Pew Research: భారత్‌లో మత విద్వేష మంటలు
ABN , Publish Date - Jan 05 , 2025 | 02:41 AM
సామాజిక జీవనంలో మతవిద్వేషం బుసలు కొడుతున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా నివేదిక వెల్లడించింది.
ప్రపంచంలోనే అత్యంత తీవ్రం.. 198 దేశాల్లో భారత్‌కు తొలిస్థానం
తర్వాతి స్థానాల్లో నైజీరియా, సిరియా, పాకిస్థాన్
వెల్లడించిన ప్యూ రీసెర్చ్ సెంటర్
న్యూఢిల్లీ, జనవరి 4: సామాజిక జీవనంలో మతవిద్వేషం బుసలు కొడుతున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా నివేదిక వెల్లడించింది. 2022 సంవత్సరంలో మొత్తం 198 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేసిన ప్యూ సంస్థ తాజాగా ఆ వివరాలతో ఒక నివేదికను విడుదల చేసింది. ‘సామాజిక వర్గాల మధ్య శత్రుత్వ భావన’ (ఎస్‌హెచ్‌ఐ) ఇండెక్స్‌లో గరిష్ఠంగా 10 పాయింట్లకుగాను భారత్ 9.3 పాయింట్లతో తొలి స్థానంలో ఉందని ఈ నివేదిక తెలిపింది. తర్వాత స్థానాల్లో వరుసగా నైజీరియా (8.7), సిరియా (8.1), పాకిస్థాన్ (7.9), ఇరాక్ (7.8), ఈజిప్టు (7.4), ఆఫ్గనిస్థాన్ (7.3) నిలిచాయి. 7.2 పాయింట్లకన్నా ఎక్కువ ఉన్న దేశాలను సామాజిక అశాంతి అత్యధిక స్థాయిలో నెలకొన్న దేశాలుగా ప్యూ సంస్థ వర్గీకరిస్తుంది. మతం కారణంగా ఒక వర్గం ప్రజల్ని వేధింపులకు గురి చేయటం, మూకదాడులు జరపటం, ఉగ్రవాదం, మిలిటెంట్ చర్యలు, మతమార్పిళ్లపై ఉద్రిక్తతలు, మతపరమైన సంకేతాలు, వేషధారణపై ఆంక్షలు వంటి అంశాల ప్రాతిపదికన ఎస్‌హెచ్‌ఐ ఇండెక్స్‌లో దేశాలకు స్కోరు కేటాయిస్తారు. ఒక నిర్దిష్ట మతంపై లేదా కొన్ని మతాలపై ప్రభుత్వం నిర్బంధం విధించే అంశం ఆధారంగా ప్యూ సంస్థ జీఆర్‌ఐ అనే మరో ఇండెక్స్‌ను రూపొందించింది. ఈ ఇండెక్స్‌లో భారత్ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నట్లు తెలిపింది.
జీఆర్‌ఐ ఇండెక్స్‌లో 10 పాయింట్లకుగాను భారత్‌కు 6.4 స్కోరు చేసింది. 6.6 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు ఉన్న దేశాలను అత్యధిక ప్రమాదంలో ఉన్న దేశాలుగా ప్యూ వర్గీకరిస్తుంది. వీటిలో 8.4 పాయింట్లతో ఈజిప్టు తొలిస్థానంలో నిలవగా.. తదుపరి స్థానాల్లో ఆఫ్గనిస్థాన్ (8.2), ఇరాన్ (8.2), సిరియా (7.9), ఇండొనేషియా (7.9) ఉన్నాయి. ఎస్‌హెచ్‌ఐ, జీఆర్‌ఐ ఇండెక్స్‌లు రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. 25 దేశాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని తెలిపింది. వాటిలో భారత్, నైజీరియా, సిరియా, పాకిస్థాన్, ఇరాక్ తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 62ు దేశాల్లో జీఆర్‌ఐ, ఎస్‌హెచ్‌ఐ స్కోరు తక్కువగా లేదా సాధారణ స్థాయిల్లో ఉంది. వీటిలో కెనడా, దక్షిణ కొరియా తదితర దేశాలున్నాయి. 16ు దేశాల్లో జీఆర్‌ఐ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ఎస్‌హెచ్‌ఐ తక్కువగా ఉంది. అంటే, ప్రభుత్వ ఆంక్షల తీవ్రత అధికం కానీ, ప్రజల మధ్య మతపరమైన ఉద్రిక్తతలు లేవు. ఈ దేశాల్లో చైనా, క్యూబా ఉన్నాయి. 10ు దేశాల్లో జీఆర్‌ఐ తక్కువగా ఉన్నప్పటికీ.. ఎస్‌హెచ్‌ఐ ఎక్కువగా నమోదైంది. అంటే, ప్రభుత్వ ఆంక్షలు లేకపోయినా మైనారిటీల మీద విద్వేషం ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి దేశాల్లో బ్రెజిల్, ఫిలిప్పీన్స్ మొదలైనవి ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి
2021తో పోల్చితే జీహెచ్‌ఐ అత్యధికం నుంచి అధికం ఉన్న దేశాల సంఖ్య 55 నుంచి 59కి పెరిగింది. కాగా, 2007లో ప్యూ తన సర్వే నివేదికలను విడుదల చేయటం ప్రారంభించినప్పుడు.. ప్రపంచంలో 40 దేశాలు మాత్రమే మతపరమైన వివక్ష, ఉద్రిక్తతలు అత్యధికంగా ఉన్న జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 45కి పెరిగింది. కాగా, మతపరమైన సమూహాలపై ప్రభుత్వ పరంగా ఆంక్షలు ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయాయని, 198 దేశాలకుగాను 186 దేశాల్లో ఈ పరిస్థితి ఉందని ప్యూ నివేదిక వెల్లడించింది. అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ వివిధ దేశాల్లో పరిస్థితులను సామాజిక అంశాలవారీగా విశ్లేషించి నివేదికలు విడుదల చేస్తుంది.