Share News

Mark Zuckerberg: దేవుడిని అవమానిస్తూ ఫొటోలు.. పాకిస్తాన్‌లో నాకు మరణశిక్ష పడేలా ఉంది: జుకర్‌బర్గ్

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:30 AM

ఇటీవల జో రోగన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జుకర్ బర్గ్ కీలక వ్యాఖ్యాల చేశారు. ఇటీవల పాకిస్తాన్‌లో తనపై నమోదైన దావా గురించి ఈ సందర్భంగా బయటపెట్టారు. వివిధ దేశాల్లో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికా సంస్థలకు అమెరికా ప్రభుత్వం సహాయసహకారాలు అందించాలని ఈ సందర్భంగా జుకర్ బర్గ్ విజ్ఞప్తి చేశారు.

Mark Zuckerberg: దేవుడిని అవమానిస్తూ ఫొటోలు.. పాకిస్తాన్‌లో నాకు మరణశిక్ష పడేలా ఉంది: జుకర్‌బర్గ్
Meta CEO Mark zuckerberg

వివిధ దేశాలు పలు సాంప్రదాయాలను, ఆచార నిబంధనలను పాటిస్తాయని, వాటికి అనుగుణం పని చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలిసి ఉంటుందని మెటా (Meta) సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) వ్యాఖ్యానించారు. ఇటీవల జో రోగన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జుకర్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాకిస్తాన్‌ (Pakistan)లో తనపై నమోదైన దావా గురించి ఈ సందర్భంగా బయటపెట్టారు. వివిధ దేశాల్లో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికా సంస్థలకు అమెరికా ప్రభుత్వం సహాయసహకారాలు అందించాలని ఈ సందర్భంగా జుకర్ బర్గ్ విజ్ఞప్తి చేశారు.


``వివిధ దేశాల్లో పలు నిబంధనలు, ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి. మనం అంగీకరించలేని పరిస్థితులు ఉన్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛపై చాలా దేశాల్లో నిబంధనలు ఉన్నాయి. నాకు మరణశిక్ష విధించాలంటూ ఇటీవల పాకిస్తాన్‌లో ఎవరో దావా వేశారు. ఎవరో దేవుడిని కించపరిచే ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడమే దానికి కారణం. అది ఎక్కడి వరకు వెళ్తుందో నాకు తెలియదు. ఏదేమైనా పాకిస్తాన్ వెళ్లే ఉద్దేశం నాకు లేదు కాబట్టి ఆ కేసు విషయంలో ఇబ్బంది లేదు. కానీ, ఇలాంటి నిబంధనల వల్ల చాలా కంటెంట్‌ను అణిచివేయాల్సిన పరిస్థితి వస్తోంద``ని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు.


చాలా దేశాల్లో ఫేస్‌బుక్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జైల్లో పడేసేంత కఠిన పరిస్థితులు కూడా కొన్ని దేశాల్లో ఉన్నాయని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. వివిధ దేశాల్లో అమెరికా టెక్ కంపెనీలు ఎదుర్కొంటున్న కఠిన సవాళ్ల విషయంలో అమెరికా ప్రభుత్వం స్పందించాలని, తగిన రక్షణ కల్పించాలని జుకర్‌బర్గ్ విజ్ఞప్తి చేశారు. గతేడాది జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఫేస్‌బుక్‌తో సహా పలు సామాజిక మాధ్యమాలను పాకిస్తాన్ నిషేధం విధించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 13 , 2025 | 11:30 AM