Share News

పాక్–అఫ్ఘాన్‌ వైరం!

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:41 AM

అఫ్ఘానిస్థాన్‌మీద పాకిస్థాన్‌ వైమానికదాడులు జరిపి అనేకమంది ప్రాణాలు తీయడం గర్హనీయమని, ఖండిస్తున్నామని భారతదేశ విదేశాంగశాఖ ప్రతినిధి సోమవారం వ్యాఖ్యానించారు. ఎంతోమంది మహిళలు, పిల్లలు...

పాక్–అఫ్ఘాన్‌ వైరం!

అఫ్ఘానిస్థాన్‌మీద పాకిస్థాన్‌ వైమానికదాడులు జరిపి అనేకమంది ప్రాణాలు తీయడం గర్హనీయమని, ఖండిస్తున్నామని భారతదేశ విదేశాంగశాఖ ప్రతినిధి సోమవారం వ్యాఖ్యానించారు. ఎంతోమంది మహిళలు, పిల్లలు మరణించారంటూ ఘాటుగా విమర్శించడమే కాక, తన చేతగానితనానికి పొరుగుదేశాలను ఆడిపోసుకోవడం పాకిస్థాన్‌కు అలవాటేనని అన్నారాయన. దాదాపు పదిరోజుల క్రితం అఫ్ఘానిస్థాన్‌లోని తెహ్రీక్‌–ఎ–తాలిబాన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) స్థావరాలమీద పాకిస్థాన్‌ యుద్ధవిమానాలు బాంబులు కురిపించడంతో నలభైఆరుమంది మరణించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రకటించిన తాలిబాన్‌ మరో నాలుగురోజుల్లోనే పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఈ వరుస దాడుల్లో మంచిచెడ్డలను అటుంచితే, అఫ్ఘానిస్థాన్‌ పక్షాన పాకిస్థాన్‌ను భారతదేశం గట్టిగా తప్పుబట్టడం మారుతున్న రాజకీయానికీ, హెచ్చుతున్న సాన్నిహిత్యానికీ నిదర్శనం.

పాకిస్థాన్‌–అఫ్ఘానిస్థాన్‌ సరిహద్దు


ల్లో రెండువైపులా పెద్దసంఖ్యలో సైన్యాలు మోహరించివున్నాయని వార్తలు వస్తున్నాయి. తెహ్రీక్‌ తాలిబాన్‌మీద పాకిస్థాన్‌ వైమానికదాడులు చేయడం ఇది రెండోసారి. గత ఏడాది మార్చిలో కంటే ఇప్పుడు దాడులమీద తాలిబాన్‌ మరింత తీవ్రంగా స్పందించింది, ప్రతీకారం కూడా తీర్చుకుంది. అమెరికా అర్థంతరంగా అఫ్ఘానిస్థాన్‌ను వదిలేసి, తట్టాబుట్టా సర్దేసిన కొద్దిగంటల్లోనే, ఆ దేశం తాలిబాన్ల వశమైన విషయం తెలిసిందే. వారిని ఎదిరించలేక, అమెరికా శిక్షణ పొందిన అఫ్ఘాన్‌సైనికులు, పోలీసులు పరుగులు తీసిన దృశ్యాలు చూశాం. తాలిబాన్ల పునరాగమనంతో అఫ్ఘాన్లు వొణికిపోయారు. వందలాదిమంది దేశం విడిచిపోయారు. యావత్‌ ప్రపంచం తాలిబాన్‌ రాకకు భయపడుతూంటే, పాకిస్థాన్‌ మాత్రం ఎగిరిగంతేసింది. అమెరికా తనమాట విని దేశాన్ని తాలిబాన్‌కు వదిలేసినందుకు సంతోషించింది. అల్లా దయతోనే ఇదంతా జరిగిందన్నారు ఇమ్రాన్‌ఖాన్‌. అధికారాన్ని కైవసం చేసుకోవడానికి మార్గాన్ని సుగమంచేసిన తనపట్ల తాలిబాన్‌ విధేయంగా ఉంటుందని పాకిస్థాన్‌ పాలకులు భ్రమపడ్డారు. కానీ, అనతికాలంలోనే ఉభయుల మధ్యా వ్యవహారం పూర్తిగా చెడింది. గత అవతారానికి కాస్తంత భిన్నంగా, స్వతంత్రంగా వ్యవహరిస్తున్న తాలిబాన్‌ ఈ మారు పాకిస్థాన్‌ ఆదేశాలను, ఆలోచనలను లక్ష్యపెట్టలేదు.


ఇక, తాలిబాన్‌ ఆశీస్సులతోనే టీటీపీ తనపై ఇంతగా రెచ్చిపోతున్నదన్న పాకిస్థాన్‌ వాదన కాదనలేనిది. తాలిబాన్‌ మధ్యవర్తిత్వంతో 2021లో ఇమ్రాన్‌ ప్రభుత్వం టీటీపీతో చర్చలు జరిపింది. అవి ఫలితానివ్వకపోవడంతో పాటు, అమెరికా వదిలిపోయిన చాలా ఆయుధాలు ఈ సంస్థ చేతుల్లో పడటంతో అది మరింత బలోపేతమైంది. టీటీపీ విషయంలో పాకిస్థాన్‌ ఎప్పటికప్పుడు తాలిబాన్‌ను హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోయింది. టీటీపీని నియంత్రించిన పక్షంలో అందులోని సాయుధులంతా ఐసిస్‌వంటి సంస్థల్లో చేరిపోయి తన ఉనికికే ప్రమాదం తేవచ్చునని తాలిబాన్‌ భయం. ఇతర ఉగ్రసంస్థలను నిలువరించడానికి తాలిబాన్‌కు టీటీపీతో స్నేహం ఉపకరిస్తోంది. టీటీపీని పెంచిపోషిస్తున్నందుకు పాకిస్థాన్‌ తీవ్రంగా మండిపడుతున్నప్పటికీ తాలిబాన్‌ లక్ష్యపెట్టడం లేదు. పాకిస్థాన్‌ సరిహద్దుప్రాంతాలతో అది సాగిస్తున్న విధ్వంసానికి తాలిబాన్‌ పరోక్షంగా సాయపడుతున్నది కూడా. ఒకపక్క టీటీపీ, మరోపక్క బలూచ్‌, పష్తూన్‌ తిరుగుబాటుదారుల విధ్వంసకాండలతో పాకిస్థాన్‌ నలిగిపోతోంది. చైనా, సౌదీ పెట్టుబడులకు భద్రతకల్పించలేని స్థితికి అది జారుకుంది. తాలిబాన్‌తో నేరుగా యుద్ధానికి దిగి గెలిచేస్థితిలో పాకిస్థాన్‌ లేదు. కానీ, ఇలా అడపాదడపా సరిహద్దుల్లోకి చొరబడి, ఏవో కొన్ని దాడులు జరుపుతూ ఉగ్రవాదంమీద యుద్ధం చేస్తున్నట్టుగా ప్రజలను సమాధానపరచే ప్రయత్నమైతే పాక్‌ పాలకులు చేస్తున్నారు. పాకిస్థాన్‌లో ఉంటున్న లక్షలాదిమంది అఫ్ఘాన్లను వెళ్ళగొట్టిన ఘటన ఉభయదేశాల మధ్యా మరింత దూరం పెంచింది. ఒకవైపు పాకిస్థాన్‌తో సంబంధాలు ఇలా పతనమైపోతూంటే, మరోపక్క అఫ్ఘాన్‌–భారత్‌ సాన్నిహిత్యం పెరుగుతోంది. ఇటీవలే భారతదేశంలో అఫ్ఘానిస్తాన్‌ రాయబారిగా యువవిద్యార్థి ఇక్రముద్దీన్‌ కమిల్‌ నియమితుడైనాడు. పాక్‌ప్రేరేపిత ఉగ్రవాదసంస్థలను తన భూభాగంలో అనుమతించకుండా, భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించకుండా తాలిబాన్‌ ఉన్నంతకాలం ఈ స్నేహం కొనసాగుతుంది. పాకిస్థాన్‌ను తల ఎగరేయకుండా సరిహద్దుల్లో ఉంచేందుకు తాలిబాన్‌తో స్నేహం ఉపకరిస్తుంది.

Updated Date - Jan 07 , 2025 | 12:41 AM