Share News

రైతులకు కేంద్రం శుభవార్త

ABN , Publish Date - Jan 02 , 2025 | 05:28 AM

కొత్త ఏడాదిలో రైతులకు కేంద్రప్రభుత్వం శుభవార్త తెలిపింది. పంటల బీమా పథకాలైన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎ్‌ఫబీవై),

రైతులకు కేంద్రం శుభవార్త

పంటల బీమా పథకాలకు కేటాయింపులు పెంపు

పీఎంఎ్‌ఫబీవై, ఆర్‌డబ్ల్యూబీసీఐ పథకాల కొనసాగింపు

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

డీఏపీపై వన్‌టైమ్‌ స్పెషల్‌ ప్యాకేజీ పొడిగింపునకు ఓకే

కొత్త ఏడాది మా తొలి భేటీ రైతు శ్రేయస్సుకు అంకితం

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మోదీ

న్యూఢిల్లీ, జనవరి 1(ఆంధ్రజ్యోతి): కొత్త ఏడాదిలో రైతులకు కేంద్రప్రభుత్వం శుభవార్త తెలిపింది. పంటల బీమా పథకాలైన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎ్‌ఫబీవై), పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా(ఆర్‌డబ్ల్యూబీసీఐ) పథకాలను 2025-26 వరకూ కొనసాగించడంతో పాటు వాటి కేటాయింపులను పెంచాలని నిర్ణయించింది. ఈ రెండు పథకాలనూ కొనసాగించే ప్రతిపాదనకు బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పథకాలకు 2020-21 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు రూ.66,550 కోట్లు కేటాయించగా.. దాన్ని 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాలకుగాను రూ.69,515.71 కోట్లకు పెంచింది. కేంద్రం నిర్ణయంతో 2026 వరకూ రైతులకు మేలు జరగనుంది. అలాగే, బీమా పథకాల అమలులో భారీ మొత్తంలో సాంకేతికతను వినియోగించేందుకు రూ.824.77 కోట్లతో ఫండ్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ(ఫియట్‌) ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ టెక్నాలజీ పంట నష్టం అంచనాలను త్వరితగతిన తెలుసుకోవడంతో పాటు, క్లెయిం సెటిల్‌మెంట్‌, వివాదాలను తగ్గించేందుకు దోహదపడనుంది. అలాగే.. రైతులకు డై అమ్మోనియం ఫాస్పేట్‌(డీఏపీ)పై సబ్సిడీకి అదనంగా ఇస్తున్న వన్‌ టైం స్పెషల్‌ ప్యాకేజీని పొడిగించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. డీఏపీ మెట్రిక్‌ టన్నుకు స్పెషల్‌ ప్యాకేజీ కింద రూ.3,500 ఇవ్వాలని.. దీన్ని జనవరి ఒకటో తేదీ నుంచి తదుపరి ఉత్తర్వుల వరకూ పొడిగించాలని కేంద్ర ఎరువుల శాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. రైతులకు డీఏపీని నిరంతరం తక్కువ ధరలో అందుబాటులో ఉంచడానికి మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2024 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు 31 వరకు వర్తించేలా.. డీఏపీపై సబ్సిడీకి అదనంగా రూ.2,625 కోట్లతో వన్‌ టైం స్పెషల్‌ ప్యాకేజీకి క్యాబినెట్‌ గత జూలైలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కేంద్రం తాజా నిర్ణయంతో 50 కిలోల డీఏపీ బస్తా రూ.1,350కి రైతులకు అందుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ ప్యాకేజీకి రూ.3,850 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: మోదీ

రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టేందుకు కష్టపడి పనిచేస్తున్న రైతులను చూసి గర్విస్తున్నట్లు తెలిపారు. 2025లో జరిగిన మొదటి క్యాబినెట్‌ భేటీని రైతుల శ్రేయస్సు కోసం అంకితం చేసినట్లు పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఈ భేటీలో కీలకనిర్ణయాలు తీసుకున్నదుకు సంతోషంగా ఉందన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 05:28 AM