Rupee Depreciation : ఎయుర్ ఇండియాకు‘రూపాయి’ కష్టాలు
ABN , Publish Date - Jan 13 , 2025 | 03:02 AM
డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనం దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను భయపెడుతోంది.
న్యూఢిల్లీ: డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనం దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను భయపెడుతోంది. దీంతో ఖర్చులు పెరిగి లాభాలకూ గండి పడుతుందని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ (సీఎ్‌ఫఓ) నిపుణ్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. డాలర్‌తో రూపాయి పతనం ఎయిర్ ఇండియాకే గాక, ఇతర విమానయాన సంస్థలకూ నష్టమేనన్నారు. ఉద్యోగుల జీతాలు తప్ప.. తమ ఇతర ఖర్చులన్నీ డాలర్లలో ఉండడం ఇందుకు ప్రధాన కారణమన్నారు. అయితే విదేశాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి విదేశీ కరెన్సీలలో వసూలు చేసే టిక్కెట్ల చార్జీలు కొంతలో కొంత తమను ఆదుకునే అవకాశం ఉందన్నారు. దీనికి తోడు ఖర్చులు తగ్గించుకోవడం, ఇతర చర్యల గురించీ ఆలోచిస్తున్నట్టు అగర్వాల్ తెలిపారు.
ప్రీమియం సీట్లపై దృష్టి
ఆదాయం పెంచుకోవడంపైనా ఎయిర్ ఇండియా దృష్టి పెట్టింది. ఇందుకోసం వైడ్ బాడీ విమానాల ముందు భాగంలో బిజినెస్, ఎకానమీ ప్రీమియం సీట్ల సంఖ్య రెట్టింపు చేస్తున్నట్టు అగర్వాల్ తెలిపారు. మరో రెండేళ్లలో తమకు అందే ఎయిర్‌బస్ ఏ350-1000 తరహా విమానాల్లో బోయింగ్ 777 విమానాల్లో ఉన్నట్లుగా ఫస్ట్ క్లాస్ సీట్లు ప్రవేశ పెట్టబోతున్నట్టు చెప్పారు. అగ్రశ్రేణి విమానయాన సంస్థలతో పోటీపడాలంటే తమ విమానాల్లోనూ ఫస్ట్ క్లాస్ సీట్లు పెంచుకోక తప్పదన్నారు.