Share News

Forex Market : 1 డాలర్‌ = రూ.86

ABN , Publish Date - Jan 11 , 2025 | 03:47 AM

భారత కరెన్సీ సరికొత్త జీవిత కాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలర్‌తో రూపీ మారకం విలువ మరో 18 పైసలు క్షీణించి రూ.86.04కు చేరింది.

Forex Market : 1 డాలర్‌ = రూ.86

  • మరింత క్షీణించిన భారత కరెన్సీ

  • సరికొత్త కనిష్ఠానికి మారకం విలువ

ముంబై: భారత కరెన్సీ సరికొత్త జీవిత కాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలర్‌తో రూపీ మారకం విలువ మరో 18 పైసలు క్షీణించి రూ.86.04కు చేరింది. ఎక్స్ఛేంజ్‌ రేటు రూ.86 దాటడం ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా డాలర్‌ బలం పుంజుకుంటుండటంతోపాటు ముడిచమురు ధరల పెరుగుదల, ఈక్విటీ మార్కెట్లో నష్టాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తరలిపోతుండటం మన రూపాయిని మరింత బలహీనపరిచాయని ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 20న అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో వాణిజ్య ఆంక్షలు పెరగవచ్చన్న ఆందోళనల కారణంగా దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరిగిందని, దాంతో డాలర్‌ విలువ రోజురోజుకూ పెరుగుతూపోతోందని ఫారెక్స్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. ఫారెక్స్‌ మార్కె ట్లో శుక్రవారం రూ.85.88 వద్ద ప్రారంభమైన డాలర్‌-రూపీ ట్రేడింగ్‌.. ఒక దశలో కాస్త బలపడి రూ.85.85 స్థాయికి చేరింది. కానీ, చివరికి 14 పైసల నష్టంతో రూ.86 వద్ద స్థిరపడింది.

  • మళ్లీ 80 డాలర్లకు క్రూడ్‌

ముడిచమురు భగ్గుమంటోంది. బ్రెంట్‌ క్రూడాయిల్‌ మళ్లీ 80 డాలర్లు దాటింది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ పీపా ధర ఒక దశలో 4 శాతానికి పైగా ఎగబాకి 80.75 డాలర్లకు పెరిగింది. బ్రెంట్‌ క్రూడ్‌ రేటు ఈ స్థాయికి చేరడం గత ఏడాది అక్టోబరు తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి. పెట్రోలియం ఎగుమతి దేశాలైన రష్యా, ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించవచ్చని, దాంతో మార్కెట్లోకి సరఫరా గణనీయంగా తగ్గవచ్చన్న అందోళనలు ఇందుకు కారణమయ్యాయి.

Updated Date - Jan 11 , 2025 | 03:47 AM