Share News

మోదీ, ట్రంప్‌నకు పుతిన్‌ కృతజ్ఞతలు

ABN , Publish Date - Mar 15 , 2025 | 05:30 AM

ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభ పరిష్కారంలో చొరవ తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ధన్యవాదాలు తెలిపారు.

మోదీ, ట్రంప్‌నకు పుతిన్‌ కృతజ్ఞతలు

  • ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభ పరిష్కారంలో చొరవపై హర్షం

మాస్కో, మార్చి14: ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభ పరిష్కారంలో చొరవ తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ధన్యవాదాలు తెలిపారు. చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా అధ్యక్షులు కూడా ఈ సంక్షోభ పరిష్కారానికి సమయం ఇచ్చారని గుర్తు చేస్తూ వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఇది యుద్ధాల సమయం కాదని, భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని పుతిన్‌ సమక్షంలోనే మోదీ గతంలో చెప్పారు. మరోవైపు ట్రంప్‌ అధికారంలోకి రాగానే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని విరమింపచేసేందుకు తీవ్రంగా కృషి చేశారు. 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించారు. దీనికి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెనువెంటనే సమ్మతి తెలపగా పుతిన్‌ ఎట్టకేలకూ అంగీకారం తెలిపారు.


అయితే కాల్పుల ఒప్పందం శాశ్వత శాంతికి దారి తీయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు పుతిన్‌తో చర్చలు ఫలప్రదంగా జరిగాయని ట్రంప్‌ చెప్పారు. చర్చల సందర్భంగా కుర్క్స్‌ ప్రాంతంలో రష్యా సైన్యం చుట్టుముట్టిన వేలాది మంది ఉక్రెయిన్‌ సైనికుల ప్రాణాలు కాపాడాలని పుతిన్‌ను గట్టిగా కోరానన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పుతిన్‌ ఉక్రెయిన్‌ సైనికులను లొంగిపోవాలని కోరారు. ట్రంప్‌ విజ్ఞప్తిని సానుభూతితో అర్థం చేసుకున్నామంటూ టెలివిజన్‌ సందేశంలో తెలిపారు. ఉక్రెయిన్‌ సైనికులు ఆయుధాలు అప్పగించి లొంగిపోతే వారి ప్రాణాలకు హామీ ఇస్తామన్నారు. ఉక్రెయిన్‌ సైనికులతో గౌరవంగా వ్యవహరిస్తామని పుతిన్‌ హామీ ఇచ్చారు.

Updated Date - Mar 15 , 2025 | 05:31 AM