Cyber Scam: పిల్లలు లేని మహిళల్ని గర్భవతులను చేయండి రూ.10 లక్షలు తీసుకోండి!
ABN , Publish Date - Jan 12 , 2025 | 05:53 AM
పిల్లలు లేని మహిళల్ని గర్భవతులను చేయండి... రూ. 10 లక్షలు తీసుకోండి...
బిహార్‌లో వినూత్న మోసం.. ముగ్గురి అరెస్టు
పట్నా, జనవరి 11: పిల్లలు లేని మహిళల్ని గర్భవతులను చేయండి... రూ. 10 లక్షలు తీసుకోండి... ఇది బిహార్‌లో సైబర్ మోసగాళ్లు పన్నిన కొత్త వల! ఈ వలలో పడ్డవారిని రిజిస్ట్రేషన్ పేరిట వారి పాన్‌కార్డు, ఆధార్ కార్డు, ఫొటో అడిగి అవి ఇచ్చాక... రిజిస్ట్రేషన్, హోటల్ బుకింగ్‌కు డబ్బు ఇవ్వాలని గుంజుతున్నారు. అయితే బిహార్ పోలీసులు దీన్ని గుర్తించి ముగ్గుర్ని అరెస్టు చేయడంతో వారి మోసాలకి అడ్డుకట్ట పడింది. బిహార్‌లోని నవాడా జిల్లా నార్డిగంజ్ సబ్‌డివిజన్ కహురా గ్రామంలో ఈ మోసం చోటు చేసుకుంది. సైబర్ మోసగాళ్లు ‘‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్’’ అని పేరు పెట్టి మరీ ఈ మోసానికి తెర తీశారు. ఇందులో చిక్కిన వారిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు గుంజుతున్నారని బిహార్ పోలీసులు వెల్లడించారు. ఒకవేళ మహిళల్ని గర్భిణులను చేయలేకపోయినా రూ. 50,000 నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తామని ఎర వేయడం విశేషం. వీరు ‘‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీ్‌స’’తోపాటు ‘‘ప్లేబాయ్ సర్వీ్‌స’’కూ తెర తీయడం గమనార్హం. ఈ మోసగాళ్లు ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇవ్వడంతో వాటికి ఆకర్షితులై ఫోన్ చేసిన వారి నుంచి రిజిస్ట్రేషన్, హోటల్ బుకింగ్ పేరిట డబ్బు గుంజుతున్నారని డీఎస్పీ ఇమ్రాన్ పర్వేజ్ తెలిపారు. ఈ కేసులో ప్రిన్స్ రాజ్, భోలా కుమార్, రాహుల్ కుమార్ అనేవారిని అరెస్టు చేశారు. 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో వారు సాగించిన వాట్సాప్ చాట్‌లు, ఖాతాదారుల ఫొటోలు, ఆడియో రికార్డింగులు, బ్యాంకు లావాదేవీల వివరాలు తెలుసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.