Nitin Gadkari : రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స
ABN , Publish Date - Jan 09 , 2025 | 05:28 AM
రోడ్డు ప్రమాద బాధితులకు నగదురహిత చికిత్స పథకం ఇక దేశమంతా అమలవుతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాల్లో పైలట్
వారం పాటు రూ.1.5 లక్షల వరకు
చికిత్స ఖర్చును కేంద్రం భరిస్తుంది : గడ్కరీ వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 8: రోడ్డు ప్రమాద బాధితులకు నగదురహిత చికిత్స పథకం ఇక దేశమంతా అమలవుతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన ఈపథకాన్ని అన్ని రాష్ట్రాలకూ విస్తరించనున్నామని చెప్పారు. ఏడు రోజుల పాటు రూ.లక్షన్నర వరకు చికిత్స ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ఆస్పత్రిలో చేరి, ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు పోలీసులకు సమాచారంఅందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘హిట్ అండ్ రన్’ (గుర్తుతెలియని వాహనాలు ఢీకొన్న) కేసుల్లో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నష్ట పరిహారం ఇస్తామని గడ్కరీ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాతాల రవాణా శాఖ మంత్రులు, కార్యదర్శులతో సమావేశం అనంతరం నగదురహిత చికిత్స పథకాన్ని ప్రకటించారు. గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో లక్షా 80 వేల మంది చనిపోయారని చెప్పారు. ఇందులో 30 వేల మంది హెల్మెట్లు ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారన్నారు. 66 శాతం ప్రమాదాల్లో బాధితులు 18 నుంచి 34 ఏళ్లలోపు వయస్కులని వివరించారు. విద్యా సంస్థల లోపలికి వెళ్లే, బయటికొచ్చే ప్రదేశాల వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల జరిగిన ప్రమాదాల్లో 10 వేల మంది పిల్లలు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ బస్సులు, ఆటోల ప్రమాదాలకు కారణాలను గుర్తించామని, వాటిని నివారించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్డు భద్రత అంశంపై రాష్ట్రాల మంత్రులు, కార్యదర్శులతో చర్చించామన్నారు. భారీ వాహనాలకు ఎలకా్ట్రనిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, డ్రైవర్ కునికిపాట్లు పడుతుంటే హెచ్చరిచే వ్యవస్థ వంటివాటిని తప్పనిసరి చేస్తామని తెలిపారు. కాగా, రోడ్డు భద్రతను పెంపొందించేందుకు కేంద్రం రూ.4,500 కోట్లతో దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు, ఆటోమేటెడ్ టెస్టింగ్ క్లస్లర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.