Share News

HMPV: హెచ్‌ఎంపీవీ కలకలం

ABN , Publish Date - Jan 07 , 2025 | 04:55 AM

కొద్దిరోజులుగా చైనాను కలవరపెడుతున్న ‘హ్యూమన్‌ మెటాన్యూమోవైరస్‌ (హెచ్‌ఎంపీవీ)’.. మన దేశంలోకీ అడుగుపెట్టింది.

HMPV: హెచ్‌ఎంపీవీ కలకలం

భారత్‌లో ఐదు కేసులు

బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్‌ నగరాల్లో

వైరస్‌ బారిన పడ్డ ఐదుగురు శిశువులు

అందరూ నెలల వయసు చిన్నారులే!

భయపడొద్దు.. ఎలాంటి పరిస్థితినైనా

ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం: కేంద్రం

పాత వైరస్సే.. ఆందోళన అక్కర్లేదు: వైద్యులు

ప్రతి ఆస్పత్రిలో 20 పడకలు.. సీఎం ఆదేశం

బెంగళూరు, చెన్నై, అమరావతి, హైదరాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కొద్దిరోజులుగా చైనాను కలవరపెడుతున్న ‘హ్యూమన్‌ మెటాన్యూమోవైరస్‌ (హెచ్‌ఎంపీవీ)’.. మన దేశంలోకీ అడుగుపెట్టింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులు.. గుజరాత్‌లో ఒక శిశువు, చెన్నైలో మరో ఇద్దరు చిన్నారులు ఈ వైరస్‌ బారిన పడినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ప్రకటించింది. బెంగళూరులో.. బ్రాంకోన్యుమోనియాతో బాధపడుతున్న మూడు నెలల పాపను ఆస్పత్రిలో చేర్చగా, వైద్య పరీక్షల్లో హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌ వచ్చింది. అయితే, ఆ పాపకు చికిత్స చేసి, డిశ్చార్జి కూడా చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే ఆస్పత్రిలో.. అదే సమస్యతో బాధపడుతున్న ఎనిమిది నెలల వయసున్న బాబుకు కూడా హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌ వచ్చింది. ఆ బాబుకు చికిత్స చేస్తున్నామని.. ప్రస్తుతం కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. అలాగే.. రాజస్థాన్‌లోని దుంగార్పూర్‌కు చెందిన రెండు నెలల వయసున్న బాబు శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు ఆ శిశువును అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. డిసెంబరు 26న ఆ బాలుడికి హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌ వచ్చింది. తొలుత ఆ చిన్నారికి వెంటిలేటర్‌ చికిత్స అవసరమైందని.. ఇప్పుడతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఈ వైరస్‌ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదని.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఐసీఎంఆర్‌తోపాటు, ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌ నెట్‌వర్క్‌ వద్ద ఉన్న తాజా సమాచారం ప్రకారం.. దేశంలో ఫ్లూ తరహా కేసులు, తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల సంఖ్య అసాధారణ స్థాయిలో ఏమీ పెరగలేదని స్పష్టం చేసింది. అయినా, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. సంవత్సరం పొడుగునా హెచ్‌ఎంపీవీ వ్యాప్తి తీరును ఐసీఎంఆర్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ పరిశీలిస్తూనే ఉంటాయని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. కర్ణాటక, గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా.. భయపడాల్సిన పని లేదని ప్రజలకు భరోసా ఇచ్చాయి. బెంగళూరులో గుర్తించినవి ఇప్పటికే దేశంలో ఉన్న పాత వైరస్‌ రకాలేనని.. అవి ప్రాణాంతకం కాదని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేశ్‌ గుండూరావ్‌ ప్రకటించారు. బెంగళూరులో రెండు కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన భేటీ అయి పరిస్థితిని సమీక్షించారు. ఆ శిశువులిద్దరి ఆరోగ్యం సాధారణంగానే ఉందని తెలిపారు.

ప్రజలందరూ సాధారణ ముందుజాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. ఈ వైరస్‌ ప్రధానంగా పిల్లలపై ప్రభావం చూపుతుందని.. సాధారణ జలుబు తరహా ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందని, కొవిడ్‌-19 లాగా వ్యాపించదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైతే దీనికి సంబంధించి అసహజమైన పరిణామాలేవీ లేవు కాబట్టి.. ఈ వైర్‌సవ్యాప్తి కట్టడికి కొవిడ్‌ తరహా ప్రోటోకాల్స్‌ పాటించాల్సిన అవసరం లేదని దినేశ్‌ గుండూరావ్‌ తేల్చిచెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిది నెలల చిన్నారి కూడా మంగళవారం డిశ్చార్జ్‌ కానున్నట్టు ఆయన వెల్లడించారు. ఇక.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని గుజరాత్‌ ఆరోగ్య మంత్రి రుషీకేశ్‌ పటేల్‌ ప్రకటించారు. జనవరి 4నే దీనిపై ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించినట్టు తెలిపారు. మరోవైపు.. కేసుల సంఖ్య పెరిగినా ఎలాంటి ఇబ్బందీ లేకుండా చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం దేశరాజధానిలోని ఆస్పత్రులకు సూచించింది.


పాత వైరస్సే!

నాలుగేళ్ల క్రితం చైనాలో మొదలై ప్రపంచం మొత్తానికీ పాకి లక్షలాది ప్రాణాలు పోవడానికి కారణమైన ‘సార్స్‌ కొవ్‌ 2’ లాగా హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్‌ కాదు. 2001లోనే గుర్తించిన ‘కామన్‌ రెస్పిరేటరీ వైరస్‌’ ఇది. చిన్నపిల్లల్లోనే కాదు.. రోగనిరోధక శక్తి సరిగ్గా లేకపోతే అన్ని వయసులవారిలో ఎగువ, దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఈ వైరస్‌ సోకితే.. జలుబులాంటి లక్షణాలు కనపడతాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చలికాలంలో హెచ్‌ఎంపీవీ ఇన్ఫెక్షన్‌ కేసులు పెరుగుతుంటాయి. ఉదాహరణకు 2023లో ఆస్ట్రేలియాలో వారం వ్యవధిలోనే 1100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే చైనాలో కూడా చలి ఎక్కువగా ఉన్న ఉత్తరాది ప్రాంతాల్లో హెచ్‌ఎంపీవీ కేసులు పెరిగాయి. కరోనా సృష్టించిన విలయం నేపథ్యంలో.. చైనాలో హెచ్‌ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయన్న వార్త ప్రపంచం మొత్తాన్నీ భయంలోకి నెట్టింది. ఇప్పటికే సీజనల్‌ వ్యాధిగా మారినందున.. హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చేసి ఉంటుందని, ఇది కరోనాలాగా మహమ్మారిగా(పాండెమిక్‌) మారే ముప్పు లేదని వైద్యులు చెబుతున్నారు.

తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలు

తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు నోటికి అడ్డంగా చేతి రుమాలు లేదా టిష్యూ పేపర్‌ పెట్టుకోవాలి.

చేతులను తరచుగా సబ్బు, నీరు లేదా ఆల్కహాల్‌ బేస్డ్‌ శానిటైజర్‌తో 20 సెకన్లు శుభ్రం చేసుకోవాలి.

జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడేవారు.. రద్దీప్రదేశాలకు వెళ్లకూడదు.

ఒకవేళ బయటకు వెళ్లాల్సివస్తే నాణ్యమైన మాస్క్‌ ధరించాలి.

వైరస్‌ సోకినవారు సైతం మాస్క్‌ ధరించి ఉండాలి. ఇతరులకు దూరంగా ఉండాలి (సెల్ఫ్‌ ఐసోలేషన్‌).

పౌష్టికాహారం తీసుకోవాలి. మంచినీళ్లు ఎక్కువగా తాగుతుండాలి.

మనం ఉండే చోట గాలి, వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

కరచాలనాలు చేసుకోవడం ఆపేయాలి. ఒకరు వాడిన రుమాలు మరొకరు వాడకూడదు.

జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడేవారికి మరీ దగ్గరగా మెలగకూడదు.

చేతులతో ముఖాన్ని కళ్లు-ముక్కు-నోటి భాగాలను పదేపదే తాకకుండా ఉండాలి.


వ్యాప్తి ఇలా...

ఈ వైరస్‌ సోకినవారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా, ఆ తుంపర్లు పడిన ప్రాంతాలను/వస్తువులను ఇతరులు తాకడం వల్ల, వైరస్‌ బారిన పడ్డవారితో సన్నిహితంగా మెలగడం వల్ల.. ఇతరులకు సోకుతుంది. వైరస్‌ ఇన్‌క్యుబేషన్‌ పీరియడ్‌.. అంటే, అది శరీరంలో ప్రవేశించినప్పటి నుంచి లక్షణాలు కనిపించడానికి పట్టే సమయం.. 3 నుంచి 6 రోజులు. నవజాత శిశువులు, ఐదేళ్లలోపు పిల్లలు, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వృద్ధులు, హెచ్‌ఐవీ వంటివాటితో బాధపడేవారు, అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకుని రోగనిరోధకశక్తిని అణచివేసే మందులు వాడుతున్నవారు ఈ వైరస్‌ బారిన పడే ముప్పు ఎక్కువ.

ఇవీ లక్షణాలు

సాధారణంగా మనకు జలుబు చేసినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయో.. హెచ్‌ఎంపీవీ సోకినప్పుడు కూడా అవే లక్షణాలు కనిపిస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు రెండు నుంచి ఐదు రోజులపాటు ఉండి, ఆ తర్వాత తగ్గిపోతాయి. అయితే.. రోగనిరోధక శక్తి బలంగా లేని పసివారికి, వృద్ధులకు ఈ వైరస్‌ సోకితే వారు న్యూమోనియా, బ్రాంకైటిస్‌ బారిన పడే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో వచ్చే చాలారకాల సీజనల్‌ ఇన్ఫెక్షన్ల వంటిదే కాబట్టి దీని విషయంలో కూడా సాధారణ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని వారు పేర్కొంటున్నారు.

‘‘హెచ్‌ఎంపీవీ ఏమీ కొత్త వైరస్‌ కాదు. ఇది మనదేశంలో ఉన్న పాత వైరస్సే. ఏటా కొంత మంది దీనిబారిన పడతారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రజలందరూ సాధారణ ముందుజాగ్రత్తచర్యలు పాటిస్తే చాలు. ఈ వైరస్‌ వ్యాప్తి కట్టడికి కొవిడ్‌ తరహా ప్రోటోకాల్స్‌ అవసరం లేదు’’

-దినేశ్‌ గుండూరావ్‌, ఆరోగ్య మంత్రి, కర్ణాటక

Updated Date - Jan 07 , 2025 | 04:55 AM