Education : వీరగాథల చిరునామా ఆచార్య ‘తంగిరాల’
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:02 AM
విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వవికాసానికి బాటలు వేసేవారు ఉత్తమ గురువులు. తాము సముపార్జించుకున్న జ్ఞానాన్ని, అనుభవాన్ని సమాజాభ్యుదయానికి వినియోగించేవారు అత్యుత్తమ గురువులు. జీవితాన్ని
విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వవికాసానికి బాటలు వేసేవారు ఉత్తమ గురువులు. తాము సముపార్జించుకున్న జ్ఞానాన్ని, అనుభవాన్ని సమాజాభ్యుదయానికి వినియోగించేవారు అత్యుత్తమ గురువులు. జీవితాన్ని బోధనతో, పరిశోధనతో పండించుకున్న అత్యుత్తమ గురువు ఆచార్య తంగిరాల వెంకటసుబ్బారావు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన స్వయంకృషితో ఎదిగారు. స్వీయ క్రమశిక్షణతో రాణించారు. అసాధారణ ప్రతిభతో వృత్తికి అంకితమై, విశ్వవిద్యాలయాల్లో బోధనకు, పరిశోధనకు కొత్తవాకిళ్ళు తెరిచి, ఆచార్య శేఖరులయ్యారు. 90 సంవత్సరాల వయస్సులోనూ నిరంతర అధ్యయనశీలిగా, నిరాడంబర సాహితీమూర్తిగా, బెంగళూరు నగరంలో తెలుగుకు వెలుగు జెండాలెత్తారు. బెంగళూరు విశ్వవిద్యాలయంలో మూడు దశాబ్దాలకు పైగా వేలాది మంది శిష్యులకు ఆరాధ్య గురువయ్యారు. విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ ప్రారంభ వికాసాలకు ఆద్యులయ్యారు. శిష్యుల్ని సొంత బిడ్డల్లా చేరదీసి మానవతా ప్రపూర్ణులయ్యారు.
తంగిరాలవారు తమ ప్రతిభకు పదునుపెట్టే క్రమంలో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం పర్యవేక్షణలో ‘తెలుగు వీరగాథా కవిత్వం’పై పరిశోధన చేసి, విస్తృత జానపద వీరుల గాథలను వెలుగులోకి తెచ్చారు. విషయ సేకరణ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామాల్లో సైతం పర్యటించారు. గ్రామీణుల నాలుకలపై నర్తించే మౌఖిక గాథలకు అక్షరరూపమిచ్చారు. 1402 పుటల బృహత్పరిశోధన గ్రంథాన్ని తమ సోదరులు టీవీకే సోమయాజులు, ఇతర దాతల సహాయంతో ముద్రించి, భావి పరిశోధకులకు దారిదీపంగా నిలిచారు. ఆయా ప్రక్రియలపై ప్రామాణిక పరిశోధన చేసిన ఆచార్య బిరుదురాజు రామరాజు, ఆచార్య ఎస్వీ జోగారావు, ఆచార్య తిమ్మావజ్ఝల కోదండరామయ్య వంటి దిగ్దంతుల సరసన స్థానం సంపాదించారు. తెలుగునాట వీరగాథాకవిత్వానికి శాశ్వత చిరునామాగా నిలిచారు.
తంగిరాలవారు ఉత్తమ పరిశోధకులుగానే కాక, ఉన్నత భావాలు కలిగిన కవిగా, వేదికలను వెలిగించిన మధుర వక్తగా, ‘చైతన్యకవిత’ పత్రిక సంపాదకునిగా, ‘శ్రీరస’ సాహిత్య సంస్థ సారథిగా, తెలుగు–కన్నడ భాషల వారధిగా, ‘నెలనెలా వెన్నెల’ కాంతులు వెదజల్లారు. వచన కవితను వర్షించారు. పద్యాన్ని తమ లేఖినిలో పండించారు. బుడ్డా వెంగళరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీర సమరగాథను ‘రేనాటి సూర్యచంద్రులు’గా పాఠకులకు పరిచయం చేశారు. తమ అభిమానకవి బాలగంగాధర తిలక్ సర్వలభ్య రచనల సంపుటిని ‘మనసు ఫౌండేషన్’ సహకారంతో ప్రచురించారు. నందిరాజు చలపతిరావు స్త్రీల పాటలను సేకరించి, 1200 పుటల ఉద్గ్రంథంగా ‘అజో– విభొ–కందాళం ఫౌండేషన్’ వారి ప్రచురణగా వెలుగులోకి తెచ్చారు. తెలుగునాట పేరెన్నికగన్న కవులు, రచయితలు, సాహితీవేత్తలను బెంగుళూరుకు ఆహ్వానించి, ‘శ్రీరస’ వేదికగా ప్రసంగాలు ఏర్పాటు చేసి సదస్యులకు రసామృతాన్ని పంచిపెట్టారు. తమకు తొలి గురువు, జీవితానికి వెలుగుదారిగా నిల్చిన అగ్రజులు సోమయాజులు స్మృతిపథంలో ‘అశ్రుతర్పణం’– గ్రంథాన్ని ప్రచురించి, సోదరప్రేమను చాటుకున్నారు.
‘విద్య కేవలం యాంత్రిక మేధస్సుకు సంబంధించిన పరిశ్రమగా మిగిలిపోకూడదు. హృదయం, ఆత్మపరిణతి శీలనిర్మాణానికి ఉపయోగపడేదే నిజమైన విద్య’– అనుభవాన్ని రంగరించి చెప్పిన తంగిరాలవారి సూక్తి వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఒంగోలులో ప్రకాశం జిల్లా రచయితల మహాసభల్లో వీరగాథాకవిత్వంపై వారు చేసిన సోదాహరణ ప్రసంగం చిరస్మరణీయంగా నిలుస్తుంది. ఇటీవల ప్రచురించిన ‘గురువందనం’ సంచిక, సుబ్బారావు వ్యక్తిత్వాన్ని బహుముఖంగా ఆవిష్కరించింది.
కాటమరాజులాగే తంగిరాలవారు ధీరచిత్తులు. ఆజానుబాహులు. ఆర్ద్రమనస్కులు. జీవితంలో మిట్టపల్లాలు నెట్టుకుని, చెరగని చిరునవ్వును స్థిరాస్తిగా మిగుల్చుకున్న తంగిరాల వెంకటసుబ్బారావు తన గుండెపూసిన గులాబీ శకుంతలాదేవి సాహచర్యంలో జీవన సౌరభాన్ని ఆస్వాదించారు. ప్రఖ్యాత పద్యకవి చిటిప్రోలు కృష్ణమూర్తి ‘పురుషోత్తముడు’ కావ్యంతో పాటు, పలువురు ఆత్మీయులైన కవులు, రచయితల రచనలను అంకితం తీసుకుని అపర శ్రీకృష్ణదేవరాయలుగా కీర్తిగడించారు. తన పర్యవేక్షణలో 15 పీహెచ్‌డీలు, 28 ఎంఫిల్ పట్టాలతో పరిశోధకులను పట్టభద్రులుగా చేసి, పరిశోధక పరమేష్ఠిగా ప్రశంసలు పొందారు.
1935 మార్చి 30న తంగిరాల వెంకట సుబ్బావధానులు, సీతామహాలక్ష్మి పుణ్యదంపతులకు జన్మించిన ఈ ప్రతిభామూర్తిని అజో– విభొ–కందాళం ఫౌండేషన్ వారు ‘ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం’తో జనవరి 5న విజయవాడలో సత్కరించనున్నారు. ఇది జానపద వాఙ్మయ పరిరక్షక బ్రహ్మ నేదునూరి గంగాధరం తర్వాత మౌఖికసాహిత్య ప్రచారకునిగా తంగిరాలవారికి లభించిన గొప్ప గుర్తింపు. శిష్యవాత్సల్య సంపన్నులైన ఆచార్యునికి నిండుగుండెతో చేస్తున్న సరస్వతీపూజ.
డా. బీరం సుందరరావు