Share News

Kejriwal: పంజాబ్‌ సీఎంగా కేజ్రీవాల్‌?

ABN , Publish Date - Feb 12 , 2025 | 05:29 AM

త్వరలో లూధియానాలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి, మాన్‌ను తప్పించి...కేజ్రీవాల్‌ పంజాబ్‌ సీఎం అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

Kejriwal: పంజాబ్‌ సీఎంగా కేజ్రీవాల్‌?

లూధియానా ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం

మాన్‌పై ఆప్‌ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ పంజాబ్‌ సీఎం కావాలని యోచిస్తున్నారా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. త్వరలో లూధియానాలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి, మాన్‌ను తప్పించి...కేజ్రీవాల్‌ పంజాబ్‌ సీఎం అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్‌ సమావేశమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ ఎన్నికల్లో సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపేందుకే సమావేశం నిర్వహించారని పైకి చెబుతున్నా కేజ్రీవాల్‌ మనసులో మాట పంజాబ్‌ సీఎం పదవేనని తెలుస్తోంది. మరోవైపు, పంజాబ్‌లో కనీసం 40 మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్‌ నేత ప్రతాప్‌ సింగ్‌ బాజ్వా చెప్పడం కలకలం రేపింది. పంజాబ్‌ ఆప్‌లో చీలిక తప్పదనే వదంతులకు ఆయన వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. చాలామంది ఆప్‌ ఎమ్మెల్యేలు సీఎం మాన్‌ వ్యవహారశైలిపై అసంతృప్తిగా ఉన్నారని, నిజానికి చీలికను తప్పించేందుకే కేజ్రీవాల్‌ ఢిల్లీలో సమావేశం నిర్వహించారని ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్‌ నేతల ప్రచారాన్ని సీఎం మాన్‌ కొట్టిపారేశారు. ఆప్‌ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగరని, వేరే పార్టీల్లోకి వెళ్లరని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, పదవి లేనిది కేజ్రీవాల్‌కు దిక్కుతోచదని, అధికారం లేకుండా ఆయన ఉండలేరని బీజేపీ ఎమ్మెల్యే మణిందర్‌ సింగ్‌ సిర్సా చెప్పారు.


పంజాబ్‌ సీఎం కావాలని ఆయన పగటి కలలు కంటున్నారని, అయితే పంజాబ్‌ ఎమ్మెల్యేలు ఆత్మగౌరవం ఉన్న వాళ్లని, కేజ్రీవాల్‌ను పంజాబ్‌ సీఎం కానీయరని సిర్సా చెప్పారు. కాంగ్రెస్‌ ఎంపీ సుఖ్‌జీందర్‌ సింగ్‌ రంధావా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ కనుక పంజాబ్‌ సీఎం అయితే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తప్పవని ఆయన జోస్యం చెప్పారు. ఒకవేళ పంజాబ్‌ సీఎం పదవి కాదనుకున్న పక్షంలో పార్టీని కాపాడుకునే క్రమంలో కేజ్రీవాల్‌ పంజాబ్‌ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు అవకాశముంది. ఇందుకోసం ఆప్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్‌ పాఠక్‌తో రాజీనామా చేయించి ఆయన స్థానంలో పోటీ చేసే అవకాశముంది. రాజ్యసభకు వెళ్తే వివిధ పార్టీల జాతీయ స్థాయి నేతలతో సంప్రదింపులు జరిపేందుకు అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన?

మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ రాజీనామా చేసి రెండు రోజులు గడిచినా.. కొత్త ముఖ్యమంత్రిని బీజేపీ ఇంకా ఎంపిక చేయలేకపోతోంది. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తారన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి బీరేన్‌సింగ్‌ రాజీనామా చేసిన రోజు నుంచే బీజేపీ తమ ఎమ్మెల్యేలతో ఇంఫాల్‌లో క్యాంపు నిర్వహిస్తోంది. ఆ పార్టీ ఈశాన్య రాష్ట్రాల ఇన్‌చార్జి సంబిత్‌ పాత్రా ఆధ్వర్యంలో ఈ క్యాంపు కొనసాగుతోంది. కానీ, కొత్తగా ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలన్న అంశంపై పార్టీలో ఇంకా ఏకాభిప్రాయం రాలేదు. దీంతో సంబిత్‌ పాత్రా మంగళవారం రాష్ట్ర గవర్నర్‌ అజయ్‌కుమార్‌ భల్లాను కలిసి పరిస్థితిని వివరించారు. వీరి భేటీ నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు

Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..

Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి

Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

For National News And Telugu News

Updated Date - Feb 12 , 2025 | 05:29 AM