Agriculture : హాలికుల ఆవేదన
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:48 AM
‘అన్నీ వేచి ఉండగలుగుతాయి, వ్యవసాయం మాత్రం కాదు’– దశాబ్దాల క్రితం నెహ్రూ గుర్తించిన ఈ సత్యం ఇప్పుడు మరింత ప్రాసంగికతను సంతరించుకున్నది. ఆహార భద్రత, ఉపాధి కల్పన ఆవశ్యకతలను దృష్టిలో
‘అన్నీ వేచి ఉండగలుగుతాయి, వ్యవసాయం మాత్రం కాదు’– దశాబ్దాల క్రితం నెహ్రూ గుర్తించిన ఈ సత్యం ఇప్పుడు మరింత ప్రాసంగికతను సంతరించుకున్నది. ఆహార భద్రత, ఉపాధి కల్పన ఆవశ్యకతలను దృష్టిలో ఉంచుకుంటే మన వ్యవసాయ రంగానికి, రైతులకు సహయ సహకారాలను సమృద్ధిగా ఎందుకు అందించాలో స్పష్టమవుతుంది.
2023–24లో ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి 2,875 మిలియన్ టన్నులు కాగా వినియోగం 2,843 మిలియన్ టన్నులుగా ఉన్నదని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ నివేదిక పేర్కొంది. భావి అవసరాలకు నిల్వ చేసుకోగల ఆహార ధాన్యాలు స్వల్పాతి స్వల్ప పరిమాణంలో మాత్రమే ఉన్నాయి. అదే సంవత్సరంలో మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 338.29 మిలియన్ టన్నులు. దేశ ప్రజల ఆహార అవసరాలను ఇవి సమృద్ధిగా తీర్చగలుగుతాయా? ఉపాధికల్పన విషయం చూస్తే దేశ శ్రామిక శ్రేణుల్లో అత్యధికులు వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. అయితే వారికి నాణ్యమైన ఉపాధి, భద్రమైన ఆదాయం ఏ మాత్రం సమకూరడం లేదు. అదే సమయంలో మరే రంగం కూడా ఈ భారీ శ్రామిక శక్తి వినియోగించుకోలేదు. ఈ వాస్తవాల దృష్ట్యా ఆహార సమృద్ధికి, ఉపాధి భద్రతకు వ్యవసాయ రంగం, రైతులకు తోడ్పడేందుకు ప్రభుత్వాలు ప్రథమ ప్రాధాన్యమివ్వాలి.
విస్మరించకూడని మరొక వాస్తవమేమిటంటే స్వాతంత్ర్యానంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల స్థితిగతుల మెరుగుదలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. అనేకానేక అధ్యయనాలు నిర్వహించాయి. రైతుల సహాయార్థం వివిధ సంస్థల నేర్పాటు చేశాయి. రైతుల ఆదాయాలను పెంపొందించేందుకై నిపుణుల సిఫారసుల కోసం వివిధ కమిషన్‌లను నియమించాయి. అయితే ఆ అధ్యయనాల, కమిషన్ల నివేదికలలోని సూచనలు, సిఫారసుల అమలుకు ప్రభుత్వాలు శ్రద్ధ చూపుతున్నాయా? చూపడం లేదన్నది నిష్ఠుర సత్యం. ఎమ్‌ఎస్ స్వామినాథన్ జాతీయ కమిషన్ సూచనలను కేంద్రం అమలుపరచకపోవడమే అందుకొక తిరుగులేని నిదర్శనం. 2020లో కేంద్ర ప్రభుత్వం ఆ సిఫారసులను ఉపేక్షిస్తూ మూడు కొత్త సాగు చట్టాలను తీసుకురావడంతో ఉత్తరాది రైతాంగం భగ్గుమన్నది. దేశ రాజధానిని ముట్టడించి నెలల తరబడి ఆందోళన చేసింది. రైతుల పోరాట సంకల్పాన్ని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఆ కొత్త సాగు బిల్లులను ఉపసంహరించుకున్నది. ఆ సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చలేదు. దీంతో ఉత్తరాది, ముఖ్యంగా పంజాబ్, హరియాణా రైతులు మళ్ళీ ఆందోళనకు దిగారు. గత నవంబర్ 26 నుంచి జగ్జీత్ సింగ్ డల్లేవాల్ అనే రైతునాయకుడు పంజాబ్–హరియాణా సరిహద్దుల్లో ఖనౌరీ వద్ద చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షతో 2020లో వలే ఉత్తరాది రైతుల పోరాటం ఆసేతు హిమాచలం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
స్వామినాధన్ కమిషన్ సిఫారసులను పూర్తిగా అమలుపరచాలని ముఖ్యంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, పంట రుణాలను పూర్తిగా రద్దు చేయాలని, సన్నకారు చిన్నకారు రైతులకు నష్టదాయకంగా పరిణమించిన కార్పొరేట్ వ్యవసాయ సానుకూల విధానాలను మార్చాలనేవి ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లుగా ఉన్నాయి. ఈ డిమాండ్లను నెరవేర్చేంతవరకు తమ ఆందోళనను విరమించేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. కేన్సర్ వ్యాధిగ్రస్తుడైన డల్లేవాల్ ఆరోగ్య పరిస్థితి విషమించినా వెనకడుగువేయబోమని స్పష్టంచేస్తున్నారు. రైతుల ఉద్యమాన్ని సమాజంలోని అన్ని వర్గాల వారూ సమర్థిస్తున్నప్పటికీ వారి ఆందోళన పౌర జీవనానికి తీవ్ర అంతరాయం కలిగించడాన్ని ఎవరూ హర్షించలేకపోతున్నారు. పాలనలో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పాలకులను రైతుల ఆగ్రహావేశాలు సంయమనపరుస్తాయనే సత్యాన్ని విశాల సమాజం గుర్తించాలి. ఆందోళన సందర్భంగా చోటుచేసుకున్న అరాచక చర్యలు, పార్లమెంటులో బాధ్యతగల ప్రజాప్రతినిధుల వివేచనారహిత, అసంబద్ధ ప్రవర్తనల కంటే మన ప్రజాస్వామ్యానికి ఎక్కువ హాని చేస్తాయా? ఇది డల్లేవాల్, ఆయన మద్దతుదారుల తీరుతెన్నులను సమర్థించడం ఎంత మాత్రం కాదు. ప్రభుత్వంతో అర్థవంతమైన చర్చలకు వారు సంసిద్ధమవ్వాలన్నదే అందరి కోరిక.
కొత్త సంవత్సరం మొదటి రోజున పంట బీమా పథకాల పొడిగింపు, ఎరువులపై రాయితీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రైతుల హర్షామోదాలు పొందుతాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘2025 సంవత్సరంలో ప్రభుత్వ మొదటి నిర్ణయాన్ని కోట్లాది రైతు జనుల శ్రేయస్సుకు అంకితం చేశామని’ పేర్కొన్నారు. ఈ శ్రేయో వైఖరి ప్రతీకాత్మకంగా పరిమితమవకుండా సదా వాస్తవంగా రూపుదాల్చాలన్నదే అందరి ఆకాంక్ష.