ఎక్కడ దాక్కున్నా పట్టిచ్చే ‘భారత్ పోల్’
ABN , Publish Date - Jan 08 , 2025 | 05:13 AM
మనదేశంలోని దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర పోలీసు విభాగాల మధ్య సమన్వయానికి కీలకంగా దోహదపడే ‘భారత్ పోల్’ పోర్టల్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు.
సీబీఐ రూపకల్పన..ఆవిష్కరించిన షా
న్యూఢిల్లీ, జనవరి 7: మనదేశంలోని దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర పోలీసు విభాగాల మధ్య సమన్వయానికి కీలకంగా దోహదపడే ‘భారత్ పోల్’ పోర్టల్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు. కేసుల విషయంలో అంతర్జాతీయంగా పనిచేస్తున్న మన దర్యాప్తు సంస్థల పనిని ఈ పోర్టల్ సులభతరం చేస్తుందని, ఇంటర్‌పోల్ సహకారం వేగంగా అందుకోగలుగుతామని ఆయన అన్నారు. ‘భారత్ పోల్’ను సీబీఐ రూపొందించింది. ‘‘అంతర్జాతీయ పోలీసుల సహకారం ఇప్పటిదాకా సీబీఐ మాత్రమే తీసుకుంటోంది. ‘భారత్ పోల్’ రాకతో మన దేశానికి చెందిన అన్నీ దర్యాప్తు సంస్థలూ, చివరకు రాష్ట్ర పోలీసు విభాగాలు సైతం ఇంటర్‌పోల్ సాయం తీసుకొనగలుగుతాయి. అంతర్జాతీయంగా మనదేశం చేపట్టే విచారణ ప్రక్రియను కొత్త శకంలోకి ఇది నడిపిస్తుంది. వేర్వేరు సంస్థల మధ్య సమన్వయం, సంబంధాల్లో తలెత్తుతున్న సమస్యలు తొలగించి..నేరగాళ్ల కట్టడికి బాగా పనిచేస్తుంది’’ అని అమిత్‌షా అన్నారు.