Share News

చిరు వ్యాపారికి రూ.కోటి పన్ను నోటీసు

ABN , Publish Date - Jan 13 , 2025 | 11:55 PM

ఒక చిరు వ్యాపారి జీఎస్టీ నంబరుపై అక్రమంగా పే బిల్స్‌ జనరేట్‌ చేసి ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ ఆ వ్యాపారి ఖాతాలను నిర్వహించే అకౌంటెంట్‌ మోసానికి పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

చిరు వ్యాపారికి రూ.కోటి పన్ను నోటీసు

జీఎస్టీ అక్రమ వినియోగం

అకౌంటెంట్‌పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

ముదినేపల్లి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ఒక చిరు వ్యాపారి జీఎస్టీ నంబరుపై అక్రమంగా పే బిల్స్‌ జనరేట్‌ చేసి ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ ఆ వ్యాపారి ఖాతాలను నిర్వహించే అకౌంటెంట్‌ మోసానికి పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన కూల్‌ డ్రింక్స్‌ వ్యాపారి పంచకర్ల విజయబాబు ఆదివారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ మోసపు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తనకు జీఎస్టీ నంబరు కోసం గత ఏడాది మార్చి 23న విజయవాడకు చెందిన అకౌంటెంట్‌ బిల్లా కిరణ్‌కు వ్యాపారి విజయబాబు తన ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, పాస్‌ పోర్టు సైజు ఫొటో ఇచ్చారు. అప్పటి నుంచి తన వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను అకౌంటెంట్‌ కిరణ్‌కు వ్యాపారి విజయబాబు ఫోన్‌లో చెప్పేవారు. రిటర్న్‌లు దాఖలు చేసే వారు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది ఆగస్టు 3న సేల్స్‌ టాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ విజయ భాస్కర్‌ శ్రీహరిపురంలోని కూల్‌ డ్రింక్స్‌ షాపును తనిఖీ చేసి విజయబాబు జీఎస్టీ నెంబరుపై ఇప్పటి వరకు రూ.66.66 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగాయని తేల్చి ఇందుకు సంబంధించి సుమారు కోటి వరకు పన్ను చెల్లించాలని నోటీసు ఇచ్చారు. ఆ అధికారి ఇచ్చన నోటీసులపై దిగ్ర్భాంతికి గురైన వ్యాపారి విజయబాబు అంత పెద్ద మొత్తంలో వ్యాపార లావాదేవీలు చేయలేదని తెలిపారు. ఇదే విషయాన్ని స్థానిక సచివాలయ ఉద్యోగితో పంచనామా రిపోర్టు కూడా తయారు చేయించారు. తన జీఎస్టీ నంబరుపై కోట్లలో లావాదేవీలు అక్రమంగా నిర్వహించటంపై తన అకౌంటెంట్‌ కిరణ్‌ను గత ఏడాది నవంబరు 25న వ్యాపారి విజయబాబు అడగగా, తప్పు జరిగిందని పన్ను బకాయిలు చెల్లించే బాధ్యతను తానే తీసుకుంటానని కిరణ్‌ అంగీకరించాడు. అయితే ఇప్పటి వరకు అకౌంటెంట్‌ పన్ను కట్టకపోవటం, సేల్స్‌ టాక్స్‌ డీసీ పన్ను బకాయి చెల్లింపునకు ఇచ్చిన గడువు దాటిపోవటంతో వ్యాపారి విజయ్‌ బాబు ముదినేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో తనకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్‌ఐ వీరభద్రరావు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 13 , 2025 | 11:55 PM