Share News

Prof. Keshavarao Jadhav : కేశవరావు జాదవ్‌ స్మారక చిహ్నాలు నెలకొల్పాలి

ABN , Publish Date - Jan 04 , 2025 | 04:56 AM

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌ రెడ్డి గారికి... తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ పక్షాన తొలి ముఖ్యమంత్రిగా మీరు అధికారంలోకి వచ్చి రాగానే మాది ప్రజా ప్రభుత్వమని ప్రకటించి ఏడాది కావస్తోంది. ఈ మధ్య కోఠి మహిళా యూనివర్సిటీకి తెలంగాణ సాయుధ

Prof. Keshavarao Jadhav : కేశవరావు జాదవ్‌ స్మారక చిహ్నాలు నెలకొల్పాలి

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌ రెడ్డి గారికి... తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ పక్షాన తొలి ముఖ్యమంత్రిగా మీరు అధికారంలోకి వచ్చి రాగానే మాది ప్రజా ప్రభుత్వమని ప్రకటించి ఏడాది కావస్తోంది. ఈ మధ్య కోఠి మహిళా యూనివర్సిటీకి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరు పెట్టడం హర్షణీయం. కానీ నిఖార్సయిన తెలంగాణ ఉద్యమకారుడిగా, మిస్టర్‌ తెలంగాణగా ప్రజల మన్ననలు పొందిన ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్‌ (1933– 2018)ను గత ప్రభుత్వం విస్మరించింది. అది సబబు కాదని భావిస్తూ జనవరి 27, 2025న ఆయన 92వ జయంతి నాటికి తెలంగాణలో ఆయన స్మారక చిహ్నాలు నెలకొల్పి, కేశవరావు జాదవ్‌ జీవితాన్ని పాఠ్యాంశంగా పెట్టాలని తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం.

దేశ–విదేశీ సమున్నత విలువలను, సంస్కృతులను తనలో ఇముడ్చుకున్న హైదరాబాద్‌ రాష్ట్రానికి ఆయన ప్రతీక. హైదరాబాదీ మాటతీరుకు, తెలంగాణ గంగా–జమున తెహజీబ్‌కు ప్రతినిధిగా పెరిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న గర్వంతో కనుమూసిన జాదవ్‌ సార్‌ వలస విముక్త నవ తెలంగాణ గురించి కన్న కలలు ఇంకా నెరవేరలేదు. అందుకే ఆయన జీవితం తెలంగాణ యువతి–యువకులను సదా జాగృతపరిచేలా ఒక పాఠ్యాంశంగా ఉండాలని మా విజ్ఞప్తి, డిమాండ్‌ కూడా. జనవరి 27, 1933లో హైదరాబాద్‌లోని హుస్సేనీ ఆలంలో జన్మించిన కేశవరావు జాదవ్‌ జీవితమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. తన జీవిత కాలంలో 1946–51 వరకు కొనసాగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని, 1952 ముల్కీ ఉద్యమాన్ని, 1969 నుండి సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాన్ని, నక్సలైట్‌ ఉద్యమాన్ని, హక్కుల ఉద్యమాన్ని ప్రత్యక్షంగా గమనించాడు. వీటన్నింటిలో ఆయన ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యం పొంది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారాడు. తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక భూమిక అందించడంలో అంతర్గత వలస సూత్రీకరణ అనేది మలిదశ ఉద్యమానికి పునాది. ఆ భావ ప్రచారంలో కేశవరావు జాదవ్‌ది కీలక పాత్ర.

జాదవ్‌ను స్మరించుకోవడమంటే గంగా–జమునా తెహజీబ్‌ను, వలస విముక్త నవ తెలంగాణను, సామాజిక న్యాయాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుర్తు చేసుకోవడం. అందుకే ఈ ప్రతిపాదనలను మీ ముందు పెడుతున్నాం, ఆమోదించమని కోరుతున్నాం. 1. ప్రొ. కేశవరావు జాదవ్‌ జీవితాన్ని విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టాలి. 2. ఆయన ఎక్కువ కాలం ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌గా పనిచేసిన ఉస్మానియా ఇంజనీరింగ్‌ కళాశాలకు జాదవ్‌ పేరు పెట్టాలి. 3. ఆయన జన్మించిన హుస్సేనీ ఆలంలో, ఉస్మానియాలో, 10 పాత జిల్లా కేంద్రాల్లో ఆయన విగ్రహాలు నెలకొల్పాలి. 4. హుస్సేన్‌ సాగర్‌ తీరంలో ప్రొ. కేశవరావు జాదవ్‌ స్మృతి వనం ఏర్పర్చాలి.

– విమలక్క, కపిలవాయి దిలీప్‌ కుమార్‌, ఎస్‌. జీవన్‌ కుమార్‌,

చంద్రశేఖర్‌ (న్యాయవాది), ప్రొ. లక్ష్మణ్‌, టి. హాన్మాండ్లు,

ఆచార్య కట్టా భగవంత్‌ రెడ్డి, దూసరి రాజుగౌడ్‌, పాశం యాదగిరి,

సోగరా బేగం, మన్నారం నాగరాజు, భార్గవ్‌.

Updated Date - Jan 04 , 2025 | 04:56 AM