Share News

మొగుడు పెళ్లాం మధ్యలో గొడవ.. మధ్యలో వెళ్లిన అత్తను..

ABN , Publish Date - Mar 21 , 2025 | 03:22 PM

నాగరాజు భార్య మాట జవదాటేవాడు కాదు. కానీ, ఓ రోజు రాత్రి ఆమెకు తెలియకుండా తల్లి దగ్గరకు భోజనం చేయడానికి వెళ్లాడు. ఈ విషయం శిల్పకు తెలిసింది. దీంతో ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది.

 మొగుడు పెళ్లాం మధ్యలో గొడవ.. మధ్యలో వెళ్లిన అత్తను..
Karnataka

మొగుడు పెళ్లాల మధ్య జరిగే గొడవల్లో తల దూర్చకూడదని పెద్దలు అంటూ ఉంటారు. పెద్దరికం కొద్ది మధ్యలో పోయి ఏదైనా చెబితే.. అది బ్యాక్ ఫైర్ అవుతుందని వారి ఉద్దేశం. ఒకరకంగా చెప్పాలంటే.. మంచి చేయడానికి పోతే చెడు ఎదురవుతుంది. ఈ రోజు కొట్లాడుకున్న వాళ్లు తర్వాత కలిసిపోతారు. అప్పుడు మధ్యలో వెళ్లిన వాళ్లు ఎర్రిపప్పలు అవుతారు. కొన్ని సార్లు భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద గొడవలు అవుతున్నపుడు.. ఆ చుట్టపక్కల ప్రాంతాల్లోకి కూడా వెళ్లకూడదు. అలా వెళితే ఈ పెద్దామెకు పట్టిన గతే మనకూ పడుతుంది. కొడుకు కోడలు గొడవ పడుతుంటే ఆ పెద్దామె చూల్లేక పోయింది. వారికి సర్థి చెప్పడానికి మధ్యలోకి దూరింది. అదే ఆమె చేసిన తప్పయింది. కోడలు.. అత్త మీద దాడి చేసింది.


కోడలి దాడిలో అత్త చావు తప్పి కన్నులొట్టపోయింది. తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయింది. ఈ సంఘటన కర్ణాటకలోని బెల్గాం తాలూకాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెల్గాం తాలూకా మావినకట్టి గ్రామానికి చెందిన నాగరాజు, శిల్పా భార్యా భర్తలు. నాగరాజు తల్లి 80 ఏళ్ల జనవ్వ హుడలి కొడుకుతో కాకుండా వేరే ఇంట్లో కూతురు నందినితో కలిసి ఉంటోంది. నాగరాజు బుధవారం రాత్రి తల్లి ఇంట్లో భోజనం చేయడానికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న శిల్పకు కోపం వచ్చింది. వెంటనే అత్తింటికి పరుగులు తీసింది. అక్కడ భర్తతో గొడవ పెట్టుకుంది. పరిస్థితి ఇద్దరూ కలబడి కొట్టుకునే వరకు వచ్చింది. ఇది చూల్లేకపోయిన జనవ్వ వారిని విడిపించడానికి ప్రయత్నించింది.


అంతే.. శిల్ప అత్తపైకి దూకింది. తీవ్రంగా కొట్టింది. వేలిని కూడా కొరికేసింది. తల్లిని కొడుతుండటంతో నందిని ఆపటానికి వెళ్లింది. నందినిపై కూడా శిల్ప దాడి చేసింది. ఈ దాడిలో నందిని చెవికి గాయం అయింది. గొడవ పెద్దదవుతుండటతో పొరిగిళ్ల వాళ్లు కల్పించుకున్నారు. గొడవను ఆపి, జనవ్వ, నందినిని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వారికి చికిత్స అందించారు. ఆస్పత్రిలో ఉన్నపుడు కూడా జనవ్వ తన కొడుకు గురించే ఆలోచించింది. తన చెయ్యికి గాయం అయిందని, కొడుక్కి తిండిపెట్టలేకపోతున్నాని బాధపడింది. ఇక,ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులను, పొరిగిళ్ల వారిని విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ సహా 1,078 మందిపై కేసునమోదు.. విషయం ఏంటంటే..

Chennai: మాజీసీఎం భద్రతా విభాగంలో పనిచేసిన రిటైర్డ్‌ ఎస్‌ఐ దారుణహత్య

TTD: పరకామణిలో టీటీడీ ఉద్యోగి చేతివాటం..

Updated Date - Mar 21 , 2025 | 04:04 PM