Indian Science Congress : గూడూరులో ఆంధ్ర చరిత్ర చర్చలు
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:05 AM
కొన్ని దశాబ్దాలుగా ప్రతి జనవరి మూడో తేదీన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను భారత ప్రధాని ప్రారంభించడం, అలాగే జనవరి ఏడవ తేదీన భారత రాష్ట్రపతి సమాపన సదస్సుకు విచ్చేయడం
కొన్ని దశాబ్దాలుగా ప్రతి జనవరి మూడో తేదీన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను భారత ప్రధాని ప్రారంభించడం, అలాగే జనవరి ఏడవ తేదీన భారత రాష్ట్రపతి సమాపన సదస్సుకు విచ్చేయడం ఆనవాయితీగా ఉండేవి. ఇటీవల కాలంలో సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు అంతరాయం కలిగినట్టుంది, ఈ సంవత్సరం దాని గురించి సమాచారమే లేదు.
కరోనా సమయంలో కుంటుబడిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు తర్వాత పుంజుకోలేకపోయాయి అని చెప్పవచ్చేమో. గత సంవత్సరం జలంధర్ దగ్గర ఉన్న విశ్వవిద్యాలయంలో సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరగాలి, చివరి నిమిషంలో వాటిని రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు. ఈ సంవత్సరం సైన్స్ కాంగ్రెస్ సమావేశాల రద్దు గురించి వార్తలే కాదు, విమర్శలు కూడా వినపడటం లేదు. ప్రక్షాళన చర్యలు జరగకుండా మొత్తానికి గల్లంతుకావడం విషాదకరం, ఆందోళనాభరితం. తిరుపతి జిల్లాలోని గూడూరులో 47వ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు జనవరి 4, 5 తేదీలలో జరుగుతున్నాయనగానే నాకు ప్రఖ్యాతమైన సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు గుర్తుకొచ్చాయి.
1974 డిసెంబర్‌లో జవహర్ భారతి కళాశాల ప్రిన్సిపల్ మలిరెడ్డి పట్టాభిరామిరెడ్డి సుమారు 30 మంది కళాశాల ఉపన్యాసకులను కలిసినప్పుడు కాకతాళీయంగా కలిగిన ఆలోచన, తర్వాత కాలంలో ఏపీ హిస్టరీ కాంగ్రెస్ రావడానికి దోహదమైంది. ఊరక ఉండనివ్వని ఆ ఆలోచన కొన్ని నెలల్లోనే ఒక క్వార్టర్లీ జనరల్ రావడానికి దారితీసింది. ప్రఖ్యాత చరిత్ర పరిశోధకులు రాళ్లబండి సుబ్బారావు రాజమండ్రిలో స్థాపించిన ఏపీ హిస్టారికల్ రీసెర్చ్ సొసైటీ సంస్థ కూడా తోడు కావడంతో 1976లో ఏపీ హిస్టరీ కాంగ్రెస్ మొదలైంది. తెలుగులో ‘ఆంధ్రప్రదేశ్ చరిత్ర సమాఖ్య’గా పిలవబడే ఈ సంస్థ మంచి ప్రచురణలను వెలువరించింది. మరీ ముఖ్యంగా నాలాంటి వారికి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి గురించి ప్రచురించిన సంపుటాలు విలువైన నిధులే.
ఇదివరకటి కన్నా ఇప్పుడు భావ పరంపరలను పంచుకోవడానికి చాలా మార్గాలు సులువుగా అందుబాటులోకి వచ్చాయి. అయినా కూడా వ్యక్తిగతమైన స్పర్శ మరింత అర్థవంతమైన రీతిలో మన ఆలోచనను, అవగాహనను పరిపుష్ఠం చేసుకోవడానికి దోహదపడుతుంది. సోషల్ మీడియా విశృంఖలంగా అందుబాటులోకి వచ్చాక; అసలుకు, నకిలీకి రూపంలో తేడాలు నశించాక సమావేశాలు, వ్యక్తిగత పరిచయాలు మరింత అవసరమనిపిస్తోంది. తిరుపతి, శ్రీకాళహస్తి, గూడూరు, సూళ్లూరుపేట మండలాలతో, సముద్రతీరం ఉన్న ఏకైక రాయలసీమ జిల్లాగా తిరుపతి జిల్లా ఏర్పడింది. నెల్లూరుకు 35 కిలోమీటర్లు, తిరుపతికి 95 కిలోమీటర్లు, మద్రాసుకు 135 కిలోమీటర్ల దూరంలో ఉండే గూడూరు చారిత్రకంగా చాలా కీలకమైంది. పరిశోధకుల ప్రకారం భారతదేశంలోనే తొలి నాగరికత కలిగిన తాలూకా ఈ గూడూరు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక రేవు పట్టణాలు కలిగిన, అత్యధిక తీరం కలిగిన ప్రాంతం కూడా ఇదే. ప్రాచీన నాగజాతి, బోయలకు కేంద్ర స్థానం. మౌర్యులు, శాతవాహనులకు వాణిజ్యకేంద్రంగా గ్రీకు, రోమన్, చైనా దేశాలతో వ్యాపారం, వాణిజ్యం సాగించిన ప్రాంతం కూడా ఇదే. దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేసియాలకు చెన్నూరు చేనేత వస్త్రాలను ఎగుమతి చేయడమే కాకుండా; విందూరు చాపలను విదేశాలకు అందించిన చరిత్ర కూడా కలిగిన ప్రాంతమిది. ఇలా ఎన్నో ప్రాధాన్యతలతో పాటు నాణ్యమైన నిమ్మ పంటను, పెద్ద స్థాయిలో పండించే ప్రాంతం కూడా ఇదే. ఈ గూడూరు ప్రాంతంలో శిల్పకళతో శోభిల్లే దేవాలయాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇటువంటి గూడూరులో మొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సమాఖ్య సమావేశాలు జరగడం ఆనందదాయకం.
ఒక్క తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా కర్ణాటక, కేరళ, తమిళనాడు, బిహార్, గుజరాత్ వంటి రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన రావడానికి కారణం పొట్టి శ్రీరాములు. అయితే ఈ విషయాన్ని తెలుగువారే దాదాపు మర్చిపోయారని, ఇతర భాషా ప్రాంతాలలో పొట్టి శ్రీరాములు తెలియని వ్యక్తిగా పరిణమించారని 2003 మార్చి 30న ప్రముఖ చరిత్రకారులు డాక్టర్ రామచంద్ర గుహ ‘ది హిందూ’ పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పొట్టి శ్రీరాములు 1952 డిసెంబర్ 15 రాత్రి 11 గంటల తర్వాత కన్నుమూసిన సందర్భంలో చాలా చోట్ల గొడవలు, ఆస్తినష్టం సంభవించాయి. ఆ రోజు విజయవాడ రైల్వే స్టేషన్‌లో కూడా జరిగిన విధ్వంసాన్ని కళ్లారా చూసిన గాంధేయవాది, వినోబాభావే భూదాన యాత్ర సహచరుడు జీవీ సుబ్బారావు ప్రకారం 1952 డిసెంబర్ 15, 1953 అక్టోబర్ 1వ తేదీ మధ్యకాలంలో జరిగిన రాజకీయ సంఘటనలను పూర్తిగా నమోదు చేయలేదు, విశ్లేషణ చేయలేదు. జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సి. రాజగోపాలాచారి, భోగరాజు పట్టాభి సీతారామయ్య రాజకీయవ్యూహాల గురించి పెద్దగా చర్చించిన, నిలకడైన విశ్లేషణలు అందుబాటులోకి రాలేదు. ఇలాంటి ఎన్నింటినో ఆధునిక కాలానికి అవసరమైన రీతిలో చరిత్రకారుల సదస్సులు చర్చించవచ్చు, విశ్లేషణలు చేయవచ్చు!
ప్రఖ్యాత చరిత్ర పరిశోధకులు రాళ్లబండి సుబ్బారావు రాజమండ్రిలో స్థాపించిన ఏపీ హిస్టారికల్ రీసెర్చ్ సొసైటీ సంస్థ కూడా తోడు కావడంతో 1976లో ఏపీ హిస్టరీ కాంగ్రెస్ మొదలైంది.‘ఆంధ్రప్రదేశ్ చరిత్ర సమాఖ్య’ మంచి ప్రచురణలను వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి గురించి ప్రచురించిన సంపుటాలు విలువైన నిధులు.
డా. నాగసూరి వేణుగోపాల్