Share News

YouTube: యూట్యూబ్‌ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందో తెలిస్తే..

ABN , Publish Date - Mar 27 , 2025 | 10:59 AM

పెరిగిన టెక్నాలజీని కొంతమంది చెడు కార్యక్రమాలకు వాడుకుంటూ కటకటాలపాలవుతున్నారు. మరికొంతమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటిదే ఈ వార్త. యూట్యూబ్‌లో శోధించి దొంగతనాలకు పాల్పడి చివరకు అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు ఊసలు లెక్కించాల్సిన పరిస్థితి నెలకొంది.

YouTube: యూట్యూబ్‌ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందో తెలిస్తే..

- యూట్యూబ్‌లో శోధించి చోరీ

- ఏటీఎం దొంగల ముఠా ఆటకట్టు

- ఐదుగురు నిందితుల అరెస్ట్‌

- రూ. 4 లక్షలు, కారు, గ్యాస్‌ కట్టర్‌లు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: ఏటీఎంను గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేసి, రూ. 29 లక్షలు కొల్లగొట్టి పారిపోయిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఐదుగురు దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 4 లక్షలు, కారు, గ్యాస్‌ కట్టర్‌లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎల్‌బీనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudheer Babu) వివరాలు వెల్లడించారు. ఈనెల 2వ తేదీ తెల్లవారుజామున ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రావిర్యాలలో ఎస్‌బీఐ ఏటీఎంను గుర్తుతెలియని దుండగులు గ్యాస్‌ కట్టర్లతో కట్‌చేసి, రూ. 29లక్షలో దోపిడీ చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఇప్పటి వరకు వసూలైంది రూ.60 కోట్లు మాత్రమే..


అదేరోజు రాత్రి మైలార్‌దేవ్‌పల్లిలో మరో ఎస్‌బీఐ ఏటీఎంను కొల్లగొట్టేందుకు గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేస్తుండగా షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు రావడంతో పారిపోయారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఏటీఎం ముందు, క్యాబిన్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలకు నల్లని స్ర్పే కొట్టి, అలారం వైర్‌ కట్‌ చేసి, గ్యాస్‌ కట్టర్‌తో మిషన్‌ను మూడు నిమిషాల్లో కట్‌ చేసి డబ్బు దోచుకుని పారిపోయినట్లు గుర్తించారు. పోలీసులు సుమారు 100 కిలోమీటర్లు, 500 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి వాటి ఆధారంగా రాజస్థాన్‌, హరియాణా(Rajasthan, Haryana) ప్రాంతాలకు చెందిన దొంగలుగా నిర్ధారించుకున్నారు.


city7.jpg

అక్కడి జిల్లాల పోలీస్‌ అధికారులతో కో-ఆర్డినేట్‌ చేసిన పోలీసులు ఈ తరహా దొంగల ముఠాలపై ఆరా తీయగా నిందితుల ఆచూకీ లభించింది. 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితులకోసం గాలించారు. ముఠాలోని 10 మంది నిందితుల్లో రాహుల్‌ఖాన్‌, ముస్తకీమ్‌ఖాన్‌, వహీంఖాన్‌, షకీల్‌ఖాన్‌, మహ్మద్‌ సర్పరాజ్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడిని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు.


విమానంలో వచ్చి..

దొంగల ముఠాలో ప్రధాన నిందితులు రాహుల్‌ ఖాన్‌, ముస్తకీమ్‌ఖాన్‌ రాజస్థాన్‌ నుంచి బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చారు. రాహుల్‌ పహాడిషరీఫ్‏లో, ముస్తకీమ్‌ఖాన్‌ పటాన్‌చెరులో ఎక్సక్‌వేటర్‌ మెకానిక్‌లుగా పనిచేస్తున్నారు. జల్సాలు, లగ్జరీ జీవితానికి అలవాటుపడటంతో వచ్చే సంపాదన సరిపోలేదు. ఏటీఎంలను కొల్లగొట్టి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల ఊరెళ్లిన వీరిద్దరు అక్కడ తన కుటుంబంలోని ఇతర దొంగల ముఠాకు విషయం చెప్పారు.


అందరూ సరే అనడంతో రాహుల్‌ ఒక్కడే తిరిగి నగరానికి వచ్చాడు. ఆదిభట్ల, మైలార్‌దేవ్‌పల్లిలో ఎస్‌బీఐ ఏటీఎంలను గుర్తించాడు. రాహుల్‌ సూచనతో ఈనెల 1న ముస్తకీమ్‌ఖాన్‌, షారుక్‌ఖాన్‌, సుబ్దిన్‌ ఖాన్‌, రఫీక్‌ విమానంలో నగరానికి వచ్చారు. నగరంలోనే ఉన్న మరో నిందితుడు పర్వేజ్‌ వారిని రిసీవ్‌ చేసుకొని జల్‌పల్లిలో ఉంటున్న మరో నిందితుడు సర్ఫరాజ్‌ఖాన్‌ రూమ్‌కు తీసుకెళ్లాడు. యూట్యూబ్‌(YouTube)లో శోధించి చోరీకి పథకం వేశారు. ముస్తకీమ్‌ఖాన్‌ కారులో రాత్రి 10 గంటలకు బయల్దేరి రావిర్యాలలో ఏటీఎం వద్దకు వెళ్లారు.


3 నిమిషాల్లో గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎంను కట్‌చేసి రూ. 29లక్షలు దోచుకొని పారిపోయారు. నిందితులు ఉపయోగించిన కారును పోలీసులు గుర్తించకుండా ముందుబాగంలో నల్లటి స్టిక్కర్‌, నకిలీ నంబర్‌ప్లేట్‌ ఏర్పాటు చేశారు. ముఠాపై ఒడిశా, తెలంగాణలో ఆరు క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు తేలింది. కేసును ఛేదించిన మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ రాజు, ఐటీసెల్‌ ఏసీపీ నరేందర్‌, ఆదిభట్ల ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, ఇతర క్రైమ్‌ టీమ్‌ను సీపీ అభినందించి రివార్డులు అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

‘పది’ ప్రశ్నపత్రం లీకేజీకి రాజకీయ రంగు

ఉప ఎన్నికలు రావు

‘ఉపాధి’కి పెరిగిన పని దినాలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 27 , 2025 | 10:59 AM