Indian economy : కొత్త సంవత్సరంలో రూపాయి దారెటు?
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:51 AM
డాలర్ ముందు రూపాయి తేలిపోతోంది. రోజురోజుకూ విలువ కోల్పోతూ తన రికార్డును తానే బద్దలుకొడుతోంది. జనవరి 3న రూపాయి మారకం విలువ డాలర్‌కు 85.79. డిసెంబరు 27న 85.80కు
డాలర్ ముందు రూపాయి తేలిపోతోంది. రోజురోజుకూ విలువ కోల్పోతూ తన రికార్డును తానే బద్దలుకొడుతోంది. జనవరి 3న రూపాయి మారకం విలువ డాలర్‌కు 85.79. డిసెంబరు 27న 85.80కు క్షీణించిన విషయం తెలిసిందే. సమీపకాలంలో రూపాయి విలువ మరింత పతనం కావచ్చునని ఆర్థికవేత్తలు అంచనావేస్తున్న నేపథ్యంలో, 2014లో ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ రూపాయి పతనం గురించి చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుకు వస్తున్నాయి. దేశ రక్షణ గురించి గానీ, రూపాయి పతనం గురించి గానీ మన్మోహన్‌సింగ్ ప్రభుత్వానికి పట్టింపు లేదని మోదీ అప్పట్లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు, ఆయన ప్రధాని కావాలని కోరుకున్న ప్రముఖులంతా రూపాయి పతనం మీద చేసిన వెటకారపు వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మళ్ళీ ప్రత్యక్షమవుతున్నాయి. అప్పట్లో రూపాయి బాగోగుల గురించి గుండెలుబాదుకున్న పెద్దలంతా ఇప్పుడు ఎందుకో నోరువిప్పడం లేదు మరి.
రూపాయి విలువ ఈ స్థాయిలో పడిపోవడం ఆర్థిక నిపుణుల్లో కలకలం రేపింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా దిద్దుబాటు చర్యలేవో చేపట్టింది కానీ, అవి ఏ మాత్రం ఫలితాలను సాధిస్తాయో వేచి చూడాల్సిందే. సెప్టెంబర్ నెల నుండి రూపాయి పతనం స్పష్టంగానే కనిపిస్తోంది. సెప్టెంబర్ 12న డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.83.98కి పడిపోయింది. అప్పట్లో అదో రికార్డు. ఆ స్థాయికి రూపాయి విలువ పడిపోవడం అదే మొదటిసారి కావడంతో కలకలం రేగింది. మార్కెట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక నిపుణులు రకరకాల విశ్లేషణలు చేశారు. అయితే, ఎన్నికల పబ్బాలను గడుపుకునే పనిలో ఉన్న మోదీ ప్రభుత్వానికి అప్పట్లో ఈ విషయమే పట్టలేదు. ఫలితంగా పతనంలో రూపాయి కొత్త రికార్డులు సృష్టించడం ప్రారంభమైంది.
రూపాయి విలువ తగ్గిపోతోంది కాబట్టి మన జేబులో డబ్బు ఎక్కువగా ఖర్చు చెయ్యాల్సి వస్తోంది. గత పదేళ్ళలో డాలర్‌తో రూపాయి మారకపు విలువ 25 శాతం పతనమైంది. అప్పట్లో 3వేల రూపాయలు ఉండే ఇంటి అద్దె ఇప్పుడు 15వేల రూపాయలు అయ్యింది. ఆ లెక్కన అప్పట్లో నెలకు రూ.10వేలు సంపాదించేవారు. ఇప్పుడు నెలకు దాదాపు రూ.50వేల దాకా సంపాదించాలి. ఆ స్థాయిలో సామాన్యుల వేతనాలు పెరుగుతున్నాయా? లేదు కదా కాబట్టి రూపాయి పతనం వల్ల నష్టపోతున్నది పేదలు, మధ్య తరగతివారు, సామాన్యులే. పదేళ్ల కిందట ఒక డాలర్ కోసం మనం 63 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. మరి ఇప్పుడు 85 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇదివరకు కూరగాయలు కొంటే 100 రూపాయలకి సంచినిండేది, ఇప్పుడు 500 రూపాయలు పెట్టినా నిండట్లేదు. ఒక్క కూరగాయలే కాదు, ఇంట్లో వాడే ప్రతీ నిత్యావసరం ధరా పెరుగుతూనే ఉంటుంది.
ఈ పతనం ఇంకొంత కాలం, ఇంకా హెచ్చుగా సాగే అవకాశాలే అధికం. అంటే ధరలు మరింత పెరగడం ఖాయం. రూపాయి పతనం వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు బాగా పెరుగుతాయి. మనం విదేశాల నుంచి చమురును ఎక్కువగా కొంటున్నాం, భారీగా చెల్లింపులు జరుపుతున్నాం కనుక విలువ ప్రభావం ఇక్కడ అధికంగా ఉంటుంది. మన నెలవారీ బడ్జెట్ ప్రతీ నెలా పెరుగుతూండటానికి ద్రవ్యోల్బణం కూడా కారణం. కోడిగుడ్డు ఒక రూపాయి నుంచి గత సంవత్సరం 5 రూపాయలు అయ్యింది. ఈ సంవత్సరం 7 రూపాయలు అయ్యింది. కోళ్ల దాణా, కరెంటు ఖర్చు, కూలీ వేతనాలు, నిర్వహణ ఖర్చులు, రవాణా ఖర్చులు ఇలా అన్నీ పెరుగుతూ గుడ్డు ధర కూడా పెరిగింది. ఇలా ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
అమెరికాతో పోల్చితే ఇండియా చాలా వేగంగా వృద్ధి చెందుతున్న దేశం. అయినా రూపాయి పతనం కావడానికి కారణం డాలర్ అంతర్జాతీయ స్టాండర్డ్ కరెన్సీగా ఉండటమే. ప్రతీ దేశమూ విదేశాలతో వ్యాపారం డాలర్ల రూపంలో చేస్తున్నాయి. దాంతో డాలర్ విలువ పెరుగుతూనే ఉంది. మనం విదేశాలతో రూపీలో వాణిజ్యం చేస్తే మన కరెన్సీ కూడా బలపడగలదు. కానీ అమెరికా అందుకు అంగీకరించక, ఆంక్షల పేరిట భయపెడుతోంది. ఆసియాలో రూపీ రూపంలో వాణిజ్యం జరపాలనే డిమాండ్లు ఉన్నాయి. ఈ దిశగా అడుగులు పడితే మన కష్టాలు తీరగలవు. బ్రిక్ దేశాలు ఉమ్మడి కరెన్సీని ప్రవేశపెట్టి డాలర్‌కి చెక్ పెట్టాల్సిన టైమ్ వచ్చింది. ఇప్పటికైనా అడుగులు పడకపోతే, భారతీయులు మరింతగా నష్టపోతారు. మన ఎగుమతులను, ఉత్పాదకత సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు ఉద్యోగ కల్పన, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి. దీంతో ఉత్పత్తి పెరిగి ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించి రూపాయి స్థిరీకరణ చేయవచ్చు. దేశీయంగా ఎలక్ట్రానిక్స్ సంస్థలు నెలకొల్పి, ఉన్నవాటి సామర్థ్యాన్ని ఉత్పత్తిని పెంచి దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించాలి. దిగుమతుల్లో ప్రముఖపాత్ర వహిస్తున్న ఇంధన అవసరాల కోసం దేశీయ సంస్థల్ని పురికొల్పి, ఎక్కువ ఉత్పత్తిని సాధించాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉత్పాదకతను పెంచడం ద్వారా స్వయం సమృద్ధి సాధించాలి.
రూపాయి విలువ ఈ స్థాయిలో పడిపోవడం ఆర్థిక నిపుణుల్లో కలకలం రేపింది.
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా దిద్దుబాటు చర్యలేవో చేపట్టింది కానీ, అవి ఏ మాత్రం ఫలితాలను సాధిస్తాయో వేచి చూడాల్సిందే.
గత ఏడాది సెప్టెంబర్ నెల నుండి రూపాయి పతనం స్పష్టంగానే కనిపిస్తోంది. ఈ పతనం ఇంకొంత కాలం, ఇంకా హెచ్చుగా సాగే అవకాశాలే అధికం. అంటే ధరలు మరింత పెరగడం ఖాయం.
నాదెండ్ల శ్రీనివాస్