విదేశాల్లోని జైళ్లలో 10,152 మంది భారతీయులు
ABN , Publish Date - Feb 08 , 2025 | 06:36 AM
విచారణలో ఉన్నవారితో సహా విదేశాల్లోని జైళ్లలో 10,152 మంది భారతీయ ఖైదీలు ఉన్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ శుక్రవారం లోక్‌సభకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. దేశాల వారీగా జైళ్లలో ఎంత మంది

లోక్‌సభకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: విచారణలో ఉన్నవారితో సహా విదేశాల్లోని జైళ్లలో 10,152 మంది భారతీయ ఖైదీలు ఉన్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ శుక్రవారం లోక్‌సభకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. దేశాల వారీగా జైళ్లలో ఎంత మంది భారతీయ ఖైదీలు ఉన్నారో వెల్లడించారు. సౌదీ అరేబియా, కువైత్, యూఏఈ, ఖతార్, నేపాల్, పాకిస్థాన్, అమెరికా, శ్రీలంక, స్పెయిన్, రష్యా, ఇజ్రాయెల్, చైనా, బంగ్లాదేశ్, అర్జెంటీనా సహా 86 దేశాల్లో వీరు ఉన్నారని తెలిపారు. సౌదీ అరేబియాలో 2,633 మంది, యూఏఈలో 2,518 మంది, నేపాల్‌లో 1,317 మంది, పాకిస్థాన్‌లో 266 మంది, శ్రీలంకలో 98 మంది భార తీయ ఖైదీలున్నారని పేర్కొన్నారు. ఖతార్ జైళ్లలో 611 మంది భారతీయ ఖైదీలున్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు, అమెరికా జారీ చేసే హెచ్-1బీ వీసా లబ్ధిదారుల్లో భారతీయులే ఎక్కువని కేంద్రం తెలిపింది. 2022 అక్టోబరు నుంచి 2023 సెప్టెంబరు మధ్య జారీ అయిన వీసాల్లో 72.3 శాతం వీసాలను భారత నిపుణులే దక్కించుకున్నారని కీర్తి వర్ధన్‌సింగ్ వెల్లడించారు. ఇటీవల వీసా తిరస్కరణలు పెరగడంపై ఆయన స్పందిస్తూ, విదేశీ ప్రభుత్వాల సార్వభౌమత్వానికి సంబంధించిన అంశాలపై బహిరంగంగా మాట్లాడబోమని స్పష్టం చేశారు. కాగా, అటవీ భూమిని అటవీయేతరాల కోసం మళ్లించినందుకు వినియోగ ఏజెన్సీల నుంచి పరిహార సుంకాలుగా ఇప్పటి వరకు రూ.94,843 కోట్లు వసూలు చేసినట్టు కీర్తి వర్ధన్ సింగ్ గురువారం రాజ్యసభకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఇందులో రూ.26,002.16 కోట్లను ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2019-20 నుంచి 2023-24) అడవుల పెంపకం, సంబంధిత కార్యకలాపాల కోసం వినియోగించినట్టు తెలిపారు.