NAVIC 2.0 : నావిక్‌కు సరికొత్త కిక్!
ABN , Publish Date - Jan 27 , 2025 | 04:53 AM
ఇస్రో ఈ నెల 29న రెండో తరం నావిక్02 (ఎన్‌వీఎస్02) ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతోంది. జీఎ్‌సఎల్వీ-ఎఫ్15 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్‌ను జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటీవో)లోకి పంపనుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో ఇప్పటి

పౌర, సైనిక సేవలు మరింత మెరుగు.. 29న ఎన్‌వీఎస్-02 ఉపగ్రహ ప్రయోగం
షార్‌లో వందో ప్రయోగానికి ఇస్రో సిద్ధం
జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా నావిక్..!
సూళ్లూరుపేట, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ఇస్రో ఈ నెల 29న రెండో తరం నావిక్02 (ఎన్‌వీఎస్02) ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతోంది. జీఎ్‌సఎల్వీ-ఎఫ్15 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్‌ను జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటీవో)లోకి పంపనుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో ఇప్పటి వరకూ 99 ప్రయోగాలు చేపట్టిన ఇస్రోకిది వందో ప్రయోగం కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ జీఎ్‌సఎల్వీ-ఎ్‌ఫ15/ఎన్‌వీఎస్-02 మిషన్ లక్ష్యం. రెండేళ్ల కిత్రం ఎన్‌వీఎస్-01 ప్రయోగాన్ని చేపట్టగా.. మరింత మెరుగైన సేవలందించేలా ఎన్‌వీఎ్‌స-02ను ప్రయోగిస్తున్నారు. అమెరికా జీపీఎస్ తరహాలోనే భారత్‌కు చెందిన నావిక్‌ను పౌర, సైనిక అవసరాల కోసం రూపొందించారు. నావిగేషన్, వ్యవసాయం, అత్యవసర సేవలు, విమానాల నిర్వహణ, మొబైల్ లొకేషన్ ఆధారిత సేవలను ఇది మెరుగుపరుస్తుంది. ఎన్‌వీఎస్-02 భారత్‌తోపాటు దాని పరిసర ప్రాంతాల్లో కచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని అందిస్తుంది. జీపీఎ్‌సకు ప్రత్యామ్నాయంగా దీన్ని అందుబాటులోకి తీసుకురావడం భారత్ లక్ష్యం. ఇక జీఎ్‌సఎల్వీ-ఎఫ్15 అనేది జీఎ్‌సఎల్వీ సిరీ్‌సలో 17వ ప్రయోగం. దేశీయంగా అభివృద్ధి చేసిన క్రయోజనిక్ ఇంజన్‌ను ఉపయోగించి చేపట్టే 8వ ప్రయోగం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాలుగు గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థలు మాత్రమే ఉన్నాయి. వాటిలో అమెరికాకు చెందిన జీపీఎస్, రష్యాకు చెందిన గ్లోనాస్, యూరోపియన్ యూనియన్‌కు చెందిన గలీలియో, చైనాకు చెందిన బీడౌ అనే నాలుగు మాత్రమే గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థలు. భారత్‌కు చెందిన నావిక్, జపాన్ క్యూజెడ్‌ఎ్‌సఎస్ ప్రస్తుతానికి ప్రాంతీయ వ్యవస్థలే అయినప్పటికీ.. భవిష్యత్తులో గ్లోబల్ వ్యవస్థలుగా మారే అవకాశం ఉంది.
ప్రయోగ వేదికపైకి జీఎ్‌సఎల్వీ-ఎఫ్15
శ్రీహరికోటలో వందో రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇక్కడి సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 29న ఉదయం 6:23 గంటలకు ప్రయోగించనున్న జీఎ్‌సఎల్వీ-ఎఫ్15 రాకెట్ ఆదివారం రెండో ప్రయోగ వేదికపైకి చేరుకుంది. మూడు దశల అనుసంధాన పనులు పూర్తిచేసిన శాస్త్రవేత్తలు రాకెట్ శిఖరభాగాన ఉపగ్రహాన్ని అమర్చి.. రెండో ప్రయోగ వేదికపై తుది పరీక్షలు నిర్వహించారు. ప్రయోగానికి ముందు నిర్వహించే రిహార్సల్‌ను కూడా ఆదివారం పూర్తి చేశారు. శ్రీహరికోటలో ఇస్రోకు ఇది వందో ప్రయోగం కావడంతోపాటు ఈ ఏడాది షార్ నుంచి మొదటి ప్రయోగం కావడం విశేషం.
త్వరలోనే మూడో లాంచ్ ప్యాడ్ పనులు ప్రారంభం
శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌లో మూడో లాంచ్ ప్యాడ్‌తో పాటు తమిళనాడులోని కులశేఖరపట్నంలో మరో లాంచ్ ప్యాడ్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ తెలిపారు. ఆదివారం ఆయన షార్‌లోని భాస్కర అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. పనులు ప్రారంభించాక నాలుగేళ్లలో నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. మూడో ప్రయోగ వేదిక నుంచి 20-25 టన్నుల బరువు గల రాకెట్ ప్రయోగాలు చేపట్టవచ్చన్నారు. రెండో లాంచ్ ప్యాడ్‌ను అనుసంధానం చేస్తూ అధునాతన వసతులతో మూడో ప్రయోగ వేదిక ఉంటుందన్నారు. ఈ ఏడాది మరిన్ని ప్రయోగాలు ఉంటాయన్నారు. గగనయాన్ ప్రయోగ ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయన్నారు. అంతరిక్షంలో నిర్మించబోయే భారత స్పేస్ స్టేషన్‌కు మరో రెండు డాకింగ్ ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు.