YCP Misdeeds వైసీపీ నిర్వాకం..కూటమిపై భారం
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:15 AM
YCP Misdeeds: Burden on the Alliance గత వైసీపీ ప్రభుత్వం ఎంతో హడావుడిగా వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. అయితే మౌలిక వసతులను మాత్రం మరిచింది. ఐదేళ్లలో సొంత భవనాలను కూడా నిర్మించలేకపోయింది. దీంతో నేటికీ వార్డు సచివాలయాలు పరాయి పంచనే కొనసాగుతున్నాయి.
పరాయి పంచనే కొనసాగుతున్న వైనం
హడావుడిగా ఏర్పాటు చేసి.. భవనాలు నిర్మించని గత ప్రభుత్వం
ప్రతినెలా భారీగా అద్దెలు చెల్లింపు
కూటమి సర్కారుపై భారం
పార్వతీపురం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం ఎంతో హడావుడిగా వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. అయితే మౌలిక వసతులను మాత్రం మరిచింది. ఐదేళ్లలో సొంత భవనాలను కూడా నిర్మించలేకపోయింది. దీంతో నేటికీ వార్డు సచివాలయాలు పరాయి పంచనే కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో సచివాలయాలకు సొంత భవనాలు ఏర్పాటు చేశారు. కానీ పట్టణ పరిధిలో ఈ అవకాశం లేకుండాపోయింది. ప్రత్యేక నిధులతో పాటు స్థలాలను సమకూర్చాలిన వైసీపీ సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో అవి సొంత భవనాలకు నోచుకోలేదు. ఏదేమైనా గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సచివాలయాల అద్దెల భారం కూటమి ప్రభుత్వంపై పడింది.
ఇదీ పరిస్థితి..
జిల్లా కేంద్రం పార్వతీపురంలో 15, సాలూరు పట్టణంలో 14, పాలకొండలో తొమ్మిది సచివాలయాలు ఉన్నాయి. పాలకొండలో ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన భవనాల్లో రెండు సచివాలయాలను నిర్వహిస్తున్నారు. మిగిలిన ఏడు కూడా అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. సాలూరు పట్టణంలో ఉన్న 14 సచివాయాలకూ సొంత భవనాలు లేవు. పార్వతీపురంలో 15 సచివాలయాలు ఉండగా.. పార్వతీపురం మున్సిపాలిటీకి చెందిన ఓ ప్రభుత్వ భవనంలో ఒక సచివాలయాన్ని నిర్వహిస్తున్నారు. మిగలినవన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వాటి కోసం ప్రతినెలా పెద్ద మొత్తంలో అద్దెలు చెల్లించాల్సి వస్తోంది. దశలవారీగానే సచివాలయాలకు సొంత భవనాలు ఏర్పాటు చేసి వసతి సమస్యతోపాటు అద్దెల భారం తప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు.