Share News

Budget : మేడమ్ సర్‌ప్రైజ్‌

ABN , Publish Date - Feb 02 , 2025 | 04:02 AM

Budget 2025 Updates: ఏటా బడ్జెట్‌కు ముందు వేతన జీవుల ఎదురుచూపులు! కనీసం ఈసారైనా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంచుతారా అని! అయినా.. బడ్జెట్లో వారికి నిరాశ తప్పేది కాదు! ఈసారి కూడా బడ్జెట్‌కు ముందు రకరకాల ఊహాగానాలు! ఆదాయపు పన్ను పరిమితిని రూ.10 లక్షల దాకా పెంచవచ్చంటూ అంచనాలు! ఐనా.. ఎక్కడో అనుమానం.. ఈసారి కూడా ఊరట ఉండదేమోనని!

Budget : మేడమ్ సర్‌ప్రైజ్‌
Budget 2025

వేతన జీవులకు పన్ను బొనాంజా రూ.12.75 లక్షల వరకు ఐటీ లేదు

కోటి మందికి ఊరట.. కేంద్రానికి తగ్గనున్న లక్ష కోట్ల ఆదాయం

వృద్ధి రేటు పెంచడమే ధ్యేయంగా వ్యూహం

కోటి మంది గిగ్‌ వర్కర్లకు సామాజిక బీమా

కిసాన్‌ కార్డు రుణాలు రూ.5 లక్షలకు పెంపు

ధన ధాన్య మిషన్‌ సహా ఆరు కొత్త పథకాలు

ఢిల్లీ, బిహార్‌ ఎన్నికలు లక్ష్యంగా పలు నిర్ణయాలు

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 2 కోట్ల రుణం

బీమా రంగంలో ఎఫ్‌డీఐలు 100ుకు పెంపు

ఐదేళ్లలో కొత్తగా 75 వేల మెడికల్‌ సీట్లు

క్యాన్సర్‌ చికిత్సకు ప్రతి జిల్లాలో ఓ డేకేర్‌

10 లక్షల దాకా విద్యా రుణాలపై నో టీసీఎస్‌

ప్రభుత్వ స్కూళ్లకు అటల్‌ ల్యాబ్స్‌, బ్రాడ్‌ బ్యాండ్‌

వృద్ధులకు వడ్డీలు, అద్దెలపై టీడీఎస్‌ ఊరట

రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు

రూ.లక్షన్నర కోట్ల వడ్డీ రహిత రుణాలు

లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి


మొత్తం బడ్జెట్‌ (రూ. కోట్లలో) 50,65,345

కొత్త విధానంలో ఆదాయపు పన్ను

రూ.4 లక్షల వరకు పన్ను లేదు

రూ.4-8 లక్షలు 5 శాతం

రూ.8-12 లక్షలు 10 శాతం

రూ.12-16 లక్షలు 15 శాతం

రూ.16-20 లక్షలు 20 శాతం

రూ.20-24 లక్షలు 25 శాతం

రూ.24 లక్షల పైన.. 30 శాతం

రూ.12.75 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు. అంతకు

మించి ఒక్క రూపాయి దాటినా పై శ్లాబులు వర్తిస్తాయి.

తగ్గేవి..

ఎలక్ట్రిక్‌ వాహనాలు, మొబైల్‌ ఫోన్లు, 36 రకాల క్యాన్సర్‌ ఔషధాలు, లెదర్‌ చెప్పులు, బూట్లు, బెల్టులు, జాకెట్స్‌, లిథియం అయాన్‌ బ్యాటరీలు, లెడ్‌, జింక్‌, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లు, బైక్‌లు, ఎలకా్ట్రనిక్‌ బొమ్మలు, బంగారు, వెండి నగలు.

పెరిగేవి..

స్మార్ట్‌ మీటర్లు, సోలార్‌ సెల్స్‌, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పాదరక్షలు,

పడవలు, కొన్ని రకాల వస్త్రాలు, పీవీసీ ఫ్లెక్స్‌ ఫిల్మ్స్‌, పీవీసీ ఫ్లెక్స్‌ షీట్లు, పీవీసీ ఫ్లెక్స్‌ బ్యానర్లు.

జేబులు నింపే బడ్జెట్‌..

ఇది ప్రజల జేబులు నింపే బడ్జెట్‌. పన్ను మినహాయింపులతో మధ్య తరగతికి, ఉద్యోగులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయి. వినియోగం, వృద్ధి సాధ్యమవుతాయి. ఈ బడ్జెట్‌ ద్వారా వికసిత్‌ భారత్‌ వైపు దృఢంగా అడుగులు పడినట్లే.

- నరేంద్ర మోదీ

ఆంధ్రను విస్మరించారు

దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్రం వద్ద ఆలోచనలు కరువయ్యాయి. ఇది బుల్లెట్‌ గాయాలకు బ్యాండ్‌ ఎయిడ్‌ వేసినట్టుంది. బిహార్‌కు బొనాంజా ప్రకటించి.. ఎన్డీయే సర్కారుకు మరో మూల స్తంభమైన ఆంధ్రను దారుణంగా విస్మరించారు.

- రాహుల్‌ గాంధీ

ఏటా బడ్జెట్‌కు ముందు వేతన జీవుల ఎదురుచూపులు! కనీసం ఈసారైనా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంచుతారా అని! అయినా.. బడ్జెట్లో వారికి నిరాశ తప్పేది కాదు! ఈసారి కూడా బడ్జెట్‌కు ముందు రకరకాల ఊహాగానాలు! ఆదాయపు పన్ను పరిమితిని రూ.10 లక్షల దాకా పెంచవచ్చంటూ అంచనాలు! ఐనా.. ఎక్కడో అనుమానం.. ఈసారి కూడా ఊరట ఉండదేమోనని! కానీ, బడ్జెట్లో ఊరట ఇవ్వడం కాదు.. ఎవరూ ఊహించని విధంగా భారీ బొనాంజానే ప్రకటించారు! కొత్త పన్ను విధానంలో ఏకంగా రూ.12.75 లక్షల వరకూ ఆదాయంపై పన్ను మినహాయించారు! ఈ పరిమితికి మించి ఒక్క రూపాయి పెరిగినా మళ్లీ శ్లాబుల పరిధిలోకి వెళ్లక తప్పదు! కానీ, ఈసారి శ్లాబుల్లోనూ ఉపశమనం కల్పించారు! వెరసి, వరుసగా ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వేతన జీవులపై వరాల వర్షం కురిపించారు! దాదాపు కోటి మందికి లబ్ధి చేకూర్చారు! వ్యవసాయానికి మరింత సాయం చేశారు! యువత ఉపాధికి హామీ ఇచ్చారు! ఎంఎ్‌సఎంఈలకు చేయూత అందించారు! విద్య, వైద్య రంగాలపై ఫోకస్‌ పెంచారు! ఎప్పట్లాగే, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు! అభివృద్ధి రాగంలో సంక్షేమ పాట పాడారు! ‘దేశమంటే మట్టి కాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌’ అన్న గురజాడ అప్పారావు కవితతో ప్రారంభించి వచ్చే (2025-26) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మల శనివారంనాడు పార్లమెంటులో ప్రవేశపెట్టారు! సంస్కరణలనే ఇంధనంతో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ వికసిత భారత్‌ లక్ష్య సాధనకు సంకల్పం చెప్పుకొన్నారు. ఇప్పటికే 71 శాతం మంది ఉద్యోగులు కొత్త పన్ను విధానంలోకి మారిపోయారు. ఇప్పుడు భారీ బొనాంజా ప్రకటించడంతో మరింత మంది ఈ విధానంలోకి మళ్లడం ఖాయం. తద్వారా, ఇక, రాయితీలతో కూడిన పాత పన్ను విధానానికి చెల్లుచీటీ ఇచ్చేసినట్లే!! అంతేనా.. వారం రోజుల్లోనే పార్లమెంటులో కొత్త ఐటీ చట్టాన్ని ప్రవేశపెడతామని కూడా బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు.


ఎందుకీ భారీ పెంపు!?

ఎన్నికలు అంతస్సూత్రంగా లేకుండా ఎటువంటి నిర్ణయాలూ ఉండవు కదా! గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేకు అరకొర మెజారిటీయే వచ్చింది! ఇందుకు వేతన జీవుల్లో అసంతృప్తి ఓ కారణమనే వాదన ఉండనే ఉంది. దీనికితోడు, ఇప్పుడు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ గెలుపోటముల్లో ఉద్యోగులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. దీనికితోడు, బిహార్లోనూ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి! ఇక, మధ్య తరగతి తమకు అండ దండ అనేది బీజేపీ అంచనా. అదే సమయంలో, కొనుగోలు శక్తి క్షీణించడంతో వృద్ధి రేటు మందగించిందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు! కరోనా అనంతర పరిణామాలతో ప్రజలు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టారు! కొనుగోలు శక్తి తగ్గిపోయింది! ఇది ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతోంది. అందుకే వృద్ధి రేటును పెంచడంపై ఈసారి బడ్జెట్లో దృష్టిసారించారు. ఇటు ఉద్యోగుల ఆశలను నెరవేరుస్తూనే అటు వృద్ధి రేటు అంచనాను పెంచడానికి వ్యూహం రచించారు. ‘మీ చేతికి మరిన్ని డబ్బులు వచ్చేలా చేస్తాం.. వాటిని ఆదా చేయకుండా ఎంజాయ్‌ చేయండి’ అంటూ బడ్జెట్లో పరోక్షంగా సంకేతమిచ్చారు. మొబైల్స్‌, కంప్యూటర్లు, కార్లు వంటి వాటిని కొనుక్కోండని సూచించారు. అందుకే, మేకిన్‌ ఇండియా లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీకి పరోక్ష పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. తద్వారా, ఫోన్లు, ఈవీ కార్లు, టీవీల ధరలు తగ్గనున్నాయన్న మాట. ఇక, ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం ద్వారా కేంద్రానికి రూ.లక్ష కోట్ల ఆదాయం తగ్గుతుందని అంచనా. ఉద్యోగుల జేబుల్లోకి వెళ్లే ఈ లక్ష కోట్లు తిరిగి మార్కెట్లోకి వస్తాయని, తద్వారా వృద్ధి రేటు పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. ఐటీ మినహాయింపుతో లక్ష కోట్ల ఆదాయం తగ్గుతుందని చెప్పినా.. కేంద్ర నికర పన్ను ఆదాయం రూ.25.57లక్షల కోట్ల నుంచి రూ.31.47 లక్షల కోట్లకు పెరుగుతుందని పేర్కొనడం గమనార్హం.

అన్నదాతకు మరింత చేయూత

బడ్జెట్లో అన్నదాతపై వరాల జల్లులు కురిపించారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా రుణాలను రూ.5 లక్షలకు పెంచారు. పీఎం ధన ధాన్య క్రిషి యోజన కింద వంద జిల్లాల్లో 1.7 కోట్ల మంది రైతులకు అగ్రి డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రామ్‌ అమలు చేయనున్నారు. పత్తి సాగు, ఉత్పత్తిని పెంచడానికి మిషన్‌ ఏర్పాటు, పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. కొత్తగా పరిశ్రమలు ప్రారంభించే 5లక్షల మందికి రాబోయే ఐదేళ్లలో రూ.2 కోట్ల వరకూ రుణాలు ఇచ్చేందుకు కొత్త పథకాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకూ బొమ్మలు అంటే మేడిన్‌ చైనా కదా! ఇప్పుడు మేడిన్‌ ఇండియా బొమ్మల తయారీకి చర్యలు తీసుకోనుంది. బిహార్లో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీని ఏర్పాటు చేయనుంది.


విద్య, వైద్యంపై ఫోకస్‌

విద్య, వైద్య రంగాలపై ఈసారి బడ్జెట్లో దృష్టి సారించారు. రాబోయే ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్‌ సీట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే పది వేల సీట్లు పెరగనున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్యాన్సర్‌ చికిత్సకు డేకేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 36 ప్రాణాధార మందులపై పరోక్ష పన్ను తగ్గించారు. ఇక, విద్యా రుణాలు తీసుకున్న వారికి ఉపశమనం కలగనుంది. రూ.10 లక్షల వరకూ విద్యా రుణాలపై టీసీఎస్‌ (ట్యాక్స్‌ కలెక్షన్‌ ఎట్‌ సోర్స్‌)ను తొలగించింది. అన్ని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, పీహెచ్‌సీలకు బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్టివిటీని అందించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 50 వేల అటల్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయనున్నారు. రూ.500 కోట్లతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రారంభించనున్నారు. ఐఐటీల సామర్థ్యాన్ని పెంచడానికి భారీగా నిధులు కేటాయించారు. యువత నైపుణ్యం పెంచడానికి నేషనల్‌ సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ స్కిల్లింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా కోటి మంది గిగ్‌ వర్కర్లకు బీమా కల్పించడానికి పథకాన్ని అమలు చేయనున్నారు. వృద్ధులపైనా బడ్జెట్లో కనికరం చూపించారు. వడ్డీల రూపంలో వచ్చే ఆదాయం రూ.50 వేలు దాటితే గతంలో టీడీఎస్‌ కట్‌ చేసేవారు. ఇప్పుడు ఆ పరిమితిని లక్షకు పెంచారు. అలాగే, వడ్డీల రూపంలో వచ్చే ఆదాయంపై టీడీఎస్‌ మినహాయింపు పరిమితిని కూడా రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచారు.

రాష్ట్రాలకూ మరిన్ని నిధులు

వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరిన్ని నిధులు అందనున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలను అందిస్తామని బడ్జెట్లో ప్రకటించారు. విద్యుత్తు సంస్కరణలను అమలుచేసిన రాష్ట్రాలకు జీఎస్డీపీలో అదనంగా 0.5శాతం రుణాలను అందిస్తామని తెలిపారు. జల్‌ జీవన్‌ మిషన్‌ను 2028 వరకూ కొనసాగిస్తుండడంతో రాష్ట్రాల్లో మంచినీటి సదుపాయాల కల్పనకు నిధులు రానున్నాయి. నగరాలను గ్రోత్‌ హబ్‌లుగా తీర్చిదిద్దడానికి ‘అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌’ కింద లక్ష కోట్లను కేటాయించారు. ఇప్పటి వరకూ సౌర, పవన విద్యుత్తుపై దృష్టిసారించిన కేంద్రం.. ఇప్పుడు అణు విద్యుదుత్పత్తికి న్యూక్లియర్‌ ఎనర్జీ మిషన్‌ను ఏర్పాటు చేయనుంది. బడ్జెట్లో పర్యాటక రంగ అభివృద్ధికి కూడా పెద్దపీట వేసింది.


బాకీల చెల్లింపులకు అగ్ర స్థానం

కేంద్రానికి వచ్చే ప్రతి రూపాయిలో 66 పైసలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారానే వస్తున్నాయి. మరో మాటలో చెప్పుకోవాలంటే.. కేంద్రానికి వచ్చే ప్రతి రూపాయిలో 24 శాతం అప్పుల ద్వారానే! మరో 22 శాతం ఆదాయ పన్ను ద్వారా వస్తుంటే.. 18 శాతం జీఎస్టీ, ఇతర పన్నుల ద్వారా వస్తోంది. ఇక, ఖర్చుల్లోనూ ఇదే తీరు. రాష్ట్రాలకు పన్నుల వాటా కింద 22 శాతం చెల్లిస్తుంటే..అప్పులపై తెచ్చిన బాకీలు, వడ్డీల చెల్లింపునకే మరో 20శాతం ఖర్చు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.14.82లక్షల కోట్ల రుణం తీసుకుంటామని బడ్జెట్లో పేర్కొంది. ఇక, కేంద్ర పథకాలకు 16శాతం వెచ్చిస్తోంది. ఇక, మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించే క్యాపెక్స్‌ కేటాయింపులను రూ.11.11లక్షల కోట్లుగా పేర్కొంది. నిజానికి, గత బడ్జెట్లోనూ ఇంతే మొత్తం కేటాయించింది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో ఎన్నికల హడావుడి ఉండడంతో దానిని రూ.10.18 లక్షల కోట్లకు తగ్గించింది.


ప్రజల జేబులు నింపే బడ్జెట్‌: మోదీ

బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేసే బడ్జెట్‌ అని కొనియాడారు. పొదుపు, పెట్టుబడులు పెరగడంతో పాటు వినియోగం, వృద్ధి సాధ్యమన్నారు. సాధారణంగా బడ్జెట్‌లన్నీ ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు, ఖజానా నింపేందుకు రూపొందిస్తుంటారని, అయితే ఈ బడ్జెట్‌ మాత్రం ప్రజల జేబులు నింపుతుందని ప్రధాని చెప్పారు. యువత కోసం అనేక రంగాల్లో చర్యలు తీసుకోవడం ద్వారా వికసిత్‌ భారత్‌ వైపు దృఢంగా అడుగులు పడినట్లేనన్నారు. బడ్జెట్‌లో తయారీ పరిశ్రమకు సంబంధించి తీసుకున్న చర్యలతో భారత్‌లో తయారైన వస్తువులకు అంతర్జాతీయంగా గిరాకీ లభించబోతుందన్నారు. పన్ను మినహాయింపులతో మధ్యతరగతివారికి, ఉద్యోగులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

‘వికసిత్‌ భారత్‌’కు బ్లూప్రింట్‌: బీజేపీ

రైతుల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ప్రతి వర్గాన్ని.. అలాగే పోషకాహారం నుంచి ఆరోగ్యం వరకు, స్టార్ట్‌పల నుంచి ఇన్నోవేషన్‌, పెట్టుబడుల వరకు ప్రతి రంగాన్నీ ఈ బడ్జెట్‌ కవర్‌ చేస్తోందని, మోదీ స్వయం సంవృద్ధి భారత్‌కు ఇది రోడ్‌ మ్యాప్‌ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెందిన గొప్ప భారత్‌ దిశగా మోదీ విజన్‌కు ఇది బ్లూప్రింట్‌ అన్నారు. వికసిత్‌ భారత్‌ దిశగా అద్భుత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారంటూ నిర్మలకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందనలు తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా విజనరీ రోడ్‌మ్యాప్‌ అంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసలు కురిపించారు. మోదీకి కృతజ్ఞతలు, నిర్మలకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సూక్ష్మగ్రాహ్యతను ఈ బడ్జెట్‌ ప్రతిబింబిస్తోందని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ కొనియాడారు. ఇది అభివృద్ధి దిశగా దృష్టి కేంద్రీకరించిన బడ్జెట్‌ అని, నిరంతర వృద్ధి, దృఢమైన స్వయం సంవృద్ధి, సుసంపన్నమైన వికసిత్‌ భారత్‌కు వేసిన పునాదిగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా అభివర్ణించారు.


పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 02 , 2025 | 09:46 AM