Bengaluru News: లక్కీ భాస్కర్ స్పూర్తితో భారీ మోసం.. కానీ చివరకు..
ABN , Publish Date - Mar 16 , 2025 | 04:36 PM
లక్కీ బాస్కర్ సినిమా స్పూర్తితో ఓ లేడీ బ్యాంకు మేనేజర్ మోసానికి పాల్పడింది. పక్కాప్లాన్‌తో పని ముగించింది. కానీ, సినిమా వేరు, జీవితం వేరు కాబట్టి.. పాపం పండి అడ్డంగా బుక్కయింది.

సత్యదేవ్ హీరోగా నటించిన జీబ్రా సినిమాలో హీరో, హీరోయిన్, హీరో ఫ్రెండ్ ముగ్గురు కలిసి కస్టమర్ల బ్యాంకు ఖాతాల్లోంచి తెలివిగా డబ్బు కొట్టేస్తారు. దొరికిపోయే అవకాశం ఉండటంతో ఆ డబ్బుని మళ్లీ కస్టమర్ల ఖాతాల్లోకి పంపించేస్తారు. నేరం బయటపడకుండా తప్పించుకుంటారు. లక్కీ బాస్కర్ సినిమాలో హీరో బ్యాంకులోంచి డబ్బులు కొట్టేసి, అక్రమ వ్యాపారాలు చేస్తుంటాడు. సమయానికి డబ్బుల్ని మళ్లీ బ్యాంకులో జమ చేస్తుంటాడు. సినిమా చివరి వరకు పోలీసులకు దొరకడు. అయితే, నిజ జీవితంలో మాత్రం ఓ బ్యాంకు ఉద్యోగి నేరం చేసి, పోలీసులకు పట్టుబడిపోయింది. ఓ ప్రముఖ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె ఓ వృద్ధ జంటను మోసం చేసింది. వారి దగ్గరినుంచి పక్కా ప్లాన్ ప్రకారం లక్షల రూపాయల డబ్బులు కొట్టేసింది. తర్వాత పాపం పండి దొరికిపోయింది. ఉద్యోగం పోవటమే కాదు.. జైలు పాలయ్యే పరిస్థితి వచ్చింది.
పక్కా ప్లాన్‌తో మోసం..
మేఘన అనే మహిళ బెంగళూరులోని ఓ ప్రముఖ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. గిరినగర్‌లో ఆ బ్యాంకు ఉంది. అదే ప్రాంతానికి చెందిన వృద్ధ జంటకు ఆ బ్యాంకులో జాయింట్ అకౌంట్‌తో పాటు, ఎఫ్‌డీ కూడా ఉంది. బ్యాంకు ఖాతా లావాదేవీలకు సంబంధించి మేఘన వృద్ధురాలికి సాయం చేస్తూ ఉండేది. ఆ వృద్ధురాలు తన కుటుంబానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని మేఘనకు చెబుతూ ఉండేది. చామరాజపేట్‌లోని తమ ఇళ్లు అమ్మబోతున్నట్లు, పెద్ద మొత్తంలో డబ్బు రాబోతున్నట్లు ఆ వృద్ధురాలు చెప్పింది. కొద్దిరోజుల తర్వాత వృద్ధురాలి బ్యాంకు అకౌంట్‌లో కోటి రూపాయలు డిపాజిట్ అయింది. ఆ డబ్బుపై మేఘన కన్నుపడింది. భర్త, స్నేహితులతో కలిసి ఆ డబ్బులో కొంత భాగం కొట్టేయాలని ప్లాన్ చేసింది. ఆ వృద్ధురాలు బ్యాంకుకు వెళ్లినపుడు.. బాండ్స్ ఎక్స్‌పేర్ అయిపోయాయని మేఘన చెప్పింది. కొత్త బాండ్లు కొనడానికి కొన్ని డాక్యుమెంట్లు కావాలని అంది. మరుసటి రోజు వృద్ధురాలి ఇంటికి వెళ్లి
వారి అకౌంట్‌లోని డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను తీసుకుంది. అవసరమైన చోట సంతకాలు పెట్టించుకుంది. ఆ తర్వాత 50 లక్షల రూపాయల్ని వేరే అకౌంట్‌కు పంపుకుంది. ఓ రోజు వృద్ధ దంపతులు అకౌంట్‌లో ఉన్న డబ్బులు చెక్ చేసుకున్నారు. 50 లక్షలు తక్కువగా ఉన్నాయి. ఆ డబ్బులు మొత్తం 13వ తేదీన వేరే అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయినట్లు తెలిసింది. దీంతో అనుమానం వచ్చిన వృద్ధురాలు బ్యాంకుకు వెళ్లింది. మేఘనను నిలదీసింది. ‘మీరు చెప్పినట్లే డబ్బులు వేరే వాళ్లకు ట్రాన్స్‌ఫర్ చేశా’అంటూ బుకాయించింది. మోసపోయామని గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేఘనను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. విలాసాలకు అలవాటు పడ్డ ఆమె ఇలా మోసానికి పాల్పడ్డట్టు తేలింది. లక్కీ బాస్కర్ సినిమా స్పూర్తితో డబ్బు కొట్టేసినట్లు మేఘన చెప్పింది. తనకు డబ్బు కొట్టేసే ఉద్దేశం లేదని,వ్యాపారంలో డబ్బులు పెట్టి, మళ్లీ తిరిగి ఇచ్చేదామనుకున్నానని చెప్పింది. పోలీసులు ఆ మొత్తం డబ్బును సీజ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Arjun Reddy: గ్రూప్-3 టాపర్లూ పురుషులే..
నాగారంలోని ఆ 50 ఎకరాలు భూదాన్ భూములు కావు
కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై.. తుది దశకు సాధ్యాసాధ్యాల అధ్యయనం
Read Latest Telangana News and National News