Share News

Loans: రాష్ట్రాలకు మూలధన వ్యయ రుణాలు

ABN , Publish Date - Jan 04 , 2025 | 04:49 AM

కీలకమైన మూలధన వ్యయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడ్డాయని కేంద్రం గుర్తించింది.

Loans: రాష్ట్రాలకు మూలధన వ్యయ రుణాలు

న్యూఢిల్లీ, జనవరి 3(ఆంధ్రజ్యోతి): కీలకమైన మూలధన వ్యయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడ్డాయని కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ మొత్తంలో మూలధన వ్యయ రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ రుణాలన్నీ వడ్డీ లేనివే కావడం గమనార్హం. మొత్తంగా రూ.1.5 లక్షల కోట్లను ఎలాంటి వడ్డీ లేకుండా మంజూరు చేయనుంది. దీనిలో రూ.95 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే సంస్కరణల ఆధారంగా ఇస్తారు. మరో రూ.35 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులకు కేటాయిస్తారని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. కాగా, షరతులతో కూడిన మూలధన వ్యయ రుణాలకు కూడా కేంద్రం నిబంధనలను సడలించింది. 10 శాతం కంటే మించి మూల ధన వ్యయాన్ని చేసిన రాష్ట్రాలకు గతంలో రూ.25 వేల కోట్ల మేరకు నిధుల కేటాయింపు జరుగుతుండగా ఇప్పుడు 10 శాతం ఖర్చు పెట్టిన రాష్ట్రాలకు కూడా ఈ నిధులు కేటాయిస్తారు. పట్టణ ప్రణాళికలను అమలు చేసిన రాష్ట్రాలకు మరో రూ.5 వేల కోట్లను కేటాయించనుంది. ప్రకృతి విపత్తులకు గురైన రాష్ట్రాలకు అదనపు నిధులను కేటాయించాలని నిర్ణయించింది.

Updated Date - Jan 04 , 2025 | 04:49 AM