బీరేన్ పశ్చాత్తాపం!
ABN , Publish Date - Jan 02 , 2025 | 05:21 AM
మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌కు సంవత్సరాంతమున జ్ఞానోదయం కలిగింది. ఏడాదిన్నరగా ఇల్లు తగలబడటానికి కారకుడు తానేనని ఆయన ఒప్పుకున్నారు. 2023మే 3నుంచి 2024డిసెంబరు 31వరకూ జరిగినదంతా...
మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌కు సంవత్సరాంతమున జ్ఞానోదయం కలిగింది. ఏడాదిన్నరగా ఇల్లు తగలబడటానికి కారకుడు తానేనని ఆయన ఒప్పుకున్నారు. 2023మే 3నుంచి 2024డిసెంబరు 31వరకూ జరిగినదంతా మణిపూర్ ప్రజలు తమ మనస్సుల్లోంచి చెరిపేసి, తనను క్షమించేయాలని కోరుతూ తీవ్ర పశ్చాత్తాపాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో జరిగినదానికి ఎంతో చింతిస్తున్నాను, ఎంతోమంది మరణించారు, ఎంతోమంది తమ ఆత్మీయులను కోల్పోయారు, ఇళ్ళూవాకిళ్ళూ వదిలేశారు అంటూ, ఇదంతా తన కారణంగానే జరిగిందని బాధపడ్డారు. తనవల్ల కష్టపడ్డవారు, నష్టపోయినవారు నిండుమనసుతో తనను క్షమించేసి, అన్ని జాతులవారూ, తెగలవారూ చేయీచేయీ కలిపి కొత్తసంవత్సరంలో ఆనందంగా కలిసిసాగాలన్నది ఆ ప్రకటన సారాంశం.
పశ్చాత్తాపాన్ని ప్రకటించడం, క్షమాపణలు చెప్పడం మెచ్చదగ్గ లక్షణాలు. ఎదుటివారు ఎంత కఠినాత్ములైనా, ఇటువంటి చర్యలకు కాస్తంతైనా మనసు కరగకుండా ఉండదు. బీరేన్ ప్రకటన మండుతున్న గుండెలను ఓదార్చి, శాంతిస్థాపనకు ఏమాత్రం దోహదపడినా సంతోషించాల్సిందే. కానీ, జరిగిందేదో జరిగిపోయిందనీ, గతాన్ని మరిచిపోవాలనీ చెప్పడానికి బీరేన్‌సింగ్ అర్హుడా అన్నది అతి ముఖ్యమైన ప్రశ్న. ఇప్పటివరకూ ఆయన ఘోరాన్ని ఒప్పుకోలేదని, ఇప్పుడు ఒప్పుకున్నారని, సమస్య తీవ్రతను గుర్తించడం, పరస్పరం కలహించుకుంటున్నవారు ఏకం కావాలని ఆశించడం మంచిదేనన్న విశ్లేషణలు సరైనవే. కానీ, ఆయన క్షమాపణల వెనుక కూడా ఏవో కొత్త కుట్రలున్నాయేమోనని, మరింత అణచివేతకు ఆయన మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారని మీతీయేతర జాతులవారు అనుమానపడుతున్నారట.
కొత్తసంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకోవడంలో తప్పేమీలేదు. కానీ, తగిన ప్రాతిపదికలు, పునాదులు లేకుండా అది తనకు తానుగా జరిగిపోదని ఆయనకూ తెలుసు. ఏడాదిన్నరకాలంలో సయోధ్యకు వీలైన వాతావరణాన్ని ఆయన సృష్టించిందేమీ లేదు. హైకోర్టు తన పరిధిని అతిక్రమించి మీతీలకు ఎస్టీ రిజర్వేషన్ కట్టబెట్టే చర్యలకు తెరదీయడం వెనుక బీరేన్ కుట్ర ఉన్నదని ఆదివాసీ తెగలు అనుమానించడంతో ఈ అగ్గిరేగిన విషయం తెలిసిందే. అప్పటికే వారికి వ్యతిరేకంగా బీరేన్ ప్రభుత్వం పలు నిర్ణయాలు చేయడం, వారిని మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులుగా చిత్రీకరించడం వంటివి నిప్పు సులువుగా అంటుకోవడానికి దోహదం చేశాయి. ఈ మొత్తం హింసాకాండలో బీరేన్ పూర్తిగా మీతీలపక్షాన వ్యవహరించారు. చివరకు పోలీసు స్టేషన్లనుంచి దోచుకున్న ఆయుధాలు కూడా వారి చేతుల్లోకే పోయాయి. మీతీ మిలిటెంట్‌గ్రూపులు రెచ్చిపోగలిగాయి. మీతీ బీరేన్ తమపక్షాన లేరని ఆదివాసీ తెగలు అనతికాలంలోనే నిర్ధారణకు వచ్చాయి. ఉన్నతస్థానంలో ఉంటూ సమన్యాయం చేయవలసిన నాయకుడు తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, తమకు చెందాల్సిన ఉద్యోగాలనూ, ప్రకృతివనరులను తనవారికి కట్టబెట్టదల్చుకున్నాడని వారికి అనిపించింది. నాయకుడిపైన ఉన్న ఈ విశ్వాసరాహిత్యమే అక్కడ అగ్గి ఆరనివ్వకుండా చేస్తోంది. దశాబ్దాలుగా పరస్పరం ఘర్షణపడుతున్న ఆదివాసీ తెగలన్నీ ఏకతాటిమీదకు వచ్చాయి. సమాజం నిలువునా చీలిపోయి, పరస్పర అవిశ్వాసం నిండిన ఈ వాతావరణం మిలిటెంట్ గ్రూపులకు సరికొత్త ఆక్సిజన్ అందించింది. ఇప్పుడు హింస ఎవరో ఇద్దరి మధ్య అని కాక, మొత్తం సమాజాన్ని కమ్మేసివుంది. ఏడాదిన్నరకాలంగా ఒక రాష్ట్రం ఇలా మండుతూంటే, కేంద్రం ఊరుకోవడం, ముఖ్యమంత్రిని సమర్థించుకురావడం మణిపూర్ విషయంలోనే జరిగింది. అదే ఓ విపక్షపాలిత రాష్ట్రమైవుంటే అగ్గిరాజుకున్న అనతికాలంలోనే అది కేంద్రం చేతుల్లోకి పోయివుండేది. ఇంతజరిగినా అక్కడకు మోదీ వెళ్ళకుండా, జరుగుతున్నదేమిటో దేశప్రజలకు తెలియనివ్వకుండా, పార్లమెంట్‌లో సైతం అసత్యాలతో కాలాన్ని నెట్టుకొచ్చేశారు. వేలాది సైనికులను మోహరించడం తప్ప, బీరేన్‌ను తప్పించాలన్న డిమాండ్‌కు ఢిల్లీపాలకులు లొంగనే లేదు.
నాలుగు మంచిమాటలు చెప్పి, క్షమించమని అడిగినంతనే సులభంగా వదిలేయగలిగేంత చిన్న పొరపాటు కాదిది. మణిపూర్ పాలకులు ఉద్దేశపూర్వకంగా రేపిన కార్చిచ్చు అది. తమ ప్రయోజనాలకు అనుగుణంగా దానిని రగిలిస్తూవచ్చిన వారు ఇప్పుడు హఠాత్తుగా గతాన్ని మరిచిపోమంటున్నారు. ఆదివాసీ తెగల్లో తన పట్ల ఆగ్రహానికీ, అవిశ్వాసానికి ఏయే చర్యలు దోహదం చేశాయో బీరేన్‌కు తెలుసు. ఈ సందర్భంగా వారికి కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చివున్నా ఆయన పట్ల నమ్మకం పెరిగేది, ఈ పశ్చాత్తాపానికి కాస్తంత విలువ ఉండేది.