J and K IED Blast: జమ్మూకశ్మీర్‌లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు సైనికుల మృతి
ABN , Publish Date - Feb 11 , 2025 | 06:53 PM
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం మరోసారి తలెగరేసింది. ఎల్ఓసీ వెంబడి ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు సైనికులు మృతి చెందగా మరో సైనికుడు గాయాలపాలయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మిర్‌లో ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీ బాంబు పేలడంతో ఇద్దరు సైనికులు మృతి చెందగా మరో సైనికుడు గాయాలపాలయ్యారు. అఖనూర్ సెక్టర్‌లో మంగళవారం సైనికదళాలు సరిహద్దు వెంబడి గస్తీ నిర్వహిస్తుండగా మధ్యాహ్నం 3.30 సమయంలో ఈ బాంబు పేలినట్టు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. పేలుడుతో త్రీవ గాయాల పాలైన సైనికులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఓ కెప్టెన్, మరో సైనికుడు చికిత్స పొందుతూ మృతి చెందారు.
మరో సైనికుడిని చికిత్స నిమిత్తం గగన మార్గంలో ఆర్మీ ఆసుపత్రికి తరలించామని, అతడికి ప్రాణాపాయం తప్పిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరో వైపు ఘటన తరువాత సైన్యం ఆ ప్రాంతంలో అదనపు దళాలను మోహరించింది. ఎల్ఓసీ వెంబడి తనిఖీలను ముమ్మరం చేసింది. పేలుడు ఘటన గురించి జమ్మూలోని వైట్ నైట్ కోర్ యూనిట్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సైనికులకు వందనాలు అర్పిస్తున్నామని పేర్కొంది.
Narendra Modi: భారత్ ఇంధన పరివర్తన.. ప్రపంచ గేమ్ ఛేంజర్
కాగా, రెండు రోజుల క్రితం ఖేరీ సెక్టర్‌లో ఎల్‌ఓసీ వెంబడి ఉన్న అటవీ ప్రాంతంలో దాగున్న ఉగ్రవాదులు ఆర్మీ గస్తీ దళంపై కాల్పులకు తెగబడ్డారు. సరిహద్దు దాటి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆర్మీ ఎదురుపడటంతో వారు కాల్పులకు దిగారు. దీంతో, భారత సైనికులు కూడా ఎదురు దాడి చేశారు. ఆ తరువాత చొరబాట్ల నిలవరించే చర్యలను సైన్యం మరింత కట్టుదిట్టం చేసింది. గస్తీని తీవ్రతరం చేసింది.
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..