రాజనీతిజ్ఞుడు, రైతుబిడ్డ
ABN , Publish Date - Jan 01 , 2025 | 05:28 AM
ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజానుకూలంగా ఉండడం లేదు. ఉత్తమ నాయకులు కొరవడడం కూడా అందుకు ఒక కారణం. గత గురువారంనాడు మన్మోహన్ సింగ్, ఆదివారం నాడు జిమ్మీ కార్టర్ శాశ్వత నిష్క్రమణలు...
ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజానుకూలంగా ఉండడం లేదు. ఉత్తమ నాయకులు కొరవడడం కూడా అందుకు ఒక కారణం. గత గురువారంనాడు మన్మోహన్ సింగ్, ఆదివారం నాడు జిమ్మీ కార్టర్ శాశ్వత నిష్క్రమణలు కాలధర్మమే అయినప్పటికీ ప్రపంచ పురాతన, అతి పెద్ద ప్రజాస్వామ్య సమాజాలకు పరితాప ఘటనలు. ఇరువురూ తమ తమ గణతంత్ర రాజ్యాల సంస్థాపక ఆశయాలకు నిబద్ధమైనవారు. ఒకరు యాదృచ్ఛికంగా భారత ప్రధానమంత్రి అయ్యారు; మరొకరు జీవనయానంలో పౌర ధర్మాలను నిజాయితీగా నిర్వర్తిస్తూ నాయకుడుగా వికసించిన విలక్షణుడు. ప్రపంచవ్యాప్తంగా పలు సమస్యల పరిష్కారానికి కృషి చేసిన రాజనీతిజ్ఞుడు.
వంద సంవత్సరాల పైబడిన వయసులో మరణించిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ రైతు కుటుంబం నుంచి ప్రభవించారు. చిన్నతనంలోనే పొలం పనులు అన్నీ చేసేవారు. స్వరాష్ట్రమైన జార్జియాలో జాతి వివక్ష తీవ్రంగా ఉండేది. అయినా నల్లజాతి పాలేర్లతో కలిసిమెలసి పనిచేయడం, తల్లిదండ్రుల సంస్కార భావాలు చిన్నారి జిమ్మీని ఆ సంకుచితత్వ ధోరణుల పట్ల విముఖుడిని చేశాయి. వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకున్న కార్టర్ 1962లో రాజకీయాలలోకి ప్రవేశించేందుకు నిర్ణయించుకున్నారు. జార్జియా సెనేట్ కు రెండుసార్లు ఎన్నికయ్యారు. గవర్నర్ పదవికి పోటీ చేసి ప్రథమ ప్రయత్నంలో విఫలమయ్యారు. రెండో ప్రయత్నంలో జయపతాక ఎగురవేశారు. ఈ సందర్భంలో ఇరానియన్ – జూయిష్ మూలాలు ఉన్న డేవిడ్ రబ్హాన్ తన విమానంలో కార్టర్‌ను ప్రచారానికి రాష్ట్రమంతటా తిప్పాడు. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆడగలేదు కానీ, జాతివివక్షకు కాలం చెల్లిపోయిందని గవర్నర్‌గా మీ ప్రారంభోపన్యాసంలో ప్రకటించాలని కోరాడు. 1971 జనవరిలో జార్జియా గవర్నర్‌గా తన ప్రారంభోపన్యాసంలో కార్టర్ అదే మాట గట్టిగా చెప్పారు. పేదలు, గ్రామీణులు, నల్ల జాతివారు అందరికీ అన్నిటా సమన్యాయం చేయడమే తన విధ్యుక్త ధర్మమని ప్రకటించారు. 1976లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకై డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని కార్టర్ సాధించుకున్నారు.
వియత్నాం నుంచి అవమానకరంగా నిష్క్రమించవలసిరావడం; చమురు ధల పెరుగుదల, వాటర్ గేట్ కుంభకోణం.. ఈ మూడూ 1970 దశకం ప్రథమార్ధంలో అమెరికా సమాజాన్ని కుదిపివేశాయి. వీటి నేపథ్యంలో నీతి నిజాయితీలకు నిండుతార్కాణంగా ఉన్న జిమ్మీకార్టర్ ను అమెరికా ఓటర్లు గెలిపించారు. 1977 నుంచి 81 దాకా కొనసాగిన ఆయన అధ్యక్షతను, దురదృష్టవశాత్తు ఇరాన్ లో అమెరికా ఖైదీల ను విడిపించడంలో వైఫల్యానికి మాత్రమే గుర్తు చేసుకోవడం పరిపాటిగా ఉన్నది. నిజానికి కార్టర్ పాలన చాలా ప్రభావశీలమైన మార్పులు తీసుకువచ్చింది. పనామా కాలువపై నియంత్రణ అధికారాలను పూర్తిగా పనామా దేశానికి అప్పగించేందుకు కార్టర్ చొరవ తీసుకున్నారు. లాటిన్ అమెరికా దేశాలలోని సైనిక పాలకులకు అమెరికా మద్దతు నిచ్చే ఆనవాయితీకి స్వస్తి చెప్పారు. కమ్యూనిస్టు చైనాతో సత్ససంబంధాలను నెలకొల్పుకునేందుకు నిక్సన్ హయాంలో జరిగిన ప్రశస్త కృషిని కార్టర్ మరింత ముందుకు తీసుకువెళ్లారు. అయితే ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం రావడం, టెహ్రాన్ లోని అమెరికా రాయబారి కార్యాలయంలోని సిబ్బందిని ఇరానియన్ విప్లవకారులు తమ నిర్బంధంలోకి తీసుకోవడం సంభవించింది. వారిని విడిపించే ప్రయత్నం విఫలమవడం కార్టర్ ప్రభుత్వ ప్రతిష్ఠను పూర్తిగా మసకబార్చింది. 1980 అధ్యక్ష పదవి ఎన్నికలలో కార్టర్ ఘోర పరాజయానికి అది దారితీసింది.
ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకు జిమ్మీ కార్టర్ అగ్ర ప్రాధాన్యమిచ్చారు. ఇజ్రాయిల్, ఈజిప్ట్ మధ్య చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని సుసాధ్యం చేయడంలో ఆయన కీలక పాత్ర వహించారు. వాతావరణ మార్పు విషమ పర్యవసానాలపై సమగ్ర అవగాహనతో వాటి నిరోధానికి ఆయన పటిష్ఠ చర్యలు చేపట్టారు. వైట్ హౌస్ నుంచి నిష్క్రమించిన తరువాత కార్టర్ ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలకు అంకిత మయ్యారు. అమెరికా అధ్యక్షుడుగా కార్టర్ వైఫల్యాలు ఏమైనప్పటికీ ఆయనపై చరిత్ర తీర్పు దయాభావంతో ఉంటుంది. కార్టర్ మహా చదువరి, బహు గ్రంథ రచయిత కూడా. బ్రిటిష్ కవి డిలాన్ థామస్ ను అమితంగా అభిమానించే కార్టర్ కవిత్వమూ రాశారు. తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన చిన్న నాటి పరిసరాల ప్రభావం తనలో సజీవంగా ఉందని ఒక కవితలో అభివర్ణించుకున్న మట్టి మనిషి జిమ్మీ కార్టర్.