Maha Kumbh Mela: కుంభమేళాకు 13 వేల రైళ్లు
ABN , Publish Date - Jan 06 , 2025 | 05:21 AM
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగనున్న జరుగనున్న మహా కుంభమేళాకు దేశవిదేశాల నుంచి 40 కోట్ల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు.
40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహణ
ప్రయాగరాజ్‌లో 18 వేల మంది ఆర్‌పీఎఫ్ సిబ్బంది మోహరింపు
మేళాకు బాంబు బెదిరింపు
బిహార్‌లో ఒకరి అరెస్టు
ప్రయాగరాజ్, జనవరి 5: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగనున్న జరుగనున్న మహా కుంభమేళాకు దేశవిదేశాల నుంచి 40 కోట్ల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. యాత్రికులు, భక్తులను చేరవేసేందుకు రైల్వే శాఖ పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. 50 రోజులపాటు 13 వేల రైళ్లు నడపాలని నిర్ణయించింది. వీటిలో పది వేలు రెగ్యులర్ సర్వీసులు కాగా.. మూడు వేలు ప్రత్యేక రైళ్లు. మేళా జరగడానికి 2-3 రోజుల ముందు.. ఆ తర్వాత 2-3 రోజుల వరకు రైళ్లు నడుస్తాయి. అలాగే పవిత్ర పుణ్యక్షేత్రాలను కలుపుతూ 560 రింగ్ రైళ్లు నడుపనుంది. ప్రయాగరాజ్-అయోధ్య-వారాణసీ-ప్రయాగ్‌రాజ్, ప్రయాగరాజ్-సంగమ్ ప్రయాగ్-జాన్‌పూర్-ప్రయాగ్-ప్రయాగరాజ్, గోవింద్‌పురి-ప్రయాగరాజ్-చిత్రకూట్-గోవింద్‌పురి, ఝాన్సీ-గోవింద్‌పురి-ప్రయాగరాజ్-మాణిక్‌పూర్-చిత్రకూట్-ఝాన్సీ మార్గాల్లో వీటిని నడుపుతారు. ప్రయాగరాజ్ ప్రాంతంలోని మొత్తం 9 రైల్వే స్టేషన్లలో 560 టికెట్ కౌంటర్లను కూడా రైల్వే ఏర్పాటుచేస్తోంది. భక్తులు లక్షలాదిగా తరలిరానున్న నేపథ్యంలో రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్), రాష్ట్ర రైల్వే పోలీసుకు చెందిన 18 వేల మందికిపైగా సిబ్బందిని మోహరిస్తున్నట్లు ఉత్తర మధ్య రైల్వే జీఎం ఉపేంద్ర వెల్లడించారు. ప్రయాణికులకు వైద్య సేవలు అందించడానికి ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, ఈసీజీ యంత్రాలతో ప్రయాగరాజ్ జంక్షన్‌లో అబ్జర్వేషన్ రూంను ఏర్పాటు చేశామన్నారు.
ఉగ్ర బెదిరింపు..
మహాకుంభమేళాకు ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది. ఉగ్ర దాడిచేస్తానని, వెయ్యి మందిని చంపుతానని సోషల్ మీడియాలో పోస్టుచేసిన ఆయు్‌షకుమార్ జైస్వాల్‌ను మహాకుంభ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడు విద్యార్థి. బిహార్‌లోని షాదీజంగ్ వాసి. ఇన్‌స్టాగ్రాంలో నాసిర్ పఠాన్ అనే నకిలీ పేరుతో ఈ బెదిరింపు పోస్టు పెట్టి నేపాల్ పారిపోయాడు. తన పక్కింటిలోని నాసిర్ పఠాన్‌ను ఇరికించేందుకే ఆయుష్ ఆ పేరుతో పోస్టు పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
మేళా జరిగేది వక్ఫ్ భూమిలో!
తమ వక్ఫ్ భూమిలో మహాకుంభమేళా జరగబోతోందని అఖిల భారత ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ తెలిపారు. వక్ఫ్ భూమిలో ఇంతటి ఉత్సవం నిర్వహించేందుకు అనుమతించి ముస్లింలు తమ విశాల హృదయాన్ని చాటుకున్నారని.. హిందువులు కూడా ఇచ్చిపుచ్చుకునే రీతిలో ఈ కార్యక్రమానికి తమను అనుమతించాలని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై హిందూ మహాసభ మండిపడింది. పాకిస్థాన్ ప్రేరిత మౌలానాను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. మహాకుంభ్‌ను ఆటంకపరచడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంది.
అణువిపత్తును ఎదుర్కొనేందుకు శిక్షణ
మహా కుంభమేళా సందర్భంగా రసాయన, అణు విపత్తులు చోటుచేసుకుంటే ఎదుర్కోవడానికి యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సిబ్బందిని అందుకు సన్నద్ధం చేసేందుకు గత శుక్రవారం ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. యూపీ విపత్తు నిర్వహణ అథారిటీ (యూపీఎ్‌సడీఎంఏ), కేంద్రప్రభుత్వం, అణుశక్తి విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అథారిటీ ఉపాధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ యోగేంద్ర డిమ్రీ ప్రారంభించారు. సంబంధిత సాధనాల ప్రదర్శనతో పాటు విపత్తు నిర్వహణలో కొత్త సాంకేతికతలు, రసాయన ప్రమాదాలపై సత్వర స్పందన, సురక్షిత సహాయ కార్యక్రమాలు, వైద్యసాయం మొదలైనవాటిపై వివిధ శాఖలకు చెందిన సుమారు 400 మందికి శిక్షణ ఇచ్చారు.