తల్లిని, నలుగురు చెల్లెళ్లను చంపేశాడు
ABN , Publish Date - Jan 02 , 2025 | 05:23 AM
తల్లిని, నలుగురు చెల్లెళ్లను గొంతు, మణికట్టు కోసి దారుణంగా చంపాడు ఓ ఉన్మాది. ఇదంతా వారిని ‘రక్షించేందుకే!’ నంటూ ఓ వీడియో కూడా విడుదల చేశాడు.
గొంతు, మణికట్టు కోసి హత్యలు
యూపీలోని లక్నోలో ఘటన
హత్యల తర్వాత హంతకుడి వీడియో
స్థానిక భూమాఫియా ఆగ్రాలోని
మా ఇంటిని ఆక్రమించుకుంది
నా చెల్లెళ్లను హైదరాబాద్‌లో అమ్మే కుట్ర
మేం హిందూ మతంలోకి మారాలనుకున్నాం
వీడియోలో వ్యాఖ్యలు.. అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు
లక్నో, జనవరి 1: తల్లిని, నలుగురు చెల్లెళ్లను గొంతు, మణికట్టు కోసి దారుణంగా చంపాడు ఓ ఉన్మాది. ఇదంతా వారిని ‘రక్షించేందుకే!’ నంటూ ఓ వీడియో కూడా విడుదల చేశాడు. తమ ఇరుగుపొరుగువారు తమ ఇంటిని, స్థలాన్ని ఆక్రమించుకున్నారని, తన చెల్లెళ్లు నలుగురినీ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి అమ్మేద్దామని చూస్తున్నారని.. దీనిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, అందుకే ఈ హత్యలు చేశానని ఆ వీడియోలో సమర్థించుకున్నాడు. దిగ్ర్భాంతికరమైన ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో బుధవారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు 24 ఏళ్ల మహమ్మద్ అర్షద్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. జరిగిన ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. అర్షద్ కుటుంబం యూపీలోని ఆగ్రాలో నివసిస్తోంది. తల్లి అస్మా. నలుగురు చెల్లెళ్లు అల్షియా (19), రహ్మీన్ (18), అక్సా (16), ఆలియా (9). వీరి తండ్రికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ఇటీవల వీరందరూ అజ్మీర్‌కు వెళ్లారు. అక్కడి నుంచి సోమవారం లక్నో చేరుకొని స్థానికంగా ఉన్న షరన్‌జీత్ అనే హోటల్‌లో దిగారు. మంగళవారం రాత్రి అర్షద్ విషం కలిపిన ఆహారం తీసుకొచ్చి తల్లి, చెల్లెళ్లకు అందజేశాడు. వారు అది తిన్న తర్వాత ఒక్కక్కరిని చంపాడు. కొందరిని చున్నీతో గొంతు నులిమి చంపగా, మరికొందరిని మణికట్టు వద్ద బ్లేడుతో కోసి చంపాడు. చంపేటప్పుడు అరవకుండా నోట్లో గుడ్డలు పెట్టి అదిమాడు. ఈ దారుణ హత్యల అనంతరం తండ్రిని రైల్వేస్టేషన్ వద్దకు తీసుకెళ్లి అక్కడ వదిలేశాడు. తాను పోలీసుల వద్దకు వెళ్లి చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో ఈ దారుణం బయటపడింది.
మిస్టరీగా మారిన వీడియో!
తల్లి, చెల్లెళ్లను చంపిన అనంతరం అర్షద్.. హోటల్ గదిలోనే ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో విడుదల చేశాడు. వైరల్‌గా మారిన ఆ వీడియోలో.. తమ కుటుంబానికి కొందరు అన్యాయం చేశారని తెలిపాడు. ఆగ్రాలో తాము నివసించే ఇంటిని ఇరుగుపొరుగువాళ్లు బలవంతంగా లాగేసుకున్నారని, పదిరోజులుగా తమ కుటుంబం మొత్తం చలిలో ఫుట్‌పాత్‌పైనే తలదాచుకుంటుందని పేర్కొన్నాడు. రాణు అలియాస్ అఫ్తాబ్, అలీమ్‌ఖాన్, సలీం, అహ్మద్ రాణు, ఆరిఫ్, అజహర్ అనే వ్యక్తులు తమకు అన్యాయం చేశారని, వీరందరూ కలిసి ఓ భూఆక్రమణ మాఫియాను నడుపుతున్నారని, అమ్మాయిల అక్రమ రవాణాకు కూడా వీరు పాల్పడుతుంటారని ఆరోపించాడు. ‘అమ్మాయిలను సరఫరా చేసే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి నా నలుగురు చెల్లెళ్లను అమ్మేద్దామని వీరు కుట్ర పన్నారు. నా మీద తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపాలని చూశారు. మా స్వస్థలం యూపీలోని బదౌన్. మమ్మల్ని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తులుగా ముద్ర వేసి దుష్ప్రచారం చేశారు. వీరి ఆగడాలు భరించలేక మేం హిందూమతంలోకి మారాలనుకున్నాం. మా ఇల్లును ఆక్రమించుకున్నారు. మిగిలిన స్థలంలో ఒక ఆలయాన్ని కట్టి ప్రశాంతంగా బతకాలనుకున్నాం. పూజలు కూడా చేయటం ప్రారంభించాం’ అని అర్షద్ వెల్లడించాడు. తమ మీద జరుగుతున్న వేధింపులపైన ఎంతమందికి చెప్పినా కూడా తమకు సహాయం లభించలేదన్నాడు.
తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి మరోదారి లేకే తాము అందరమూ చనిపోవాలని నిర్ణయించుకున్నామని, తన కుటుంబసభ్యులను మణికట్టు, గొంతు కోసి తానే చంపానని, తాను కూడా ఇంకొద్దిసేపట్లో చనిపోతానని తెలిపాడు. రాత్రి 2 గంటలకు ఈ వీడియో చేస్తున్నానంటూ, దుప్పట్లతో కప్పి ఉన్న తన వారి మృతదేహాలను కూడా ఈ వీడియోలో అర్షద్ రికార్డు చేశాడు. వీడియో చివరలో ప్రధాని మోదీకి, యూపీ సీఎం యోగికి ఓ విజ్ఞప్తి చేశాడు. ‘దేశంలోని ముస్లింలందరూ ఒకే రకమైన వాళ్లు కాదు. మేం చనిపోయిన తర్వాతనైనా మాకు న్యాయం చేయండి. యోగీ జీ మీరు గొప్పగా పని చేస్తున్నారు. ఇటువంటి ముస్లింలను వదిలిపెట్టొద్దు. వారు భూఆక్రమణ, నకిలీ కరెన్సీ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు’ అని అర్షద్ పేర్కొన్నాడు. ఆక్రమణకు గురైన తమ ఇంటిని ఆలయంగా మార్చాలని, తమకు సంబంధించిన వాటిని, తన చెల్లెళ్లు సేకరించుకున్న వస్తువులను అనాథ శరణాలయానికి అందజేయాలని కోరాడు.