Tesla Cars: మంటల్లో టెస్లా కార్లు.. ఎలాన్ మస్క్ తీవ్ర ఆగ్రహం
ABN , Publish Date - Mar 19 , 2025 | 06:11 PM
మంటల్లో టెస్లా కార్లు కాలిపోవటం చూసి ఎలాన్ మస్క్ గుండె పగిలింది. ఈ సంఘటనపై ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. తన కార్లను తగలబెట్టడం టెర్రరిజం అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మనసు కలిచి వేసే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఆ సంఘటన కారణంగా మస్క్ మామ తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఆ పని చేసిన వారిపై మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికాలోని లాస్ వెగాస్‌లో గుర్తు తెలియని ఓ వ్యక్తి టెస్లా కార్లపై దారుణానికి పాల్పడ్డాడు. ఐదు టెస్లా కార్లను కాక్‌టేల్ పోసి తగలబెట్టేశాడు. వీటిలో రెండు కార్లు పూర్తిగా కాలిపోయాయి. లాస్ వెగాస్‌లోని టెస్లా కోలిసన్ సెంటర్ దగ్గర తెల్లవారుజామున 2.45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. దుండగుడు కార్లను తగలబెట్టడానికి మోలోటోవ్ కాక్‌టేల్ ఉపయోగించాడు. తుపాకితో కార్లను కాల్చాడు. అంతేకాదు.. కార్ల షో రూము డోర్లపై ‘ రేసిస్ట్’ అనే పదాన్ని రాశాడు.
ఈ నేపథ్యంలో ఎఫ్‌బీఐ రంగంలోకి దిగింది. సంఘటనపై దర్యాప్తు చేస్తోంది. కార్లను తగలబెట్టడంలో టెర్రరిజం జాడలు కనిపిస్తున్నాయని అంది. ఇక, కార్లు తగలబడుతున్న దృశ్యాల తాలూకా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలపై కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో వరుస పోస్టులు పెట్టారు. ఎలిజబెత్ హెల్‌గలీన్ అనే మహిళ పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ‘ ఇలా చేయటం మూర్ఖత్వం .. చాలా పెద్ద తప్పు. టెస్లా కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే తయారు చేస్తోంది. ఇలా కార్లను తగలబెట్టేంత తప్పు ఏమీ చేయలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరో పోస్టులో కోలిన్ రగ్ అనే వ్యక్తి చేసిన ట్వీట్‌ను రీ ట్వీట్ చేశారు. ‘ టెర్రరిజం’ అన్న ఒక్క పదంతో తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు.
టెస్లా షోరూములపై వరుస దాడులు..
అమెరికాలో టెస్లా కార్ల షోరూములపై దాడులు చేయటం సర్వసాధారణంగా మారింది. ఒక్కో చోట ఒక్కో విధంగా దాడులకు పాల్పడుతున్నారు. కార్లను బద్ధలు కొట్టడం, వాటిపై రంగులతో బొమ్మలు గీయటం, గన్నులతో కాల్చటం వంటివి చేస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల్ని తీవ్రంగా ఖండించారు. ఆ దాడుల్ని డొమస్టిక్ టెర్రరిజంగా అభివర్ణించారు. అమెరికా అటార్నీ జనరల్ పమీలా బోండీ కూడా ఈ దాడుల్ని తప్పుబట్టారు. దాడులపై విచారణ చేయిస్తామని, దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
Sunita Williams : సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన అనుకోని అతిథులు.. థ్రిల్లింగ్ వీడియో వైరల్..
Elon Musk: నా ఆఫర్‌ను తిరస్కరించారు.. సునీత రిటర్న్ జర్నీపై మస్క్ కీలక వ్యాఖ్యలు