Share News

నగల దుకాణంలో చోరీ

ABN , Publish Date - Jan 13 , 2025 | 12:00 AM

ఏలూరు నగరంలో శనివారం రాత్రి ఒక జ్యూవెలరీ షాపులో చోరీ జరిగింది.

నగల దుకాణంలో చోరీ
పోలీసు జాగిలంతో క్లూస్‌ టీం పరిశీలన

రూ.2.5 కోట్ల ఆభరణాలు కొట్టేశారు

దుకాణం వెనుకవైపు గోడ తవ్వి దొంగతనం

పక్కా వ్యూహంతో వ్యవహరించిన దుండగులు

సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు

సొమ్మసిల్లి పడిపోయిన దుకాణ యజమాని

ఏలూరు నగరంలో కలకలం

ఏలూరు క్రైం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : అర్ధరాత్రి వేళ దొంగలు గోనె సంచులు పట్టుకుని రెక్కీ నిర్వహించి షాపులను పగులగొట్టి నేరం చేయడం లేదా ఆ షాపు గోడలను పలుగులతో తవ్వేసి లోపలకు ప్రవేశించి దొంగతనాలకు పాల్పడడం.. సమీపంలోనే పోలీసు వాహనం, పోలీసులు ఉండడం వంటి దృశ్యాలు సినిమాల్లో చూస్తూ ఉంటాం. అదే తరహాలో ఏలూరు నగరంలో శనివారం రాత్రి ఒక జ్యూవెలరీ షాపులో చోరీ జరిగింది. ఆ దుకాణంలో దొంగతనం తీరు వ్యాపారులనే కాదు స్థానికులను సైతం భయపడే విధంగా ఉంది.

ఏలూరు నగరంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత మెయిన్‌ బజార్‌లో ఒక జ్యూవెలరీ షాపులో దొంగలు గోడను తవ్వి రంధ్రం పెట్టి వెండి, బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. అపహ రించిన నగల విలువ సుమారు రెండున్నర కోట్ల రూపాయల విలువ ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఏలూరు వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన మానేపల్లి మారుతీ రఘురామ్‌ మెయిన్‌బజార్‌లో లోకేశ్వరి జ్యూయలర్స్‌ అండ్‌ బ్యాంకర్స్‌ వెండి, బంగారు నగల వ్యాపా రం చేస్తున్నారు. మరోవైపు వెండి, బంగారపు వస్తువులను తాకట్టు పెట్టుకుంటూ వ్యాపారం చేస్తున్నారు. షాపు ముందు ఎంతో అందంగా కనిపించిన ఆ షాపు వెనుక మాత్రం ఓ పాడుబడ్డ పురాతన భవనం. దొంగలకు అదే కలిసి వచ్చింది. బయటకు మాత్రం ప్రహరీ గోడ, ఓ చెక్క తలుపు ఉన్నాయి. దొంగలు ముందుగానే రెక్కీ నిర్వహించి ప్రణాళిక ప్రకారం ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు స్పష్టమవుతుంది.

మారుతీరఘురామ్‌ యధావిధిగా ఈనెల 11న రాత్రి 10.30 గంటలకు షాపును కట్టివేసి తాళాలు వేసుకుని వెళ్లారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు షాపు వద్దకు వచ్చి తాళాలు, గేట్లు, తలు పులను తెరచి చూసేటప్పటికీ ఒక్కసారిగా కుప్పకూలి మారుతీ రఘురామ్‌ కిందపడిపోయాడు. ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరు కోవడంతో షాపులోపల గోడకు పెద్ద రంధ్రం ఉండడాన్ని గమనిం చారు. వెంటనే ఈ సమాచారాన్ని ఏలూరు వన్‌టౌన్‌ సీఐ జి సత్యనారాయణకు అందించారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. క్లూస్‌ టీమ్‌, పోలీసు జాగిలాలతో పరిశీలింపచేయించారు. సుమారు పాతిక కేజీల వెండి, రెండున్నర కేజీల బంగారం అపహర ణకు గురైనట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. వెనుకవైపు ఉన్న పురాతన శిధిలం భవనం లోపలకు దొంగలు ప్రవేశించారు. భయంక రంగా ఉన్న ఆ లోపల నుంచి నాలుగు అడుగుల మందం కల్గిన గోడకు రంధ్రం పెట్టి షాపులోపలకు ప్రవేశించారు. దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి మరీ నగలను పట్టుకుపోయారు.

రంగంలో దిగిన పోలీసు బృందాలు

జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిషోర్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ డీ శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ కేసును ఛేదించడానికి ప్రత్యేక బృందా లను రంగంలోకి దించారు. ఒక వైపు పోలీసు జాగిలం ఆ షాపులోకి ప్రవేశించి అక్కడ నుంచి షాపు వెనుకవైపు వెళ్ళి రంధ్రం పెట్టిన ప్రదేశానికి వెళ్లింది. ఆ షాపు వెనుకవైపు రోడ్డు, ముందువైపు రోడ్డులో పోలీసు జాగిలం తిరిగింది. అంటే ఆ దొంగ ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. మరోవైపు క్లూస్‌ టీమ్‌ కూడా అక్కడకు వచ్చి పలు ఆధారాలు సేకరించారు. ఏలూరు డీఎస్పీతో పాటు వన్‌టౌన్‌ సీఐ జి సత్యనారాయణ, సీసీఎస్‌ సీఐ రాజశేఖర్‌, భీమడోలు సీఐ యుజె విల్సన్‌, వన్‌టౌన్‌ ఎస్‌ఐలు నాగబాబు, మదీనా బాషా, వారి సిబ్బంది రంగంలోకి దిగారు. నగల దుకాణం పరిసర ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల పుటేజిలను కూడా పోలీసు బృందాలు పరిశీలి స్తాయి. పలు వ్యాపారులు అక్కడకు చేరుకుని ఆ షాపులో చోరీ సంఘటన చూసి దిగ్ర్భాంతి చెందారు. ఏలూరు నగరంలో ఈ సంఘటన వ్యాపారుల్లో తీవ్ర కలకలం సృష్టించింది.

Updated Date - Jan 13 , 2025 | 12:00 AM