Share News

Impact Of Trade Wars: వాణిజ్య యుద్ధాలు, ఆర్థిక మాంద్యాలు, అధోగతులు

ABN , Publish Date - Apr 18 , 2025 | 03:55 AM

ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధాలు, ఆఫ్‌షోరింగ్‌, మరియు ఆర్థిక విధానాలు దేశాల మధ్య పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేస్తూ, ఈ ప్రక్రియలు అనేక వాణిజ్య అడ్డంకులను సృష్టించాయి. గతంలో అమెరికా విధించిన అధిక సుంకాలు ఆర్థిక మహామాంద్యానికి దారితీసిన సంఘటనలు, తదుపరి యుద్ధాలకు కూడా కారణం అయ్యాయి

Impact Of Trade Wars: వాణిజ్య యుద్ధాలు, ఆర్థిక మాంద్యాలు, అధోగతులు

ర్థిక విషయాలు రాజకీయాల మంచిచెడులను నిర్ణయిస్తాయంటే నమ్మని వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. మనుషులను కొన్ని విలువలు నడిపిస్తాయనీ అన్నిటినీ ఆర్థికంతో ముడిపెట్టలేమన్న వాదనలూ బలంగానే వినిపిస్తాయి. ఆర్థిక అంశాలను పూర్తిగా విస్మరించి ఊహాలోకాల్లోకి వెళ్లటం అసాధ్యం. అలా వెళ్లటానికి కూడా జీవితంలో ఆర్థిక వెసులుబాట్లు ఉండాలి. వ్యవసాయం కనిపెట్టకముందు మనుషుల ఆలోచనలు ఒకరకంగా ఉండేవి. అప్పుడు దేవుళ్లూ ప్రత్యేకంగా ఉండేవారు. నీతులూ భిన్నంగా ఉండేవి. వ్యవసాయం స్థిరపడి, రాచరికాలు ఏర్పడిన తర్వాత పరిస్థితి మారిపోయింది. కొందరు శారీరక శ్రమలేకుండా ఇతర వ్యాపకాల్లో నిష్ణాతులు కావటానికి వీలుపడింది. వ్యవసాయ సంపదలో వాటాలు పొందినవారు మేధావులు అయ్యారు. రుషులుగా మారారు. కవులు అయ్యారు. కళాకారులుగా తయారయ్యారు. ప్రవక్తలుగా వెలుగొందారు. వాణిజ్యకారులుగా వ్యవహరించారు. ఇక గడచిన అయిదారొందల ఏళ్లల్లో వాణిజ్య ప్రయోజనాల కోసం ఘోర యుద్ధాలూ జరిగాయి. ఇదంతా గతచరిత్ర అనుకోవచ్చు. ఈనాటి సమాజంలో వాణిజ్య ప్రయోజనాలను శాంతియుతంగా పొందొచ్చని భావించొచ్చు. అందుకు ఉదాహరణలనూ చెప్పుకోవచ్చు. కానీ వాణిజ్య ప్రయోజనాలు గతంలో లాగే యుద్ధాలకూ నియంతృత్వాలకూ దారితీసే పరిస్థితులు ఇప్పటికీ ప్రబలంగానే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సాగిస్తున్న వాణిజ్య యుద్ధాలను చూస్తే ఇదే భావన కలుగుతుంది. చైనా కేంద్రంగా ట్రంప్‌ సాగిస్తున్న ఆ యుద్ధాలు.. ఎటు దారితీస్తాయన్న దానిపై భిన్న అంచనాలు ఉన్నాయి. కానీ దేశాల మధ్య అసలు యుద్ధాలకు అవి దారితీయవని ఖచ్చితంగా చెప్పలేం! యుద్ధమంటే మనుషుల హతమే కాదు.


వాస్తవాల హతం కూడా! అబద్ధాలు, వక్రీకరణలు లేకుండా యుద్ధాలు ఉండవు. ఈనాటి వాణిజ్య యుద్ధమూ దీనికి మినహాయింపు కాదు. తీవ్ర వాణిజ్యలోటు, చాంతాడంత అప్పులతో అమెరికా సతమతమవుతోంది. అమెరికా చేసే ఎగుమతుల కంటే ఏదైనా దేశం నుంచి దిగుమతులు ఎక్కువ ఉంటే ట్రంప్‌ దృష్టిలో దోపీడీ జరుగుతున్నట్లే లెక్క! అమెరికా కంటే ఏ దేశమైనా సుంకాలను కాస్త ఎక్కువగా విధిస్తే ఆ దేశం అమెరికాపై అత్యాచారానికి పాల్పడినట్లే లెక్క! స్వేచ్ఛా వాణిజ్యాన్ని శ్లాఘించిన ఆర్థికవేత్తలెవరూ ఇలాంటి వాదన తలెత్తుతుందని ఊహించలేదు. స్వదేశీ పరిశ్రమల రక్షణకు అధిక సుంకాలను కొంతకాలం విధించాలని ప్రతిపాదించిన ఆర్థికవేత్తలు ఉన్నారు. ఒక దేశం వాణిజ్యలోటుకు ఇతర దేశాల దోపిడీయే కారణమని సూత్రీకరించిన ఆర్థికవేత్తలు ప్రధాన స్రవంతిలో పెద్దగా కనపడరు. అమెరికా ఎందుకంతగా దిగుమతులపై ఆధారపడాలి? శాస్త్ర, సాంకేతికతల్లో అగ్రగామిగా ఉండగా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకనాటి అమెరికా పాలకులకు ట్రంప్‌కు ఉన్నంతగా దేశభక్తి లేకుండా పోయిందా? ఈ ప్రశ్నల లోతుల్లోకి వెళితే అమెరికా ఎలాంటి మార్పులకు లోనైందో అర్థమవుతుంది. వాటితో ఎవరు లాభపడ్డారో తెలుస్తుంది. అమెరికానే అనుసరిస్తూ దాని స్థాయికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్న చైనాను కేంద్రంగా చేసుకుంటూ సాగుతున్న వాణిజ్య యుద్ధ నైజమూ బోధపడుతుంది.


అమెరికా నుంచి తయారీ పరిశ్రమలు తరలటానికి ఇతర దేశాల ఒత్తిడి లేదు. పరిశ్రమలు, సేవలు ఇతర దేశాలకు తరలిపోవటాన్ని వ్యాపార పరిభాషలో ‘ఆఫ్‌ షోరింగ్‌’ అంటారు. ఈ ఆఫ్‌షోరింగ్‌ను వివరిస్తూ లక్షల విశ్లేషణలు వచ్చాయి. వాటన్నిటిలోనూ ఒక విషయంలో ఏకాభిప్రాయం ఉంది. తక్కువ వేతనాలకు దొరికే కార్మిక–నిపుణుల శ్రమ, చౌక ధరలకు ముడిసరుకుల లభ్యత ఒకనాటి అమెరికా పరిశ్రమలకు అవసరమయ్యాయి. ఎక్కువ లాభాల కోసం ఆ అవసరం తలెత్తింది. వేతనాలు పెరిగాలని ఒత్తిడిచేసే కార్మిక సంఘాలు, సంక్షేమ పథకాల కోసం పన్నులను పెంచాల్సిన అవసరాలు, పర్యావరణ పరిరక్షణ కోసం అమల్లోకి వచ్చిన కట్టుదిట్టమైన చట్టాలు.. అమెరికా, పశ్చిమ యూరోపుల్లో పరిశ్రమల లాభాలను బాగా ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి. ఆ పరిస్థితుల్లో లాభాలను నిలబెట్టుకోవటమూ కష్టంగా మారింది. లాభాల్లో ఎదుగూబొదుగూ లేకుండా పరిశ్రమలు ఉండలేవు. పోటీలో నిలబడాలంటే అధిక లాభాలను అన్వేషించాలి. అందుకే 1960ల నాటికి అమెరికా పరిశ్రమలను తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందగలిగే దేశాలకు తరలించటం అనివార్యమైంది.అప్పటి నుంచి 2015 వరకూ ఆఫ్‌షోరింగ్‌ అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగింది. 1990ల నుంచి 2015 మధ్యకాలాన్ని దాని ఉచ్ఛదశగా భావించొచ్చు. 1989 నుంచీ యూరపులో కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూలిపోవటం, అంతకు పదేళ్లకు ముందే చైనాలో ప్రైవేటు రంగానికి తలుపుతీయటం, 1991లో భారత్‌లో పెద్దఎత్తున ఆర్థిక సంస్కరణలు మొదలవ్వటం.. ఆనాటి ప్రధాన సంఘటనలుగా చెప్పుకోవచ్చు. అవన్నీ ఆఫ్‌షోరింగ్‌కు బాగా తోడ్పడ్డాయి.


పరిశ్రమలతో పాటు సేవలు, ఐటీ రంగంలో కూడా ఆఫ్‌షోరింగ్‌ మొదలైంది. బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌, బ్యాకెండ్‌ ఆఫీస్‌ యాక్టివిటీస్‌, మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌, సాఫ్ట్‌వేర్‌ కోడింగ్‌, డిజిటల్‌ ఆఫ్‌షోరింగ్‌, వర్చువల్‌ ఆఫ్‌షోరింగ్‌.. ఇలా ఎన్నో పేర్లతో పలు పనులు.. తక్కువ వేతన ఖర్చు, తక్కువ ఆఫీసు నిర్వహణా భారంతో అభివృద్ధి చెందుతూన్న దేశాలకు తరలి వచ్చాయి. జర్మనీకి చెందిన తయారీ పరిశ్రమలు పలు విదేశాలకు తరలాయి. అందులో 80శాతం పరిశ్రమలు వేతన ఖర్చులను తగ్గించుకోవటానికే తరలి వెళ్లాయి. ఇతర దేశాల్లో పనిచేయించుకోగలిగిన ఉద్యోగాలెన్ని అన్న విషయంలో కూడా చాలా లెక్కలు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం 11శాతం నుంచి 38 శాతం ఉద్యోగాలు అందుకు అనువైనవిగా తేలాయి. మరో అధ్యయనం ప్రకారం.. అమెరికాలో సేవలకు సంబంధించిన 515 రకాల ఉద్యోగాల్లో 160 వరకూ ఇతర దేశాల వ్యక్తులతో చేయించగలిగినవిగా లెక్కించారు. 2021–22 నాటి మరో అంచనా ప్రకారం అమెరికాలోని ఉద్యోగాల్లో 26 శాతం వాటిని విదేశాల్లోనే చేయించుకోవచ్చని తేల్చారు. అమెరికాకు చెందిన పెద్ద సంస్థలు చాలా దేశాల్లో పరిశ్రమలూ కంపెనీలనూ నడుపుతున్నాయి. 2014 నాటికే 14 మిలియన్‌ ఉద్యోగులు వాటిల్లో పనిచేస్తున్నారు. అందులో 17 లక్షలు ఒక్క చైనాలో ఉంటే వాటిల్లో సగం మంది తయారీ రంగంలోనే పనిచేస్తున్నారు. మెక్సికోలో అమెరికన్లు నడుపుతున్న కంపెనీల్లో 7,06,200 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు దేశాలపై ట్రంప్‌ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. విదేశాల్లోని అమెరికా కంపెనీల్లో చౌకగా తయారైన ఉత్పత్తులను స్థానిక మార్కెట్లల్లో అమ్మి లాభాలను గడించటం ఒకవైపు చిత్రమే. వాటిని అమెరికాకు దిగుమతి చేసుకుని సొంత పౌరులకు చౌకగా అందించటమే ప్రధానమైంది. యాపిల్‌ ఫోన్లే ఇందుకు ఉదాహరణ.


ఇప్పటికీ అవి అమెరికాలో తయారు కావు. అయిదారేళ్ల క్రితం వరకూ మొత్తం అన్నీ చైనా నుంచి రావాల్సిందే. వేతన భారాలనూ ఇతర ఖర్చులనూ గణనీయంగా తగ్గించుకునే లక్ష్యంతో పరిశ్రమలనూ సేవలనూ విదేశాలకు తరలించి దశాబ్దాల పాటు అమెరికా బాగా లాభపడింది. దీనివల్ల కొన్నిరకాల ఉద్యోగాలు పోతే మరెన్నో కొత్త ఉద్యోగాలు అమెరికాలో వచ్చాయనీ ఆఫ్‌షోరింగ్‌తో అంతా నష్టం జరిగిందనే వాదన నిజంకాదనే అధ్యయనాలు కూడా చాలానే ఉన్నాయి. అసలు విషయం ఏమిటంటే అమెరికాకు కావాల్సిన వస్తు, సేవలను అందిస్తూ ఆ మార్కెట్టుపై ఆధారపడి ఉన్నంతవరకూ చైనాతో ఏ ఇబ్బందీ కలగలేదు. సాంకేతిక, శాస్త్ర రంగాల్లో సొంత పరిశోధనలకు పెద్దపీట వేస్తూ, రక్షణరంగంలో కూడా ముందుకు దూసుకుపోవటంతో పాటు ఇతర దేశాల్లో తన ఉత్పత్తులకు, సేవలకు మార్కెట్‌ను చైనా విస్తరించుకోవటంతో సమస్య మొదలైంది. దేశాల మధ్య వ్యాపారపరమైన అడ్డంకులను తొలగించటానికి ఏర్పాటైన వల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ లాంటివన్నీ అమెరికా ప్రోద్బలంతోనే ఏర్పడ్డాయి. అవన్నీ ఇప్పుడు కంటగింపుగా మారాయి. అమెరికాకు అగ్రతాంబూలం అందకుండా అవే అడ్డంకిగా మారాయని అంటూ వాటి నుంచి వైదొలుగుతామనే హెచ్చరికలూ పెరిగాయి. ఆఫ్‌షోరింగ్‌ స్థానంలో రీషోరింగ్‌ నినాదం మొదలైంది. అమెరికాకు అవసరమైన అన్ని ఉత్పత్తులూ స్వదేశంలోనే జరగాలనే ఆర్భాటత్వమూ ఆరంభమైంది. చేజారుతున్న ఆధిపత్యాన్ని నిలబెట్టుకోటానికి, జాతీయభద్రత పేరుతో చైనా ఉత్పత్తులను నిలువరించే కఠిన చర్యలతో మొదలుపెట్టి, అసాధారణ వాణిజ్యయుద్ధానికి అమెరికా శ్రీకారం చుట్టింది. ఆధిపత్యం కోల్పోయే పరిస్థితి ఉన్న చోట అభద్రతలూ, అనిశ్చితులూ కూడా వేగంగా ముసురుకుంటాయి. ట్రంప్‌లాంటి నేతలు ఆ పరిస్థితుల నుంచే బలపడతారు. దేశపరిరక్షకుల అవతారంతో చెలరేగి పోతారు.


అధిక సుంకాలతో ఆర్థికవ్యవస్థను అన్నిసార్లూ రక్షించుకోలేరు. 1920–1930ల్లో అమెరికా విధించిన అత్యధిక దిగుమతి సుంకాల విధింపుతో తేలింది అదే. ప్రపంచ వ్యాప్త ఆర్థిక మహామాంద్యానికి ఆ సుంకాలే ప్రధాన కారణం అయ్యాయి. ఆ మాంద్యమే హిట్లర్‌ లాంటి వాళ్లను సృష్టించి రెండో ప్రపంచ యుద్ధానికి దారులు పరచింది. 1922లో ఫోర్డినీ–మెకంబర్‌ చట్టంతో అమెరికా సగటు దిగుమతి సుంకాన్ని 40 శాతానికి పెంచింది. అమెరికా చరిత్రలో అది అధికం. యూరోపు వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను దండిగా విధించాలన్న డిమాండ్లూ మొదలయ్యాయి. వాటికి సరేనంటూ రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి హెర్బట్‌ హూవర్‌ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ఇతర ఉత్పత్తులపై కూడా సుంకాలను పెంచాలనే ఒత్తిడి మొదలైంది. ఈ లోగా స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలటంతో (1929) స్మూట్‌–హాలీ పేరుతో తెచ్చిన దిగుమతి సుంకాల చట్టం ఆర్థికమాంద్యాన్ని తీవ్రం చేసింది. అమెరికాను వాణిజ్యపరంగా ఏకాకిగా మార్చింది. జరిగే ప్రమాదాన్ని పసిగట్టి 1000 మంది ఆర్థికవేత్తలు ఆ చట్టాన్ని వీటో చేయాలని హూవర్‌కు పిలుపునిచ్చారు. లక్ష్యపెట్టలేదు. అమెరికాని చూసి రెండేళ్లల్లో మరో 24 దేశాలు అధిక సుంకాలతో రక్షణ గోడలు కట్టుకున్నాయి. యూరప్‌–అమెరికాల మధ్య ఎగుమతులు–దిగుమతులు 1929–32 మధ్య 66 శాతం పడిపోయాయి. వాణిజ్యం అస్తవ్యస్తమైంది. అంతటా ఆర్థిక అస్థిరత చుట్టుముట్టింది. రెండో ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమైంది. వాణిజ్య యుద్ధాలతో జరిగే దారుణాలకు ఇంతకంటే నిదర్శనం లేదు! చరిత్ర పునరావృతం అవుతుందా?

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

Updated Date - Apr 18 , 2025 | 04:02 AM