Share News

ట్రూడో నిష్క్రమణ

ABN , Publish Date - Jan 08 , 2025 | 12:19 AM

గొప్పగా ప్రారంభమై చప్పగా ముగిసిన రాజకీయ ఘట్టం కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కథ. ‘పాశ్చాత్య దేశాలలో నవీన ప్రగతిశీలవాదానికి ప్రతినిధిగా జస్టిన్‌ ట్రూడో కంటే చెప్పదగిన నాయకుడు మరొకరు లేరు...

ట్రూడో నిష్క్రమణ

గొప్పగా ప్రారంభమై చప్పగా ముగిసిన రాజకీయ ఘట్టం కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కథ. ‘పాశ్చాత్య దేశాలలో నవీన ప్రగతిశీలవాదానికి ప్రతినిధిగా జస్టిన్‌ ట్రూడో కంటే చెప్పదగిన నాయకుడు మరొకరు లేరు. ట్రూడో పాలన వలే మరెవ్వరి పాలన ఉపద్రవకరంగా విఫలమవలేదు’ అని కెనడియన్‌ వ్యాఖ్యాత జోర్డాన్‌ పీటర్సన్‌ అన్నారు. ప్రధానమంత్రి పదవి, అధికార లిబరల్‌ పార్టీ నాయకత్వం నుంచి వైదొలగనున్నట్టు ట్రూడో సోమవారం నాడు ప్రకటించారు.

కెనడా 23వ ప్రధానమంత్రిగా నవంబర్‌ 2015లో అధికారం చేపట్టిన ట్రూడో తొమ్మిదేళ్లకు పైగా పాలనలో సామాజిక సంక్షేమ విధానాలకు ప్రాధాన్యమిచ్చారు. కెనడా 15వ ప్రధాని పియోర్రె ఎలియట్‌ ట్రూడో కుమారుడైన జస్టిన్‌ తన రాజకీయ జీవితంలో ఎన్నికల పరాజయమనేది ఎరుగని నేత. 2008లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన జస్టిన్‌ ట్రూడో 2013లో లిబరల్‌ పార్టీ నాయకత్వానికి పోటీ చేసి నెగ్గారు. 2015న నవంబర్‌ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో లిబరల్‌ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రధానమంత్రిగా తన తొలి కేబినెట్‌లోనే జెండర్‌ సమత్వానికి ప్రాధాన్యమిచ్చారు. ఆ విధానాన్ని ఆయన చివరిదాకా కొనసాగించారు. 2019లోను, 2021లోను ఆయన నాయకత్వంలో లిబరల్‌ పార్టీ న్యూ డెమొక్రాటిక్‌ పార్టీ మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. గత కొద్దినెలలుగా పార్టీ నుంచి అంతర్గత ఒత్తిళ్లు, ప్రజల నుంచి నిరసనలు తీవ్రమవడంతో ట్రూడో ప్రధానమంత్రి పదవి, లిబరల్‌ పార్టీ నాయకత్వం నుంచి వైదొలగడానికి నిర్ణయించుకున్నారు. అక్టోబర్‌లో జరగనున్న తదుపరి పార్లమెంటరీ ఎన్నికలలో లిబరల్‌ పార్టీ గెలుపు అసాధ్యమనే అభిప్రాయం గట్టిగా ఉన్నది. కెనడాలో ఒక పార్టీ వరుసగా నాలుగుసార్లు అధికారంలోకి రావడమనేది చాలా అరుదు. ఆ అరుదైన చరిత్ర ఒక శతాబ్దం క్రితం మాత్రమే సంభవించింది.


కెనడాలోని సిక్కు పౌరులు 2015లో ట్రూడో విజయానికి విశేషంగా దోహదం చేశారు. ఆయన నాయకత్వంలోని మైనారిటీ ప్రభుత్వం మనుగడకు సిక్కు నాయకుల నేతృత్వంలోని న్యూ డెమొక్రాటిక్‌ పార్టీ గట్టి దన్నుగా ఉన్నది. ఈ కారణంగా, సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతునివ్వడంలో ఆయన చూపిన అత్యుత్సాహం చివరకు భారత్‌తో దౌత్య వివాదానికి దారి తీసింది. ఆ వివాదం పార్టీలో ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసింది. భారత్‌తో అనవసర కలహానికి ట్రూడో కారకుడయ్యారన్న అభిప్రాయం కెనడా ప్రజల్లో కూడా నెలకొన్నది. భారత్‌తో దౌత్య జగడం ఆయన రాజీనామా నిర్ణయానికి దారితీసిన కారణాలలో ఒకటి.


ఈ నెల 20న అమెరికా 47వ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్‌ ట్రంప్‌ సైతం ట్రూడో అధికార ప్రాభవానికి గండి కొట్టారు. ట్రంప్ గతంలో అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇరుదేశాలకు సానుకూలంగా ‘ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ పునరుద్ధరించుకునే విషయమై ఆయనతో చర్చలు జరపడంలో ట్రూడో సఫలమయ్యారు. అయితే ట్రంప్‌ 2024 నవంబర్‌ అధ్యక్ష ఎన్నికలో విజయం సాధించిన తరువాత కెనడా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సరుకులపై 25 శాతం సుంకం విధిస్తామని ఖరాఖండీగా ప్రకటించారు. అంతేగాక కెనడా నుంచి అమెరికాకు వలసకారుల వెల్లువను అరికట్టాల్సిన బాధ్యత కూడా కెనడాదేనని ట్రంప్‌ నిర్దేశించారు. సుంకాల పెంపుదలపై ట్రంప్‌ తన వైఖరిని విడనాడని పక్షంలో కెనడా ఆర్థికవ్యవస్థ తీవ్రంగా నష్టపోతుంది. దీనిపై అన్ని రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. చర్చలు జరిపి పరిస్థితిని చక్కబరిచేందుకు ట్రూడో ప్రోటోకాల్‌కు విరుద్ధంగా అమెరికా వెళ్లి, అధ్యక్షుడుగా ఎన్నికైన ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా చెయ్యాలని ట్రూడోకు ట్రంప్‌ సూచించినట్టు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో ట్రంప్‌ ఇదే చెబుతూవస్తున్నారు కూడా. సుంకాల పెంపుదల బెదిరింపుతో పాటు ఈ వెక్కిరింపు ధోరణి కెనడాలో తీవ్ర అసంతృప్తి, నిరసనలకు దారితీసింది. ట్రంప్‌ను ట్రూడో నిలువరించలేక పోతున్నారనే అభిప్రాయం కెనడాలో ఉంది. కెనడా సౌర్వభౌమత్వ హక్కును కాపాడడంలో ట్రూడో విఫలమవడంపై సొంత పార్టీలో అసంతృప్తి పెరిగింది. ఉరుములేని పిడుగులా డిప్యూటీ ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్‌ రాజీనామా చేశారు. ట్రంప్‌తో గట్టిగా వ్యవహరించడంలో ట్రూడో విఫలమవుతున్నారంటూ ఆయన నాయకత్వ సమర్థతపై ఆమె బహిరంగంగా సందేహాలు వ్యక్తం చేశారు. క్రిస్టియా రాజీనామాతో పార్టీ నాయకత్వం, ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలిగేందుకు ట్రూడో నిర్ణయించుకున్నారు. పోగుబడిన అనేక వివాదాలను, సమస్యలను ఆయన రాజీనామా పరిష్కరించగలదో లేదో చూడాలి.

Updated Date - Jan 08 , 2025 | 12:19 AM