2,331 మంది నైజీరియన్ల దేశ బహిష్కరణ
ABN , Publish Date - Jan 02 , 2025 | 05:37 AM
గత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి బహిష్కరణకు గురైన విదేశీయుల్లో అత్యధికులు నైజీరియన్లేనని కేంద్ర హోంశాఖ వార్షిక నివేదిక తెలిపింది.
న్యూఢిల్లీ, జనవరి 1: గత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి బహిష్కరణకు గురైన విదేశీయుల్లో అత్యధికులు నైజీరియన్లేనని కేంద్ర హోంశాఖ వార్షిక నివేదిక తెలిపింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకూ మొత్తం 2,331 మందిని భారత్ నుంచి బహిష్కరించగా వీరిలో నైజీరియన్లు 1,471 మంది ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో బంగ్లాదేశీయులు 411 మంది, ఉగాండాకు చెందినవారు 78 మంది ఉన్నారు. ఇదే సమయానికి 98,40,321 మంది విదేశీయులు భారత్‌లో పర్యటించారు. వీరిలో బంగ్లాదేశీయులు 21 లక్షల మంది ఉండగా అమెరికా నుంచి 17 లక్షల మంది, యూకే నుంచి 9 లక్షల మంది సందర్శించారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా అస్ర్టేలియా, కెనడా, శ్రీలంక, మలేసియా, జర్మనీ, నేపాల్, సింగపూర్ ఉన్నాయి. అలాగే గతేడాది పాకిస్థాన్‌కు చెందిన 1,112 మందికి లాంగ్ టర్మ్ వీసా (ఎస్‌టీవీ) మంజూరు చేసినట్లు ఆ నివేదికలో హోంశాఖ పేర్కొంది.