేం సైతం అంటూ పెద్ద ఎత్తున పయనమౌతున్నారు. నరేంద్రమోదీ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా విశాఖకు వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనను కూటమి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అనకాపల్లి జిల్లాలోని పూడిమడకలో ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ చెందిన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, రైల్వే రోడ్డు ప్రాజెక్టు, విశాఖలో రైల్వే ప్రధాన కార్యాలయానికి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం నుంచే ఆయన వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. పీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు సమన్వయ సమావేశాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. మరోవైపు విజయనగరం, నెల్లిమర్ల, ఎస్‌కోట, బొబ్బిలి, చీపురుపల్లి, ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, లోకంనాగమాధవి, కోళ్ల లలితకుమారి, బేబీనాయన, కళావెంకటరావు, ఎన్.ఈశ్వరరావు, కోండ్రు మురళీమోహన్‌లు ఇప్పటికే నియోజకవర్గాల పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. గజపతినగరం ఎమ్మెల్యే, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అందరి ఎమ్మెల్యేలతో మాట్లాడడంతో పాటు, గజపతినగరం నియోజకవర్గం నుంచి కూడా ఎక్కువ మంది కూటమి శ్రేణులు హాజరయ్యేలా నిర్దేశించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా కూటమి శ్రేణులతో మంగళవారం విస్తృతంగా మాట్లాడారు. మరోవైపు టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున కూడా పీఎం, సీఎం పర్యటనలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విజయనగరం నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బయలుదేరేందుకు నిర్ణయించారు.
--------------