Marital Murders Rise: వివాహ బంధంపై కత్తి
ABN , Publish Date - Apr 01 , 2025 | 04:36 AM
భారతదేశంలో ప్రతి సంవత్సరం 275 మంది భర్తలు, 225 మంది భార్యలు వివాహ బంధంలో భాగస్వాముల చేతిలో హతమవుతుండగా, ఐక్యరాజ్య సమితి దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల పెరిగిన వివాహేతర సంబంధాలు, క్షణికావేశంలో హత్యలు కలవరం కలిగిస్తున్నాయి

వివాహేతర సంబంధాలు, క్షణికావేశంలో జీవిత భాగస్వాముల హత్యలు
ఇలా భారత్‌లో ఏటా 275 మంది భర్తలు, 225 మంది భార్యల మరణాలు
ఐక్యరాజ్య సమితి అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 31: భార్యాభర్తల మధ్య జగడాలు, గిల్లికజ్జాలు మామూలే. టీవీలో ప్రోగ్రామ్ చూడటం దగ్గర నుంచి రిమోట్ కంట్రోల్, మొబైల్ ఫోన్, సోషల్ మీడియా వరకు.. చిన్న పెద్ద విషయాలకు దంపతులు గొడవ పడుతూనే ఉంటాయి. కానీ, భార్యభర్తల మధ్య పొరపొచ్చాలు ఇటీవలికాలంలో అత్యంత అపాయకర వైషమ్యాలుగా రూపుదాల్చి.. చివరకు హత్యలకు సైతం దారితీస్తున్న తీరు తీవ్ర కలవరం కలిగిస్తోంది. వివాహ బంధం గతంలో ఎన్నడూ లేనంతగా నెత్తురోడటం ఈ రోజున ప్రపంచవ్యాప్త ధోరణిగా మారింది. అదీ అత్యంత దారుణంగా, క్రూరమైన పద్ధతుల్లో ఈ హత్యలు జరుగుతున్నాయి. ఈ ధోరణుల పట్ల ఐక్యరాజ్యసమితి సైతం ఆందోళన వెలిబుచ్చింది. భారతదేశంలో ఏటా 275 మంది భర్తలు, 225 మంది భార్యలు వేర్వేరు ఘటనల్లో జీవిత భాగస్వాముల చేతుల్లో హతమవుతున్నారని ఐరాస అధ్యయనం తేల్చింది. ప్రస్తుతం మన దేశ జనాభా 140 కోట్లు. ఇంత జనాభా ఉన్న చోట ఎన్నెన్నో నేరాలు జరుగుతుంటాయి. అందులో కొన్ని ఘటనలు ప్రత్యేకంగా ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకొంటాయి.
ఈ జాబితాలో భార్యాభర్తల పరస్పర హత్యాకాండలు చేరడం భయాందోళనలకు గురి చేస్తున్నదని ఐరాస వ్యాఖ్యానించింది. ఐరాస నివేదికను అనుసరించి.. 2023లో ప్రపంచవ్యాప్తంగా యాభై వేలమంది మహిళలు, ఆడపిల్లలు కడతేరారు. ఇందులో 60% కేసుల్లో వారిని భర్తలు, సహచరులు లేక కుటుంబసభ్యులే హతమార్చారు. సహ భాగస్వామిని చంపిన తర్వాత మృతదేహాలను డ్రమ్ముల్లోనూ, ఫ్రిజ్‌ల్లోనూ, సూట్‌కేసుల్లోనూ, భూమి అడుగున, మంచం కింద దాచేస్తున్నారు. చాలా సందర్భాల్లో అవశేషాలను మాయం చేయడానికి మృతదేహాన్ని ముక్కలు చేసి ప్రెషర్ కుక్కర్‌లో ఉడికిస్తున్నారు. కత్తించిన శరీర భాగాలను సూట్‌కేసుల్లో సర్ది మారుమూల, నిర్మానుష్య ప్రదేశాల్లోనూ, నీటి కుంటల్లోనూ పడేస్తున్నారు. దీంతో మీడియా ఇటువంటి ఘటనలను రిపోర్టు చేయడం ఒక సవాల్‌గా మారిందని ఐరాస అధ్యయనం తెలిపింది. ఇటీవలి నేరాల నుంచి ఇటువంటి ఉదాహరణలు కొన్ని ప్రస్తావించింది. తాను ప్రేమించిన అనురాగ్ అనే వ్యక్తి కోసం, తాను పెళ్లాడిన దిలీప్‌ను ప్రగతి అనే యువతి చంపించింది. వారి పెళ్లి జరిగిన 15 రోజులకే ఈ హత్య జరిగింది. వివాహానంతర హిందూ క్రతువులో భాగంగా తనకు లభించిన నగదును సుపారీగా ఇచ్చి ప్రగతి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసును ఐరాస తన అధ్యయనంలో ప్రస్తావించింది.
ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ బలి
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మహిళల, ఆడపిల్లల హత్యల గురించి ఐక్యరాజ్యసమితి అనుబంధ డ్రగ్స్ అండ్ క్రైమ్ విభాగం ఒక అధ్యయనం జరిపింది. ఇందులో దిగ్ర్భాంతికర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతున్నట్టు గుర్తించింది. సగటున రోజుకు 140 మంది యువతులు, ఆడపిల్లలు ఇలా తమ గృహాల్లో కడతేరుతున్నారు. ఇవి 2023 లెక్కలు. 2022లో ఇటువంటి కేసులు ఆఫ్రికాలో అధికంగా నమోదయ్యాయి. అయితే, ఏడాది తిరిగేటప్పటికి ఆఫ్రికాను ఆసియా రెండోస్థానానికి నెట్టివేయడం గమనార్హం. 58 శాతం హత్యా ఘటనలు వివాహ బంధంతో ముడిపడి ఉండగా, అందులో 42 శాతం ఘటనల్లో పురుషులే బాధితులుగా ఉన్నారు. స్ర్తీల విషయంలో కనిపించే లింగ వివక్ష కోణం భారత్‌లో జరుగుతున్న నేరాల్లో పెద్దగా కనిపించడం లేదని ఐరాస వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి..
For National News And Telugu News