Share News

ISRO : స్పేస్‌ డాకింగ్‌ మిషన్‌లో ఎన్నో కొత్త పరిజ్ఞానాలు.. వేగం తగ్గింపే సవాల్‌

ABN , Publish Date - Jan 09 , 2025 | 05:45 AM

అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల్లో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ అద్భుతమైన పురోగతి సాధిస్తున్న ఇస్రో ఇటీవల చేపట్టిన అత్యంత క్లిష్టమైన ప్రయోగం.. స్పేస్‌ డాకింగ్‌ మిషన్‌! 220 కిలోల

ISRO : స్పేస్‌ డాకింగ్‌ మిషన్‌లో ఎన్నో కొత్త పరిజ్ఞానాలు.. వేగం తగ్గింపే సవాల్‌

రెండు స్పేడెక్స్‌ ఉపగ్రహాలను రూపొందించిన

అనంత్‌ టెక్నాలజీస్‌ సీఎండీ డా.పావులూరి సుబ్బారావు

‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ

నేడు ఇస్రో నిర్వహించతలపెట్టిన డాకింగ్‌ వాయిదా

అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల్లో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ అద్భుతమైన పురోగతి సాధిస్తున్న ఇస్రో ఇటీవల చేపట్టిన అత్యంత క్లిష్టమైన ప్రయోగం.. స్పేస్‌ డాకింగ్‌ మిషన్‌! 220 కిలోల బరువుతో.. రోదసిలో కక్ష్యలో పరిభ్రమిస్తున్న రెండు ఉపగ్రహాల వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి.. అవి ఢీకొట్టకుండా ఒకదానికొకటి అనుసంధానం (డాకింగ్‌) చేయడం సవాల్‌తో కూడుకున్న పని అని.. స్పేడెక్స్‌ ఉపగ్రహాలను తయారు చేసిన అనంత్‌ టెక్నాలజీస్‌ సంస్థ సీఎండీ డాక్టర్‌ పావులూరి సుబ్బారావు తెలిపారు! హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ స్పేడెక్స్‌ ఉపగ్రహాల కూర్పుతోపాటు, వాటిని ప్రయోగించిన పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (పీఎ్‌సఎల్‌వీ)-సీ60 అసెంబ్లీ, ఇంటిగ్రేషన్‌, టెస్టింగ్‌ను కూడా నిర్వహించింది. రోదసిలో భవిష్యత్తులో మన సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించుకోవాలన్నా, ఇతరత్రా మిషన్లలో అత్యంత కీలకమైనది... ఈ డాకింగ్‌ ప్రక్రియ. దశలవారీగా ఇలా మాడ్యూళ్లను పంపి ఒక పెద్ద నిర్మాణాన్ని చేపట్టవచ్చు. అయితే.. అలా పంపే మాడ్యూళ్లు రోదసిలో అనుసంధానం కావడం మాటల్లో చెప్పినంత తేలిక కాదు. సాంకేతికంగా సంక్లిష్టమైనది. ఏ మాత్రం తేడా వచ్చినా ఉపగ్రహాలు పరస్పరం ఢీకొనే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే.. ఉపగ్రహాల వేగం అనుకున్నదానికన్నా ఎక్కువగా ఉండడంతో గురువారం జరపాల్సిన డాకింగ్‌ను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో.. మిషన్‌కు సంబంధించిన కీలక అంశాల గురించి సీఎండీ డాక్టర్‌ పావులూరి సుబ్బారావు ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా వెల్లడించారు.

స్పేడెక్స్‌ ఉపగ్రహాల తయారీలో అనంత్‌ టెక్నాలజీస్‌ పాత్ర ఏమిటి?

డాక్టర్‌ సుబ్బారావు పావులూరి: ఆ రెండు ఉపగ్రహాలూ బెంగళూరులోని అనంత్‌ శాటిలైట్స్‌ ఫెసిలిటీ.. ‘‘శాటిలైట్‌ ఏఐటీ (అసెంబ్లీ, ఇంటిగ్రేషన్‌ అండ్‌ టెస్టింగ్‌)’’లో తయారయ్యాయి. వాటిలోని కొన్ని ఉప వ్యవస్థలను కూడా మేం అభివృద్ధి చేశాం. ఈ రెండు శాటిలైట్లనూ ప్రయోగించిన లాంచ్‌ వెహికిల్‌ పీఎ్‌సఎల్‌వీ సీ60ని... అందులోని సబ్‌సిస్టమ్స్‌ను కూడా తిరువనంతపురంలో అనంత్‌ టెక్నాలజీస్‌ బృందమే తయారుచేసింది. పీఎ్‌సఎల్‌వీ సీ60ని అసెంబుల్‌ చేసింది, ఇంటిగ్రేట్‌ చేసి పరీక్షించింది (ఏఐటీ) ఆ బృందమే.

ఈ రెండు ఉపగ్రహాలనూ డాకింగ్‌ నిమిత్తం రోదసిలో ఒకే కక్ష్యలో ప్రవేశపెట్టారు కదా.. మిగతా ఉపగ్రహాలకూ వీటికి లాంచింగ్‌ విధానంలో ఏమైనా తేడా ఉందా?

లాంచింగ్‌ విధానంలో తేడా ఏమీ లేదు. రెండు ఉపగ్రహాలనూ రెండు నిమిషాల వ్యవధితో కక్ష్యలోకి విడిచిపెట్టారు. ఆ తర్వాత రెండింటి మధ్య వేగం పరంగా కొంత తేడా ఉండేలా చూస్తారు. రెండింటికీ మధ్య దూరం 20 కిలోమీటర్లకు చేరాక.. డ్రిఫ్టింగ్‌ అరెస్ట్‌ మెనూవర్‌ చేపడతారు. అంటే.. రెండింటి మధ్య దూరం పెరగడం ఆగిపోతుంది. వాటి వేగం తగ్గించడం ద్వారా క్రమంగా రెండూ దగ్గరవడం ప్రారంభిస్తాయి. అయితే ఇది సవాల్‌తో కూడుకున్నది. అలా దూరాన్ని తగ్గించుకుంటూ వచ్చి డాకింగ్‌ చేస్తారు. (ఉపగ్రహాల డ్రిఫ్టింగ్‌ అనుకున్నదానికన్నా ఎక్కువగా ఉండడం వల్ల గురువారం జరగాల్సిన ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు ఇస్రో ట్వీట్‌ చేసింది).

స్పేడెక్స్‌ ఉపగ్రహాల్లో డాకింగ్‌ మెకానిజం ఏమిటి?

ఈ ఉపగ్రహాల్లో ఒకదాన్ని చేజర్‌ (ఎస్‌డీఎక్స్‌ 01) అని.. రెండోదాన్ని చేజర్‌ (ఎస్‌డీఎస్స్‌ 02) అని అంటారు. చేజర్‌ ఉపగ్రహం సెకనుకు 10 మిల్లీమీటర్ల సాపేక్ష వేగంతో టార్గెట్‌ ఉపగ్రహాన్ని చేరి డాక్‌ అవుతుంది. దీన్ని మెకానిజం ఎంట్రీ వ్యవస్థ గుర్తించి.. రెండు ఉపగ్రహాలనూ లాక్‌ చేస్తుంది. అయితే.. డాకింగ్‌కి వాటిలో ఒకటి మేల్‌, ఇంకొకటి ఫిమేల్‌ తరహా మెకానిజం ఉండదు. రెండింటిలోనూ ఒకే తరహా (క్యాప్చర్‌, ఎక్స్‌టెన్షన్‌/రిట్రాక్షన్‌, రిజిడైజేషన్‌) మెకానిజం ఉంటుంది. సంక్లిష్టమైన డాకింగ్‌ ప్రక్రియ మొత్తాన్నీ ఎలాంటి సమస్యా లేకుండా విజయవంతంగా నిర్వహించడానికి ఇస్రో తన 18 గ్రౌండ్‌ స్టేషన్ల నెట్‌వర్క్‌తోపాటు అంతర్జాతీయ కేంద్రాలను కూడా వినియోగించుకుంటోంది.

ఈ ఉపగ్రహాలతో ఇతర ప్రయోగాలు కూడా చేపడతారా?

డాకింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక.. ఇస్రో ఈ రెండు ఉపగ్రహాల మధ్య విద్యుత్తు బదిలీ చేస్తారు. అలాగే.. ఈ ప్రయోగం డాకింగ్‌కి మాత్రమే పరిమితం కాదు.. ఒకసారి డాకింగ్‌ పూర్తయ్యాక వాటిని అన్‌ డాకింగ్‌ చేస్తారు. విడిపోయిన అనంతరం రెండు ఉపగ్రహాల్లోని పేలోడ్స్‌ రెండేళ్లపాటు తమకు నిర్దేశించిన ఆపరేషన్స్‌ చేపడతాయి.

మిషన్‌ కోసం రూపొందించిన కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు ఏమిటి?

దేశీయంగా అభివృద్ధి చేసిన అటానమస్‌ రెండవూస్‌ అండ్‌ డాకింగ్‌ స్ట్రాటజీ, రెండవూస్‌ అండ్‌ డాకింగ్‌ సెన్సర్స్‌ సూట్‌, రెండు ఉపగహ్రాలూ ఒకదానితో మరొకటి స్వతంత్రంగా కమ్యూనికేట్‌ చేసుకోవడానికి వీలుగా.. ఇంటర్‌-శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ లింక్‌ (ఐఎ్‌సఎల్‌) టెక్నాలజీ, విద్యుత్తు బదిలీ పరిజ్ఞానం వంటివాటిని ఇందులో ఉపయోగించారు. భవిష్యత్తులో భారతదేశ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, చంద్రుడి నుంచి నమూనాలను భూమికి తీసుకురావాలన్న లక్ష్యాలను సాధించడానికి ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి అద్భుతమైన ప్రయోగంతో ఇస్రో 2024 సంవత్సరాన్ని ముగించడం సంతోషకరం. 2025లో ఇస్రో మరిన్ని అద్భుతమైన ప్రయోగాలు చేపట్టాలని కోరుకుంటున్నాం.

డాకింగ్‌ మళ్లీ వాయిదా

రోదసిలో స్పేడెక్స్‌ ఉపగ్రహాల డాకింగ్‌ను మరోసారి వాయిదా వేస్తున్నట్టు ఇస్రో తెలిపింది. ఈ ప్రక్రియను జనవరి 7న నిర్వహించ తలపెట్టిన ఇస్రో.. దాన్ని 9వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు..ఉపగ్రహాల మధ్య దూరాన్ని 225మీటర్లకు తగ్గించే క్రమంలో.. వాటి వేగం అనుకున్నదానికన్నా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామని, కాబట్టి గురువారం జరపాల్సిన డాకింగ్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. రెండు ఉపగ్రహాలూ సురక్షితంగా ఉన్నాయని వెల్లడించింది.

Updated Date - Jan 09 , 2025 | 05:45 AM