Share News

Market Volatility : ఆచితూచి వ్యవహరించండి..!

ABN , Publish Date - Jan 13 , 2025 | 02:51 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే నిఫ్టీ 200 ఎస్‌ఎంఏ కిందకు వచ్చింది.

Market Volatility : ఆచితూచి వ్యవహరించండి..!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే నిఫ్టీ 200 ఎస్‌ఎంఏ కిందకు వచ్చింది. జీవితకాల గరిష్ఠం నుంచి 11 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. కీలకమైన 23,431 పాయింట్ల స్థాయి కన్నా దిగజారితే మీడియం టర్మ్‌ డౌన్‌ట్రెండ్‌ మొదలయ్యే ప్రమాదం ఉంది. గత వారం ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. ఎఫ్‌ఎంసీజీ విభాగం కొద్దిగా మెరుగ్గా కనిపిస్తోంది. బడ్జెట్‌ సమీపిస్తుండటంతో మార్కెట్లు మరింత ఆటుపోట్లు ఎదుర్కొనే అవకాశం ఉంది.

స్టాక్‌ రికమండేషన్స్‌

హెచ్‌సీఎల్‌ టెక్‌: నష్టాల మార్కెట్లోనూ ఈ షేరు మెరుగ్గా రాణిస్తోంది. టెయిల్‌ విండ్‌ సెక్టార్‌ కావటం అనుకూలం. చివరి మూడు సెషన్లలోనే ఈ షేరు 6 శాతం మేర పెరిగింది. గత శుక్రవారం 3.12 శాతం లాభంతో రూ.1,995 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.1,990 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.2,150 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,960 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

ఎస్‌బీఐ లైఫ్‌: గత ఏడాది సెప్టెంబరులో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత ఈ షేరు 30 శాతం మేర దిద్దుబాటుకి లోనైంది. ప్రధాన మద్దతు స్థాయి రూ.1,400 వద్ద నుంచి అక్యుములేషన్‌ మొదలైంది. ఒడుదొడుకులు తగ్గాయి. బెంచ్‌మార్క్‌ సూచీలు నష్టాల్లో ఉన్నప్పటికీ ఈ కౌంటర్‌ పటిష్ఠతను ప్రదర్శిస్తోంది. గత శుక్రవారం రూ.1,478 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,450 వద్ద పొజిషన్‌ తీసుకుని రూ.1,650 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,420 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.


హిందుస్థాన్‌ యూనీలివర్‌: ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో ఎఫ్‌ఎంసీజీ రంగం మాత్రమే ఆశాజనకంగా కనిపిస్తోంది. సెప్టెంబరు నుంచి డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ఈ కౌంటర్‌లో 25 శాతం మేర దిద్దుబాటు జరిగింది. కీలకమైన రూ.2,300 స్థాయిలో మద్దతు లభించింది. గత శుక్రవారం ఈ షేరు రూ.2,442 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.2,400 శ్రేణిలో ప్రవేశించి రూ.2,650 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.2,360 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మారికో: నిఫ్టీతో పోలిస్తే ఈ షేరు జోరును ప్రదర్శిస్తోంది. నష్టాల మార్కెట్లోనూ దూకుడుగా ముందుకు సాగుతోంది. జీవితకాల గరిష్ఠం తర్వాత మంచి కరెక్షన్‌ జరిగింది. ప్రస్తుతం కీలకమైన రూ.600 స్థాయి కన్నా పైన చలిస్తోంది. చివరి మూడు సెషన్లలో ఈ షేరు 10 శాతం పెరిగింది. గత శుక్రవారం రూ.673.90 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.650 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.770 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.635 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

బ్రిటానియా: గత అక్టోబరులో జీవిత కాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత ఈ షేరు ద్వితీయ త్రైమాసిక ఫలితాల అనంతరం కుప్పకూలింది. 26 శాతం కరెక్షన్‌ జరిగిన తర్వాత ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. డిసెంబరు చివరి వారం నుంచి జోరును ప్రదర్శిస్తోంది. గత శుక్రవారం రూ.4,939 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.4,900 వద్ద పొజిషన్‌ తీసుకుని రూ.5,250 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.4,860 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

Updated Date - Jan 13 , 2025 | 02:51 AM