Share News

వాహనంతో జనం పైకి దూసుకెళ్లి.. ఆపై కాల్పులు

ABN , Publish Date - Jan 02 , 2025 | 05:07 AM

అమెరికాలో నూతన సంవత్సర వేడుకల వేళ ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. ఓ బార్‌ వెలుపల జనం గుమిగూడి ఉండగా.. వాహనంతో వారిపైకి దూసుకెళ్లి ఆపై కాల్పులు జరిపాడు.

వాహనంతో జనం పైకి దూసుకెళ్లి.. ఆపై కాల్పులు

న్యూ ఇయర్‌ వేళ అమెరికాలో ఘటన

10 మంది మృతి.. 30 మందికి గాయాలు

ఉగ్రదాడి కాదన్న ఎఫ్‌బీఐ.. దర్యాప్తు మొదలు

లూసియానా, జనవరి 1: అమెరికాలో నూతన సంవత్సర వేడుకల వేళ ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. ఓ బార్‌ వెలుపల జనం గుమిగూడి ఉండగా.. వాహనంతో వారిపైకి దూసుకెళ్లి ఆపై కాల్పులు జరిపాడు. దీంతో 10 మంది మృతి చెందగా.. 30 మంది వరకు గాయపడ్డారు. లూసియానా రాష్ట్రం న్యూ ఆర్లీన్స్‌లోని ఫ్రెంచ్‌ క్వార్టర్‌ బోర్బన్‌ స్ట్రీట్‌లో బుధవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్త సంవత్సర వేడుకలు కాసేపట్లో ముగుస్తాయనగా.. ఓ బార్‌ వెలుపల జనాలు గుమిగూడారు. ఓ ఆగంతకుడు ఎస్‌యూవీ పికప్‌ ట్రక్కుతో వారిపైకి దూసుకెళ్లాడు. అనంతరం తుపాకీ తీసి కాల్పులకు తెగబడ్డాడు. అప్రమత్తమైన అక్కడి పోలీసులు దుండగుడిపై కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అప్పటికే పలువురు మృతి చెందగా.. దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. ‘ఇది తీవ్రవాద దాడి కాదని భావిస్తున్నాం. ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు లభించాయి. వాటిని పరిశీలించాల్సి ఉంది’ అని ఎఫ్‌బీఐ వెల్లడించింది.

Updated Date - Jan 02 , 2025 | 05:07 AM